చంద్రబాబు సర్కార్ ఖాతాలో మరో క్రెడిట్ చోరీ
ఇన్నాళ్లూ రైతుల్ని ఇబ్బంది పెట్టి.. ఇప్పుడు రక్షకుడిని అంటున్న వైనం
2014–19 మధ్య 6 లక్షల ఎకరాలను 22ఏ జాబితాలో పెట్టింది చంద్రబాబే
చుక్కల భూములు, షరతులు గల పట్టా భూముల సమస్య ఆయన సృష్టే
గత వైఎస్ జగన్ ప్రభుత్వంలో వాటికి హక్కులు కల్పించడంతో అసూయ
2024లో కక్షపూరితంగా 20 లక్షల ఎకరాలను 22ఏ జాబితాలో పెట్టిన బాబు
గత ప్రభుత్వ హయాంలో అక్రమాలు జరిగినట్లు అడ్డగోలుగా ఆరోపణలు
విచారణలో అవన్నీ సక్రమమే అని తేలడంతో ఇప్పుడు ప్లేట్ ఫిరాయింపు
1.39 లక్షల ఈనాం భూముల 22ఏ జాబితాపై ఆంక్షలు
తొలగించాలని ఆదేశాలు.. షరతులు గల పట్టా భూములపై ఆంక్షలు ఎత్తివేత
9.30 లక్షల ఎకరాల ఫ్రీహోల్డ్ భూములపై ఆంక్షలు ఎత్తివేసేందుకు సన్నాహాలు
ఈ భూములన్నింటినీ వివాదంలో పెట్టి.. ఇప్పుడు విముక్తి కల్పిస్తున్నట్లు ప్రచారం
సాక్షి, అమరావతి: చంపేయాలనే కసితో ఒక వ్యక్తిపై దాడి చేసి, ఆ తర్వాత ఏమీ తెలియనట్లు అతన్ని ఆస్పత్రికి తీసుకెళ్లి తానే బతికించానని చెప్పుకోవడాన్ని ఏమంటారు? రాష్ట్రంలో 22ఏ జాబితా భూముల విషయంలో ఇప్పుడు చంద్రబాబు సర్కారుది అచ్చు ఇదే తంతు. ఇన్నాళ్లూ ఈ భూములన్నింటినీ వివాదంలో పెట్టి.. ఇప్పుడు తానే విముక్తి కల్పిస్తున్నట్లు డబ్బా కొట్టుకుంటూ మరోమారు క్రెడిట్ చోరీకి బరితెగించారు. ఈ క్రమంలో భూముల వ్యవహారంలో చంద్రబాబుది అత్యంత నీచమైన రాజకీయ క్రీడ అని ఆ రంగానికి చెందిన నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. 2024లో చంద్రబాబు అధికారంలోకి వచ్చిన వెంటనే కక్షపూరితంగా 20 లక్షల ఎకరాలను 22ఏ జాబితాలో పెట్టి.. పేద, మధ్యతరగతి రైతుల ఉసురు పోసుకున్నారు. జగన్ హయాంలో అక్రమాలు జరిగాయనే నెపం వేసి రెండేళ్లు ఆ భూముల రిజిస్ట్రేషన్లు జరక్కుండా వివాదంలో పెట్టారు.
అనేక విచారణల తర్వాత అక్రమాలు లేవని తేలడంతో ఇప్పుడు ఆ భూములను 22ఏ జాబితా నుంచి తొలగించడానికి ఆదేశాలు ఇచ్చారు. పైగా తానే ఆ భూములకు విముక్తి కల్పిస్తున్నట్లు చంద్రబాబు ప్రచారం చేసుకుంటుండటం విస్తుగొలుపుతోంది. 2014–19 మధ్య అధికారంలో ఉన్నప్పుడు కూడా చంద్రబాబు 6 లక్షల ఎకరాలకుపైగా భూములను 22ఏ జాబితాలో పెట్టారు. నాలుగవసారి ముఖ్యమంత్రిగా ఉన్నానని చెప్పుకోవడమే తప్ప ఆయన హయాంలో భూముల సమస్యలు పరిష్కారం కాకపోగా, ఇంకా ఎక్కువయ్యాయి. రాష్ట్రంలో 22ఏ భూముల వ్యవహారాన్ని అత్యంత క్లిష్టమైన సమస్యగా మార్చింది చంద్రబాబే. చుక్కల భూములు, షరతులుగల పట్టా భూములు, ఈనాం భూములే అందుకు ప్రత్యక్ష ఉదాహరణ. చివరికి పేద రైతులకు మేలు చేయాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వం హక్కులు కల్పించిన ఫ్రీహోల్డ్ భూములపైనా ఆయనది అదే తీరు. 

