అంతా బాబు దుష్ప్రచారమే.. రాజకీయ రాద్ధాంతమే | CBI confirms Ghee used in TTD laddu prasadam not contain any animal fat | Sakshi
Sakshi News home page

అంతా బాబు దుష్ప్రచారమే.. రాజకీయ రాద్ధాంతమే

Jan 29 2026 5:06 AM | Updated on Jan 29 2026 6:47 AM

CBI confirms Ghee used in TTD laddu prasadam not contain any animal fat

తిరుమల లడ్డూ ప్రసాదం నెయ్యిలో జంతువుల కొవ్వు కలవలేదు

పంది, చేప కొవ్వు లేనే లేవు.. సీబీఐ దర్యాప్తులో సంచలన నిజాలు వెల్లడి

నాలుగు రకాల నెయ్యి శాంపిల్స్‌ పరీక్షించి నిర్ధారణ

ఐసీఏఆర్, ఎన్‌డీడీబీ ల్యాబ్‌లలో పరీక్షలు

శాస్త్రీయంగా శోధించి... సాధికారికంగా సీబీఐ నిర్ధారణ

బెడిసికొట్టిన చంద్రబాబు కుతంత్రం

బాబు కుట్రలకు పవన్‌ కళ్యాణ్‌ వత్తాసు

ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు రాజకీయ హైడ్రామా

నెయ్యిలో జంతువుల కొవ్వు కలవలేదని సీబీఐ నేతృత్వంలో స్వతంత్ర సిట్‌ దర్యాప్తులో నిర్ధారణ

సాక్షి, అమరావతి: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు దుష్ప్రచార కుట్ర బెడిసికొట్టింది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీసిన టీడీపీ కూటమి కుతంత్రం విఫలమైంది. ‘తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి ఉపయోగించిన నెయ్యిలో ఎటువంటి జంతువుల కొవ్వు కలవలేదు..’ అని సీబీఐ స్పష్టం చేసింది. ‘పంది, చేప తదితర జీవుల కొవ్వు ఆ నెయ్యిలో కలవనే లేదు..’ అని తేల్చి చెప్పింది.  హర్యానాలోని ‘ఐసీఏఆర్‌– నేషనల్‌ డెయిరీ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌’, గుజరాత్‌లోని ‘నేషనల్‌ డెయిరీ డెవలప్‌మెంట్‌ బోర్డు(ఎన్‌డీడీబీ) ఆ నెయ్యి శాంపిల్స్‌ను పరీక్షించి ఆ వాస్తవాన్ని నిర్ధారించాయని పేర్కొంది. టీటీడీ లడ్డూ ప్రసాదం కోసం ఉపయోగించిన నెయ్యి లో జంతువుల కొవ్వు కలిపారన్న ఆరోపణలపై విచారించేందుకు సుప్రీంకోర్టు ఆదేశాలతో సీబీఐ ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్‌) నియమించిన విషయం తెలిసిందే. 

ఈ కేసును అన్ని కోణాల్లో విచారించిన సీబీఐ దర్యాప్తు పూర్తి చేసింది. అనంతరం చార్జ్‌షీట్‌ను నెల్లూరులోని ఏసీబీ న్యాయస్థానంలో ఇటీవల సమర్పించింది. మరోవైపు సీబీఐ నివేదిక పేరుతో టీడీపీ కూటమి ప్రభుత్వ పెద్దలు తమ అనుకూల ఎల్లో మీడియాకు లీకులు ఇచ్చి దుష్ప్రచారానికి యత్నిస్తున్నారు. కాగా అసలు సీబీఐ దర్యాప్తులో ఏం వెల్లడైందని ప్రపంచవ్యాప్తంగా ఉన్న తిరుమల శ్రీవారి భక్తులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో సీబీఐ దర్యాప్తులో వెల్లడైన వాస్తవాలు తాజాగా బహిర్గతమయ్యాయి. లడ్డూ ప్రసాదం తయారీకి ఉపయోగించిన నెయ్యిలో ఎటువంటి జంతువుల కొవ్వు కలవలేదని దర్యాప్తులో నిగ్గు తేలింది. సీబీఐ శాస్త్రీయంగా విశ్లేషించి సాధికారికంగా వెల్లడించిన వాస్తవాలు ఇలా ఉన్నాయి..

