సాక్షి, అమరావతి: పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులకు తక్షణమే శిక్షణ ఇచ్చి పోస్టింగ్ ఇవ్వాలని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డీవైఎఫ్‌ఐ) రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు వై.రాము, జి.రామన్న శుక్రవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం 2022 నవంబరు 28న 6,100 పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చిందన్నారు. అర్హత పరీక్షలో 95,208మంది అర్హత సాధించారని తెలిపారు. చంద్రబాబు ప్రభుత్వం 2025 జనవరి, ఫిబ్రవరిలో ఫిజికల్ ఈవెంట్స్ నిర్వహించిందని, అందులో 40 వేల మంది అర్హత సాధించారని తెలిపారు.
జూన్‌లో మెయిన్స్ పరీక్షలు నిర్వహించి ఆగస్టులో రిజల్ట్స్ ఇచ్చారన్నారు. మెడికల్ టెస్ట్‌లు సైతం నిర్వహించి రెండు నెలలకుపైగా అయ్యిందన్నారు. ఇప్పటికే అభ్యర్థులు మానసిక ఒత్తిడికి గురౌతున్నారని తెలిపారు. ప్రభుత్వం ఆర్భాటం కోసం నిరుద్యోగులను ఇలా బలి చేయడం సరి కాదన్నారు. తక్షణమే ట్రైనింగ్ ఇచ్చి పోస్టింగ్ ఇవ్వాలని, లేని పక్షంలో డీవైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ఆందోళనకు దిగుతామని రాము, రామన్న హెచ్చరించారు.