చుక్కల భూములను చిక్కుల్లో పెట్టింది బాబే
2016లో 4.10 లక్షల ఎకరాల చుక్కల భూములను అప్పటి చంద్రబాబు ప్రభుత్వం 22ఏ జాబితాలో పెట్టింది. అంతకు ముందు ఆ భూముల రికార్డులు పక్కాగా లేకపోయినా, అవి రైతుల అనుభవంలోనే ఉండడంతో రిజిస్ట్రేషన్లు జరిగేవి. వాటిని సక్రమం చేసే పేరుతో ఏకంగా లక్షల మంది రైతులను నట్టేట ముంచి రిజిస్ట్రేషన్లు జరక్కుండా చేశారు. 2019లో వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ సమస్యపై ఫోకస్ పెట్టి.. 15 జిల్లాల్లో 2.06 లక్షల ఎకరాలను 22ఏ జాబితా నుంచి తొలగించారు. ఇందుకోసం 1.81 లక్షల సర్వే నంబర్లను పలుమార్లు రీ వెరిఫికేషన్ చేయించారు. దీంతో ఆ రైతులకు హక్కులు వచ్చాయి. అయితే ఆ ఆనందం ఎక్కువ కాలం నిలవలేదు. 2024లో చంద్రబాబు మళ్లీ అధికారంలోకి రాగానే వాటిని 22ఏ(నిషేధిత) జాబితాలో పెట్టించారు.
షరతుల పట్టా భూములకూ అన్యాయమే
షరతులు గల పట్టా భూముల విషయంలోనూ చంద్రబాబుది అదే తీరు. రాష్ట్ర వ్యాప్తంగా 40 వేల ఎకరాలుండగా, కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలోనే 33 వేల ఎకరాలను 2016లో ఆయన ప్రభుత్వం 22ఏ జాబితాలో పెట్టేసింది. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి రిజిస్ట్రేషన్లు జరుగుతున్న భూముల్ని ఒక్క ఆదేశంతో వివాదాస్పదం చేసేశారు. 2023లో వైఎస్ జగన్ వాటిని 22ఎ జాబితా నుంచి తొలగిస్తే, 2024 జూన్‌లో మళ్లీ వాటిని చంద్రబాబు 22ఏ జాబితాలో పెట్టించడంతో ఆ రైతులు నెత్తీనోరూ బాదుకున్నారు. ఇంతా చేసి ఇటీవలే తన హయాంలోనే ఆ రైతులకు మేలు చేస్తున్నట్లు చెప్పుకుంటూ ఆ భూములను 22ఏ జాబితా నుంచి తొలగించాలని కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చారు. ఈనాం భూముల విషయంలో సైతం అదే తీరు. గత జగన్ ప్రభుత్వం 1.39 లక్షల ఎకరాల సర్వీస్ ఈనాం రైతులకు కల్పించిన ఫ్రీ హోల్డ్ హక్కులను కేవలం రాజకీయ కక్షతో 22 నెలల పాటు 22ఏ జాబితాలో పెట్టారు. ఇప్పుడు అవే భూములకు తమ ప్రభుత్వం విముక్తి కల్పిస్తున్నట్లు నిస్సిగ్గుగా చెప్పుకుంటున్నారు. 2024 ఆగస్టులో ఆ భూముల్ని నిర్దాక్షిణ్యంగా 22ఏ జాబితాలో పెట్టింది చంద్రబాబే.