టీటీడీ నెయ్యిలో జంతువుల కొవ్వు కలవలేదు
వైఎస్సార్‌ సీపీ హయాంలో తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి ఉపయోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలవలేదని సీబీఐ దర్యాప్తు నిర్ధారించింది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా నాలుగు వేర్వేరు ట్యాంకర్ల నుంచి తీసిన నెయ్యి శాంపిల్స్‌ను హర్యానాలోని ‘ఐసీఏఆర్‌– నేషనల్‌ డెయిరీ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌’కు పంపించి పరీక్షలు నిర్వహించినట్లు సీబీఐ తెలిపింది. టీటీడీ నెయ్యిలో జంతువుల కొవ్వు కలవలేదని వెల్లడైందని ఆ ల్యాబరేటరీలు ఈ ఏడాది మార్చి 27న నివేదించాయని సీబీఐ నివేదిక పేర్కొంది. నాలుగు నెయ్యి నమూనాలను ‘ట్రైగ్లిసరైడ్‌ ప్రొఫైల్‌’’ పరీక్షించి మరీ నిర్ధారించాయని తెలిపింది. 

నెయ్యి నాణ్యతను విశ్లేషించి నివేదికను ఇంగ్లీష్‌ అక్షర క్రమంలో పాయింట్ల వారీగా వివరించింది. అందులో ఏడో పాయింట్‌ (జి) లో సీబీఐ పేర్కొన్న విషయం అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. టీటీడీకి సరఫరా చేసిన నెయ్యిలో కొలెస్ట్రాల్‌ లేదని పరీక్షల్లో వెల్లడైందని తెలిపింది. జంతువుల కొవ్వులోనే కొలెస్ట్రాల్‌ ఉంటుంది. మరి కొలెస్ట్రాల్‌ లేదని అంటే... జంతువుల కొవ్వు కలవలేదని స్పష్టం చేసినట్లేనని ఆహార నిపుణులు తేల్చి చెబుతున్నారు. తాము పరీక్షించిన నాలుగు నమూనాల్లోనూ పంది, చేప వంటి జీవుల కొవ్వు లేనే లేదని సీబీఐ నివేదిక  స్పష్టం చేసింది. 

రాజకీయ కుట్రతో లడ్డూ ప్రసాదంపై బాబు దుష్ప్రచారం
రాజకీయ కుట్రల కోసం ఎంతకైనా దిగజారుతానని ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి నిస్సిగ్గుగా నిరూపించుకున్నారు. 1994–1995లో అప్పటి ముఖ్య­మంత్రి ఎన్టీ రామారావు, ఆయన భార్య లక్ష్మీ పార్వతిల వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ దుష్ప్ర­చారం చేశారు. వైస్రాయ్‌ హోటల్‌ కుట్రతో ఆయనకు వెన్నుపోటు పొడిచి చంద్రబాబు అడ్డదారిలో సీఎం అయ్యారు. కాగా ఈసారి ఏకంగా తిరుమల శ్రీవారి పవిత్రమైన లడ్డూ ప్రసాదానికి కళంకం తెచ్చేలా చంద్రబాబు దుష్ప్రచార కుట్రలకు తెగబడటం విస్మ­యపరుస్తోంది. 2024 సెప్టెంబరు 18న  చంద్రబాబు ఈ కుట్రకు తెరతీశారు. 

తిరుమల లడ్డూ ప్రసాదానికి ఉపయోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిపా­రని ముఖ్యమంత్రి హోదాలో ఆయన నిరాధార ఆరోపణలు చేసి రాజకీయ కుట్రకు తెగబడ్డారు. అంతేకాదు ఆ మర్నాడు అంటే సెప్టెంబరు 19న ‘నేషనల్‌ డెయిరీ డెవలప్‌మెంట్‌ బోర్డు(ఎన్‌డీడీబీ) నివేదికను వక్రీకరిస్తూ టీడీపీ ప్రధాన కార్యాలయంలో దాన్ని విడుదల చేసి ప్రజల్ని తప్పుదోవ పట్టించేందుకు యత్నించారు. బాధ్యతాయుతమైన ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఆయన ఇటువంటి దుష్ప్రచారం చేయడం విభ్రాంతి కలిగించింది. ఎందుకంటే.. అధికార యంత్రాంగం అంతా ఆయన చేతిలోనే ఉంది. 

నిజంగా నెయ్యిలో జంతువుల కొవ్వు కలిపారో లేదోఅని తెలుసుకునే అవకాశం ఆయనకు ఉంది. అయినా సరే కేవలం వైఎస్సార్‌సీపీపై దుష్ప్రచారం చేయడం... ప్రజల్ని తప్పుదోవ పట్టించడమే లక్ష్యంగా చంద్రబాబు లడ్డూ ప్రసాదం ప్రాశస్త్యానికి కళంకం తీసుకువచ్చేందుకు కూడా వెనుకాడలేదు. కాగా భక్తుల మనోభావాలను దెబ్బతీసే ఈ కుట్రను అప్పటి టీటీడీ ఈవో శ్యామలరావు అప్పుడే తిప్పికొట్టారు. గత ఏడాది సెప్టెంబరు 20న ఆయన తిరుపతిలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ లడ్డూ ప్రసాదం కోసం ఉపయోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిపారన్న ఆరోపణలను పరోక్షంగా ఖండించారు. 

