
రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనకు కేంద్రం నో
కేంద్రంలో భాగస్వామిగా ఉన్నా దక్కని ఫలితం
సాక్షి, అమరావతి : కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నప్పటికీ రాష్ట్రానికి కొత్త జాతీయ రహదారుల మంజూరులో చంద్రబాబు ప్రభుత్వానికి చుక్కెదురైంది. రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా గుర్తించాలన్న ప్రభుత్వ విజ్ఞప్తిపై కేంద్ర జాతీయ రహదారుల శాఖ సానుకూలంగా స్పందించలేదు. ప్రస్తుతానికి అటువంటి ప్రతిపాదనను తాము పరిశీలించడంలేదని తేల్చిచెప్పింది.
ఇప్పటికే 425 కి.మీ. మేర నాలుగు రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా గుర్తించాలని రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది డిసెంబరులో కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ప్రధానంగా ఉత్తరాంధ్రలోని మూడు ముఖ్యమైన రహదారులతోపాటు గోదావరి జిల్లాల్లోని ఓ రహదారిని ఆ జాబితాలో చేర్చింది. అవి..
ఎన్‌హెచ్‌లుగా చేయలేం..
అయితే, ఈ నాలుగు రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా గుర్తించి అభివృద్ధి చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తిని కేంద్ర జాతీయ రహదారుల అభివృద్ధి శాఖ తిరస్కరించినట్లు సమాచారం. ఇప్పటికే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో పెద్దఎత్తున రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా గుర్తించి అభివృద్ధి చేస్తున్నామని.. ఈ నేపథ్యంలో.. కొత్తగా రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా గుర్తించలేమని కేంద్రం స్పష్టంచేసింది. దీంతో.. కొత్త జాతీయ రహదారులుగా గుర్తింపు సాధించే ప్రక్రియలో చంద్రబాబు ప్రభుత్వం విఫలమైందని అధికార వర్గాలు చెబుతున్నాయి.
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో 4,500 కి.మీ. అభివృద్ధి..
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో 4,500 కి.మీ. మేర రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయాన్ని వారు గుర్తుచేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామి కానప్పటికీ అప్పట్లో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా అభివృద్ధి చేయడంలో సమర్థవంతమైన పనితీరు కనబరిచింది. ప్రస్తుతం టీడీపీ కూటమి ప్రభుత్వం కేంద్రంలో భాగస్వామిగా ఉన్నప్పటికీ రాష్టరహదారులను జాతీయ రహదారులుగా గుర్తింపు సాధించడంలో ఘోరంగా విఫలమైందని అధికార వర్గాలు
వ్యాఖ్యానిస్తున్నాయి.
శ్రీకాకుళం జిల్లా చిలకపాలెం (చెన్నై–కోల్‌కత జాతీయ రహదారి) నుంచి విజయనగరం జిల్లా రామభద్రపురం మీదుగా పార్వతీపురం జిల్లా కేంద్రం నుంచి ఒడిశాలోని రాయగడ వరకు ఉన్న 145 కి.మీ. రోడ్డు..
శ్రీకాకుళం జిల్లా కళింగపట్నం నుంచి పార్వతీపురం జిల్లా కేంద్రం వరకు 151 కి.మీ. రోడ్డు..
విజయనగరం నుంచి పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ వరకు 71 కి..మీ. రోడ్డు..
కాకినాడ నుంచి కోటిపల్లి మీదుగా అమలాపురం వరకు 58 కి.మీ. రోడ్డు.
ఈ నాలుగు రాష్టరహదారులను జాతీయ రహదారులుగా కేంద్రం గుర్తిస్తే తదుపరి దశ కింద మరో మూడువేల కి.మీ. మేర రాష్ట్ర రహదారుల జాబితాను కూడా రాష్ట ప్రభుత్వం రూపొందించింది. ఈ విషయాన్ని మార్చిలోనే కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లింది. గత ఏడాది డిసెంబరులో పంపిన ప్రతిపాదనలు ఆమోదం పొందిన తరువాత ఆ మూడు వేల కి.మీ. రాష్టరహదారుల జాబితాను కేంద్ర ప్రభుత్వానికి పంపించాలని భావిస్తోంది.