ఫ్రీ హోల్డ్ భూములపైనా అదే తంతు
రాష్ట్రంలో ఎన్నడూ లేని రీతిలో గత ప్రభుత్వం 20 సంవత్సరాలు దాటిన అసైన్డ్ భూములపై పేద రైతులకు యాజమాన్య హక్కులు (ఫ్రీ హోల్డ్) కల్పించింది. 27.40 లక్షల ఎకరాలకు చెందిన 15.20 లక్షల మంది అసైన్డ్ రైతులకు సంపూర్ణంగా హక్కులు కల్పించడంతో వారు ప్రైవేటు భూముల తరహాలో తమ భూములకు హక్కుదారులయ్యారు. ఎన్నికలు జరిగే సమయానికి 13.59 లక్షల ఎకరాలకుపైగా అసైన్డ్ భూములను గత ప్రభుత్వం ఫ్రీ హోల్డ్ చేసి రైతులను యజమానులను చేసింది. చంద్రబాబు అధికారంలోకి రాగానే ఆ భూములన్నింటినీ 22ఏ జాబితాలో పెట్టేశారు. అనేక వెరిఫికేషన్లు, విచారణలు చేసి అక్రమాలేవీ లేవని తేలడంతో వాటిని ఇప్పుడు తీరిగ్గా 22ఏ జాబితా నుంచి తొలగించాలని నిర్ణయించారు. అయితే చేసిన తప్పును ఒప్పుకోకుండా ఈ భూములకు హక్కులిచ్చింది తానేనని ప్రచారం చేసుకోవడంపై రైతులు మండిపడుతున్నారు. పేదలకు వారి భూములపై హక్కులు ఇవ్వకూడదనే రీతిలో రెండేళ్లపాటు ఆ భూములపై ఆంక్షలు విధించి, దాన్ని అక్రమంగా అభివర్ణించి.. ఇప్పుడు ప్లేటు ఫిరాయించడం ఒక్క చంద్రబాబుకే సాధ్యమని రాష్ట్రంలో చర్చ జరుగుతోంది.
అసైన్డ్ ఇళ్ల స్థలాల పైనా అదే తీరు
రాష్ట్రంలో అసైన్డ్ ఇళ్ల స్థలాల కేటాయింపు పూర్తయి పదేళ్లు దాటితే వాటిపై లబ్ధిదారులకు హక్కులు కల్పించాలని 2023లో అప్పటి వైఎస్ జగన్ ప్రభుత్వం నిర్ణయించి అమల్లోకి తెచ్చింది. 20 ఏళ్లు దాటిన అసైన్డ్ వ్యవసాయ భూములు, పదేళ్లు దాటిన అసైన్డ్ ఇళ్ల స్థలాలను పొందిన పేదలకు యాజమాన్య హక్కులు కల్పించేందుకు 2023లో అసైన్డ్ భూముల చట్టాన్ని సవరించింది. దాని ప్రకారమే 27 లక్షల ఎకరాల అసైన్డ్ భూములకు యాజమాన్య హక్కులు లభించగా.. వాటిలో 13.59 లక్షల ఎకరాలను వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలోనే ఫ్రీ హోల్డ్ చేశారు. అదే సమయంలో పదేళ్లు దాటిన అసైన్డ్ ఇళ్ల స్థలాలనూ ఫ్రీ హోల్డ్ చేసేందుకు ఆదేశాలిచ్చారు.
రిజిస్ట్రేషన్లు చేయాలని జిల్లా కలెక్టర్లు, రిజిస్ట్రేషన్ల శాఖకు నాటి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఆదేశాలు కూడా ఇచ్చింది. దీని ప్రకారం అనేక చోట్ల రిజిస్ట్రేషన్లు జరిగాయి. అయితే చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక.. మొత్తం ఫ్రీ హోల్డ్ భూములను అక్రమాలు జరిగాయన్న ఆరోపణతో మళ్లీ 22ఏ జాబితాలో పెట్టేసింది. ఇన్నాళ్లు నానా ఇబ్బందులు పెట్టి.. చివరికి అక్రమాలేవీ జరగలేదని తేలడంతో చేసేదేమీ లేక ఇప్పుడు తాజాగా ఆ చట్టాన్ని అమలు చేయాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగానే ఫ్రీ హోల్డ్ అయిన వ్యవసాయ భూములు, పదేళ్లు దాటిన అసైన్డ్ ఇళ్ల పట్టాలను రిజిస్ట్రేషన్ చేయాలని తాజాగా మార్గదర్శకాలు జారీ చేస్తున్నారు. ఇన్నాళ్లు రిజిస్ట్రేషన్ జరగకుండా అడ్డుకుని ఇప్పుడు ఆ ఘనత తనదేనని నిస్సిగ్గుగా చెప్పుకోవడం చంద్రబాబుకే చెల్లింది.


