
గాలిలో 6,428 మంది ఉపాధ్యాయుల భవితవ్యం
హెచ్‌వోడీ పూల్‌లో 3,674 మంది
2,754 మంది క్లస్టర్ మొబిలైజ్ టీచర్లుగా పరిగణన
వీరిని ఎలా ఉపయోగిస్తారో ప్రకటించని విద్యాశాఖ
హేతుబద్ధీకరణతో తీవ్రంగా నష్టపోతున్న వైనం
ప్రత్యేక టీచర్ పోస్టుల భర్తీ ఊసెత్తని ప్రభుత్వం
సాక్షి, అమరావతి: పాఠశాలల పునర్ వ్యవస్థీకరణ, సర్దుబాటులో టీచర్లు భారీగా ప్రభావితమవుతున్నారు. వీరిలో అత్యధికులు స్కూల్ అసిస్టెంట్లే ఉన్నారు. గత వైఎస్ జగన్ ప్రభుత్వంలో జీవో–117 ద్వారా 3–5 తరగతుల విద్యార్థులకు సబ్జెక్టు టీచర్ బోధన అందించేందుకు సీనియర్ ఎస్‌జీటీల్లో అర్హులైన దాదాపు 7,500 మందికి స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పించిన విషయం తెలిసిందే. కూటమి ప్రభుత్వం ఈ జీవోను రద్దు చేయడంతో పాటు 3–5 తరగతులకు సబ్జెక్టు టీచర్ బోధనను రద్దు చేసింది. అంతేగాక.. ఉపాధ్యాయ, విద్యార్థులు నిష్పత్తిని సైతం భారీగా పెంచడంతో అంతేస్థాయిలో స్కూల్ అసిస్టెంట్ల మిగులు ఏర్పడింది.
మిగులు టీచర్లను వివిధ రకాలుగా సర్దుబాటు చేయగా, ఇంకా 6,428 మంది గాలిలో ఉన్నట్టు తెలుస్తోంది. వీరిని క్లస్టర్ మొబిలైజ్ టీచర్లుగాను, హెచ్‌వోడీ పూల్‌లోను ఉంచారు. అయితే, వీరిని ఎలా ఉపయోగించుకోవాలనే దానిపై విద్యాశాఖ నుంచి ఎలాంటి స్పష్టత లేదు. కూటమి ప్రభుత్వం విడుదల చేసిన పాఠశాలల హేతుబద్ధీకరణ, ఉపాధ్యాయుల సర్దుబాటుపై విడుదల చేసిన ఉత్తర్వుల్లో 2,754 మందిని క్లస్టర్ మొబిలైజ్ టీచర్లుగా ప్రకటించారు. మరో 3,674 మందిని హెచ్‌వోడీ పూల్‌లో ఉంచారు.
నిన్న 1,902.. నేడు 1772 మంది
రాష్ట్రంలో సర్‌ప్లస్ స్కూల్ అసిస్టెంట్/సెకండరీ గ్రేడ్ టీచర్, తత్సమాన 2,754 పోస్టులను క్లస్టర్ మొబిలైజ్ టీచర్లుగా కొత్తగా మార్పు చేశారు. వీరిని ఆయా క్లస్టర్లలోని సర్వీస్ ఉపాధ్యాయులు సెలవుల్లో ఉన్నప్పుడు వీరిని ఉపయోగించుకుంటామని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 2,815 క్లస్టర్లు ఉండగా, కేటాయించిన పోస్టులు తక్కువగా ఉన్నాయి. ఈ క్రమంలో వీరిని ఎలా ఉపయోగించుకుంటారనేది పెద్ద ప్రశ్నగా మారింది.
సర్దుబాటు ఉత్తర్వుల మేరకు జిల్లాల్లోని మిగులు పోస్టులను ప్రైమరీ స్కూల్ హెచ్‌ఎం, క్లస్టర్ లెవెల్ మొబిలైజ్ టీచర్, స్పెషల్ ఎడ్యుకేషన్, హెచ్‌వోడీ క్యాడర్, మున్సిపాలిటీ మేనేజ్‌మెంట్లకు బదలాయిస్తూ బుధవారం పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. సర్దుబాటు అనంతరం ఇంకా 8 జిల్లాల్లో 1,772 పోస్టులు మిగులుగా ప్రకటించారు. ఇందులో 362 స్కూల్ అసిస్టెంట్లు, మరో 1,410 ఎస్‌జీటీలు ఉన్నారు. వీరు మంగళవారం హెచ్‌వోడీ పూల్‌కు అప్పగించిన 1,902 మందికి అదనం.
వీరి వివరాలను నిర్దిష్ట ఫార్మాట్‌లో పంపాలని డీఈవోలకు ఆదేశాలు అందినట్టు సమాచారం. పాఠశాల స్థాయిలో అవసరానికి అనుగుణంగా వృత్తి బోధకులు, ఆర్ట్, క్రాఫ్ట్, డ్రాయింగ్, సంగీత ఉపాధ్యాయ పోస్టులను కేటాయించాలని, 2024–25 విద్యా సంవత్సరంలో ప్రత్యేక అవసరాలున్న పిల్లల నమోదు ఆధారంగా అవసరమైన పాఠశాలలకు స్కూల్ అసిస్టెంట్ (స్పెషల్ ఎడ్యుకేషన్) పోస్టులను మంజూరు చేసేలా చర్యలు చేపట్టాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. మారిన పోస్టుల వివరాల మేరకు క్యాడర్ స్ట్రెంగ్త్‌ను అప్‌డేట్ చేయాలని విద్యాశాఖ ఆదేశించింది. పాఠశాలల పునర్ నిర్మాణానికి అనుగుణంగా పాఠశాల పేర్లను మార్చాలని కూడా ఆదేశాలు జారీ చేసింది.
‘స్పెషల్’ టీచర్ల మాటేంటి?
ప్రస్తుతం ఉన్నత పాఠశాలల్లో సుమారు 700 మంది స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లు పనిచేస్తున్నట్టు తెలుస్తోంది. వీరినే సర్దుబాటు చేయాలని డీఈవోలను విద్యాశాఖ ఆదేశించింది. రాష్ట్రంలోని దివ్యాంగ విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఇటీవల ప్రభుత్వం 2,260 రెగ్యులర్ టీచర్ పోస్టులను స్పెషల్ టీచర్ పోస్టులుగా మార్చింది. ఇందులో1,136 ఎస్జీటీలు, 1,124 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. అయితే, కొత్త పోస్టుల భర్తీపై ప్రభుత్వం ఎలాంటి ప్రకటనా చేయలేదు.
వాస్తవానికి జాతీయ విద్యా విధానం–2020లో భాగంగా ప్రతి పాఠశాలలోను స్పెషల్ టీచర్లను నియమించాలి. అలాగే, కేంద్ర ప్రభుత్వం 2022లో జారీచేసిన గెజిట్, రిహేబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(ఆర్‌సీఐ) నిబంధనల ప్రకారం ప్రాథమిక తరగతుల్లో ప్రతి 10 మంది ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు ఒక స్పెషల్ టీచర్‌ను, ఉన్నత పాఠశాలల్లో 15 మందికి ఒక టీచర్ చొప్పున నియమించాలి. కొత్త పోస్టుల భర్తీ ఊసెత్తకుండా ఉన్న పోస్టులనే సర్దుబాటు చేయాలనడంపై విమర్శలు వినిపిస్తున్నాయి.