ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిని డిస్మిస్ చేసిన ప్రభుత్వం
సమస్యలు పరిష్కరించాలని అడగడమే ఆయన చేసిన నేరం.. ఉద్యోగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా చంద్రబాబు సర్కారు వేధింపులు
అన్ని వర్గాల ఉద్యోగులు రోడ్డెక్కుతుండడంతో బెదిరించి భయపెట్టే కుతంత్రం
పెండింగ్ డీఏలు, పీఆర్సీ ఇవ్వాలని ఉద్యోగ సంఘాల డిమాండ్
బకాయి పెట్టిన దాదాపు రూ.40 వేల కోట్లు చెల్లించేదెప్పుడు?
ఈ నెలలోనే భారీ ఆందోళనలకు సిద్ధమైన ఉపాధ్యాయ సంఘాలు
సాక్షి, అమరావతి: రెడ్‌బుక్ రాజ్యాంగంతో వ్యవస్థలను గుప్పిట పట్టి రాష్ట్రంలో టెర్రర్ సృష్టిస్తున్న చంద్రబాబు సర్కారు తాజాగా ఉద్యోగులపైనా దాన్ని ప్రయోగించింది. ఇచ్చిన హామీలను నెరవేర్చాలని అడిగిన పాపానికి ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షుడు, రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడు కె.వెంకట్రావిురెడ్డిని ఏకంగా ఉద్యోగం నుంచే తొలగించింది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో అసిస్టెంట్ సెక్రటరీగా పని చేస్తున్న కె.వెంకట్రావిురెడ్డిని సర్వీసు నుంచి తొలగిస్తూ చంద్రబాబు ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. తద్వారా సమస్యలపై ప్రశ్నిస్తూ రోడ్డెక్కుతున్న ఉద్యోగులను భయపెట్టి నోరెత్తకుండా చేయాలన్నది కుతంత్రమని స్పష్టమవుతోంది. వెంకట్రావిురెడ్డిని ఉద్యోగం నుంచి తొలగించేందుకు గత ఎన్నికల్లో ఆయన వైఎస్సార్‌సీపీకి అనుకూలంగా ప్రచారం చేశారనే సాకు చూపారు.
టీడీపీ పెద్దలకు నచ్చిన విధంగా నివేదిక ఇప్పించుకుని..
తమ పార్టీ కార్యకర్తలకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చేందుకు నిస్సిగ్గుగా చట్టాన్ని సైతం మార్చాలని చూసిన చంద్రబాబు సమస్యలపై గళమెత్తిన ఉద్యోగులను మాత్రం కక్షగట్టి వేధిస్తున్నారు. ఉద్యోగుల సమస్యలపై పోరాడటంలో ముందుండే వెంకట్రావిురెడ్డిపై కక్ష గట్టి 2024 ఎన్నికల సమయంలోనే తప్పుడు ఆరోపణలతో సస్పెండ్ చేయించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక సస్పెన్షన్‌ను కొనసాగించింది. సస్పెన్షన్‌లో ఉండగానే.. ఆయన వైఎస్సార్‌సీపీకి అనుకూలంగా పని చేస్తున్నారని తప్పుడు ఆరోపణలు మోపి విచారణ జరిపింది. గత ఎన్నికల్లో ఆయన ఆర్టీసీ డిపోల్లో ఎన్నికల ప్రచారం చేసినట్లు తప్పుడు ఆధారాలు సృష్టించింది.
నిజానికి ఎన్నికల ప్రచారం జరగలేదని ఆయా డిపో మేనేజర్లు స్పష్టంగా నివేదికలు ఇచ్చినా.. అధికార యంత్రాంగం చంద్రబాబు చేతిలో ఉండడంతోనే వెంకట్రావిురెడ్డికి వ్యతిరేకంగా నివేదిక ఇప్పించుకున్నారు. దాన్ని ఆధారంగా చేసుకుని ఆయన్ను సర్వీసు నుంచి తొలగించారు. వెంకట్రావిురెడ్డి 2014–19లోనూ ఉద్యోగుల సమస్యలపై ప్రశ్నిస్తున్నారని బాబు ప్రభుత్వం ఆయనపై కక్ష సాధించింది. అప్పట్లో 15 నెలలపాటు సస్పెండ్ చేసింది. ఆయన తప్పు లేదని తేలడంతో తిరిగి విధుల్లోకి తీసుకున్నా.. ఉద్యోగుల విషయంలో చంద్రబాబు అనుసరిస్తున్న మోసపూరిత వైఖరిని తరచూ బయటపెడుతుండడం కంటగింపుగా మారింది.
ఉద్యమించడంతో బెదిరింపు యత్నాలు..
సమస్యలను పరిష్కరించకుంటే పోరాటం చేస్తామని, అనంతపురం జిల్లా నుంచి మొదలుపెట్టి అన్ని జిల్లాల్లో ఆందోళనలు నిర్వహిస్తామని ఇటీవలే వెంకట్రావిురెడ్డి ప్రకటించారు. ప్రతి నెలా ఒకటో తేదీన జీతాలతోపాటు పెండింగ్ డీఏలు ఇవ్వాలని, పీఆర్సీ కమిషనర్‌ను వెంటనే నియమించి పీఆర్సీ ఇవ్వాలని, రూ.40 వేల కోట్ల వరకూ ఉన్న బకాయిలు చెల్లించాలని, ఉద్యోగులపై వేధింపులు ఆపాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, అవుట్‌సోరి్సంగ్ సిబ్బంది, అంగన్‌వాడీలు సహా అన్ని విభాగాల్లో చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
తరచూ ఆందోళనలతో విజయవాడ ధర్నా చౌక్ మార్మోగుతోంది. తాజాగా ఈ నెలలోనే ఉపాధ్యాయ సంఘాలు భారీ ఆందోళనలకు సిద్ధమయ్యాయి. ఈ పరిస్థితుల్లో వెంకట్రావిురెడ్డిపై వేటు వేయడం ద్వారా ఉద్యోగులను భయపెట్టి నోరెత్తకుండా చేయాలని చంద్రబాబు సర్కారు భావిస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, సోషల్ మీడియా కార్యకర్తను టీడీపీ సర్కారు వేధిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఉద్యోగులపైనా దాన్ని ప్రయోగించడంతో ఆగ్రహావేశాలు పెల్లుబుకుతున్నాయి.


