పోస్టును బట్టి రూ.15 లక్షల వరకు ‘ముఖ్య’నేత బంధువు వసూళ్లు
టీచర్ పోస్టులకు బేరం పెట్టి మొత్తం రూ.40 కోట్ల నుంచి రూ.50 కోట్ల వరకు క్రీడాశాఖలో మాస్టర్‌మైండ్ వసూళ్ల దందా
నాన్ లోకల్ కోటా పోస్టులను నిబంధనలకు విరుద్ధంగా భర్తీ చేయడంతో నష్టపోయిన స్థానిక అభ్యర్థులు.. పోస్టల్ శాఖ క్రీడా కోటాలో ఉద్యోగానికి అనర్హులుగా తేలిన వారికి ఏపీ డీఎస్సీ 2025లో ఉద్యోగం..
అర్హులకు తీవ్ర అన్యాయం చేస్తూ దొంగ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు..
రాత పరీక్ష లేకుండానే స్పోర్ట్స్ కోటాలో 421 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ
వసూళ్ల దందా పూర్తి కావడంతో జీవో 4ను సవరించి చేతులు దులుపుకొనే యత్నం
డీఎస్సీలో అక్రమాలపై సీబీఐతో విచారణ చేపట్టాలని అభ్యర్థుల డిమాండ్
డీఎస్సీలో స్థానికంగా మెరిట్ అభ్యర్థులను పక్కన పెట్టి.. నాన్–లోకల్ కోటాలో బయట జిల్లా వ్యక్తికి ఉద్యోగం ఇచ్చేశారు. నాన్ లోకల్‌లో పోటీపడే వారు స్థానికుల కంటే మెరిట్ జాబితాలో అగ్రస్థానంలో ఉండాలి. కానీ, సదరు ఉద్యోగి స్థానికుల కంటే రెండు స్థానాలు దిగువన ఉన్నప్పటికీ రాయలసీమ జిల్లాలో నాన్‌లోకల్ కోటాలో పోస్టు కట్టబెట్టేశారు. ఈ విషయం పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులకు తెలిసినా మిన్నకుండిపోయారు.
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో డీఎస్సీ–2025 పోస్టుల భర్తీలో అవినీతి, అక్రమాల దందా రాజ్యమేలింది. అర్హులకు తీవ్ర అన్యాయం చేస్తూ... నకిలీ ధ్రువపత్రాలతో అనర్హులకు చంద్రబాబు సర్కార్ ఉద్యోగాలు కట్టబెట్టినట్లు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ‘ముఖ్య’నేతకు బంధువుగా చెప్పుకుంటూ క్రీడాశాఖలో కీలక పదవిని అనుభవిస్తున్న వ్యక్తి ఈ వసూళ్ల దందాలో మాస్టర్ మైండ్‌గా వ్యవహరించినట్లు చెబుతున్నారు. ముందస్తు ప్రణాళిక ప్రకారం కొందరు అభ్యర్థులతో డీల్ కుదుర్చుకుని ఒక్కొక్కరి నుంచి పోస్టును బట్టి రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు వసూలు చేసినట్లు తెలుస్తోంది. మొత్తం రూ.40 కోట్ల నుంచి రూ.50 కోట్ల వరకు దండుకున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
అందుకే జీవోలో అప్రాధాన్య నేషనల్ గేమ్స్‌ను చేర్చారని స్పష్టం చేస్తున్నారు. డీఎస్సీ నోటిఫికేషన్ కంటే ముందే వ్యూహాత్మకంగా క్రీడా విధానం (స్పోర్ట్స్ పాలసీ) 2024–25 ప్రకటించి ఉపాధ్యాయ పోస్టులను అంగట్లో సరుకులు మాదిరిగా విక్రయించినట్లు పేర్కొంటున్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా 421 డీఎస్సీ పోస్టులను క్రీడా కోటాలో పరీక్ష లేకుండా భర్తీ చేయడం ఒక ఎత్తయితే.. భారీగా ముడుపులు తీసుకుని అనర్హులకు ఉద్యోగాలు కట్టబెట్టడం మరో ఎత్తు. క్రీడా విధానం రూపకల్పన సమయంలో అక్రమాలకు తెర తీస్తూ జీవో నంబర్ 4లో స్పోర్ట్స్ ప్రాధాన్యతలను ఇవ్వడం.. డీఎస్సీ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఇప్పుడు ఆ ప్రాధాన్యతలను మార్పు చేస్తుండటం తీవ్ర చర్చనీయాంశమైంది. తమ జీవితాలతో చంద్రబాబు సర్కారు గేమ్స్ ఆడిందని అభ్యర్థులు వాపోతున్నారు.
సీబీఐతో విచారణకు డిమాండ్..
కొన్ని క్రీడా సంఘాలను భయపెట్టి క్రీడాకారుల పోస్టులకు అనుగుణంగా అవసరమైన పత్రాలు రూపొందించడంలో మాస్టర్ మైండ్ చక్రం తిప్పారు. ఈ అవినీతి బాగోతాన్ని నడిపించడంలో క్రీడా ప్రాధికార సంస్థలోని ఓ డీఎస్‌డీవో రేయింబవళ్లు మాస్టర్‌మైండ్‌కు సహాయ సహకారాలు అందించారు. చిన్నాచితకా సర్టిఫికెట్లు ఉన్నవారికి ఉద్యోగాలు కట్టబెట్టేశారు. అందులోనూ రెండేసి డేట్ ఆఫ్ బర్త్‌లు ఉన్నా, సబ్ జూనియర్ స్థాయి నుంచి వరస క్రమంలో సర్టిఫికెట్లు లేకున్నా పోస్టులు ఇచ్చేశారు. ఐదు నుంచి పది పోస్టులు మినహా చాలావరకు క్రీడా కోటాలోనే భర్తీ చేయడం గమనార్హం. దీనిపై కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐతో సమగ్ర విచారణ చేయించి అక్రమార్కులను కఠినంగా శిక్షించాలని క్రీడాకారులు డిమాండ్ చేస్తున్నారు.
ప్రతిభకు ప్రాధాన్యం ఎక్కడ?
క్రీడా విధానం 2024–29లో భాగంగా క్రీడా కోటా రిజర్వేషన్లు కల్పిస్తూ చంద్రబాబు సర్కార్ జీవో 4 జారీ చేసింది. ఇందులో విచిత్రంగా సీనియర్ నేషనల్ విభాగం కంటే ‘నేషనల్ గేమ్స్’కు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. ఇదంతా ముందస్తు పథకం ప్రకారం చేశారు. ఫెడరేషన్ల ఆధ్వర్యంలో జరిగే సీనియర్ నేషనల్స్ సర్టిఫికెట్‌కు అత్యధిక ప్రాధాన్యం ఉంటుంది. జాతీయ జట్టు ఎంపికలు సైతం వాటి ఆధారంగానే చేస్తారు. రెండేళ్లకు ఒకసారి రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో నిర్వహించే ‘నేషనల్ గేమ్స్’ను పెద్దగా ఎవరూ పరిగణనలోకి తీసుకోరు.
జాతీయ జట్ల ఎంపికలతో వీటికి సంబంధం ఉండదు. ఇందులో చాలా రాష్ట్రాలు తమ ప్రాతినిధ్యాన్ని సైతం పెద్దగా ప్రోత్సహించవు. అలాంటి ‘నేషనల్ గేమ్స్’ను చంద్రబాబు సర్కారు జీవో 4లో ప్రాధాన్యంగా పెట్టి డీఎస్సీ క్రీడా కోటాలో అక్రమాలకు తెర తీసింది. డీఎస్సీ నోటిఫికేషన్ కంటే ముందే క్రీడా కోటాలో పోస్టులను అమ్ముకునేందుకు ముఖ్యనేతకు బంధువుగా చెప్పుకునే ‘మాస్టర్‌మైండ్’ పక్కా స్కెచ్ వేశారు. కేవలం పోస్టులు అమ్ముకోవడం కోసమే జీవో 4లో నేషనల్ గేమ్స్‌ను చేర్చి.. వసూళ్ల దందా పూర్తి కావడంతో ఆ జీవోను సవరించి చేతులు దులుపుకొనే యత్నం చేస్తున్నట్టు సమాచారం.
హైకోర్టు ఆదేశాలు బేఖాతర్...
⇒ చంద్రబాబు సర్కారు జారీ చేసిన డీఎస్సీ–2025 నోటిఫికేషన్‌కు సంబంధించి పలు న్యాయవివాదాలు రేకెత్తాయి. డీఎస్సీ ప్రక్రియలో పలు లోపాలు ఉన్నాయని, పోస్టుల భర్తీలో తప్పులు దొర్లాయని పెద్ద ఎత్తున అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో డీఎస్సీపై 104కుపైగా కేసులు దాఖలయ్యాయి. రిజర్వేషన్లు అమలు, స్పోర్ట్స్ కోటాతో పాటు దరఖాస్తు దశలోనే పోస్టుల ప్రాధాన్యం తీసుకోవడం లాంటి వాటిల్లో తమకు అన్యాయం జరిగిందని కోర్టుకు ఫిర్యాదు చేశారు. కీలకమైన పోస్టుల ప్రాధాన్యంపై అప్పట్లో హైకోర్టు స్పందిస్తూ ప్రతిభ గల అభ్యర్థులు నష్టపోకుండా ఉన్నతమైన ఉద్యోగం పొందడం వారి హక్కు అని తీర్పునిచ్చింది. అయితే, ఆ తీర్పు ఇచ్చిన రోజే.. ఆర్డర్ కాపీ రాకుండా హడావుడిగా ఫలితాలను ప్రకటించి చంద్రబాబు సర్కారు పోస్టులను భర్తీ చేసింది. కాగా ‘మాస్టర్‌మైండ్’కు చెందిన ఓ అసోసియేషన్ నుంచి సర్టిఫికెట్లు పొందిన వారికి తగిన అర్హతలు లేకున్నా టీచర్ పోస్టులు కట్టబెట్టేశారు. అనంతరం ఆ మాస్టర్‌మైండ్ సన్మానం కూడా చేయించుకున్నారు. అయితే ఆ నియామక పత్రాలు ఇచ్చేలోగా ప్రతిభ గల కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించడంతో వెనక్కి తగ్గారు.
⇒ విజయనగరం జిల్లాకు చెందిన ఓ వెయిట్ లిఫ్టర్ కేంద్ర ప్రభుత్వ పరిధిలోని పోస్టల్ శాఖలో క్రీడా కోటాలో ఉద్యోగానికి అనర్హురాలిగా తేలింది. తప్పుడు జనన ధ్రువీకరణ పత్రాలతో మోసగించేందుకు యత్నించినట్లు గుర్తించడంతో విజయనగరం జిల్లాలో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. అయితే అనూహ్యంగా ఆమె ఏపీ డీఎస్సీ–2025లో క్రీడా కోటాలో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్‌గా ఎంపికైంది. దీనిపై సామాజిక కార్యకర్తలు ‘శాప్’కు సైతం ఫిర్యాదు చేశారు.
⇒ విజయనగరానికి చెందిన మరో క్రీడాకారుడు జాతీయ స్థాయిలో అద్భుత ప్రతిభ కనబరిచి పతకాలు పొందారు. ఏపీ డీఎస్సీలో క్రీడా కోటాలో ఉద్యోగానికి దరఖాస్తు చేసుకుంటే నిర్ద్వందంగా తిరస్కరించారు. ఆ తర్వాత ఆయన పోస్టల్ శాఖలో అదే క్రీడా కోటాలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం పొందారు.