ఎటువంటి కల్తీ నెయ్యిని లడ్డూ ప్రసాదం తయారీకి ఉపయోగించలేదని ఆయన స్పష్టం చేశారు. నెయ్యి ట్యాంకర్లను తిరుపతిలోనే పరీక్షించి... నాణ్యత ఉన్నవాటినే తిరుమలకు పంపిస్తామని... తగిన నాణ్యతతో లేనివాటిని వెనక్కి పంపుతామన్నారు. అది దశాబ్దాలుగా టీటీడీ కచ్చితంగా పాటిస్తున్న విధానమేనని చెప్పారు. అదే విధంగా తగిన నాణ్యతతో లేని నాలుగు ట్యాంకర్ల నెయ్యిని తిరుపతిలోని అలిపిరి నుంచే  వెనక్కి పంపామ­న్నారు. 

ఆ నెయ్యిని లడ్డూ ప్రసాదం తయారీకి ఉప­యోగించనే లేదని... అసలు కల్తీ నెయ్యి ట్యాంకర్లను తిరుమల ఘాట్‌ రోడ్డులోకి కూడా ప్రవేశించనివ్వ­లేదన్నారు. దాంతో శ్యామలరావుపై ప్రభుత్వ పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన్ను హుటా­హుటిన అమరావతికి పిలిపించడం గమనార్హం. రాజకీయ కుట్రతో తాము చేసిన నిరాధార ఆరోపణలకు వ్యతి­రేకంగా మాట్లాడటం ఏమిటని ఆయన్ను మందలించినట్లు తెలుస్తోంది. అనంతరం కొంత కాలానికే టీటీడీ ఈవోగా ఉన్న శ్యామలరావును ప్రభుత్వం బదిలీ చేయడం గమనార్హం. 

బాబు కుట్రకు పవన్‌ వత్తాసు
శ్రీవారి లడ్డూ ప్రసాదం ప్రాశస్త్యానికి కళంకం కలిగించేందుకు చంద్రబాబు పన్నిన కుట్రకు ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ వత్తాసు పలికారు. ప్రజల్ని తప్పుదోవ పట్టించేందుకు ఆయన హైడ్రామాకు తెరతీశారు. విజయవాడ ఇంద్రకీలాద్రి మెట్లను కడిగి చంద్రబాబు కుట్ర డ్రామాను మరింత రక్తి కట్టించేందుకు యత్నించారు. ఇక టీడీపీ, జనసేన సోషల్‌ మీడియా విభాగాలు లడ్డూ ప్రసాదంపై తీవ్రస్థాయిలో దుష్ప్రచారానికి తెగబడ్డాయి. రాజకీయ ప్రయోజనాల కోసం కోట్లాదిమంది భక్తుల మనోభావాలను దెబ్బతీసేందుకు యత్నించాయి. 

దేవుణ్ని అయినా రాజకీయాలకు దూరంగా ఉంచండి: సుప్రీంకోర్టు 
తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలి­పారన్న ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్య­మంత్రి పవన్‌ కళ్యాణ్‌ నిరాధార ఆరోపణలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కనీసం దేవుణ్ణి అయినా రాజకీయాలకు దూరంగా ఉంచాలని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. తద్వారా టీడీపీ కూటమి ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాల కోసం దుష్ప్రచారం చేయటాన్ని మందలించినట్లేనని న్యాయ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.

వరద సహాయక చర్యల్లో వైఫల్యం...
డైవర్షన్‌ కుట్రతోనే లడ్డూ ప్రసాదంపై దుష్ప్రచారం
విజయవాడ వరద సహాయక చర్యల్లో ప్రభుత్వ వైఫల్యం నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే చంద్రబాబు ఈ డైవర్షన్‌ కుట్రకు పాల్పడ్డారు. 2024 సెప్టెంబరులో విజయవాడను బుడమేరు వరద ముంచెత్తింది. వాతావరణ శాఖ ముందే హెచ్చరించినా టీడీపీ కూటమి ప్రభుత్వం మొద్దు నిద్ర వీడ లేదు. కనీసం లోతట్టు ప్రాంతాలవారిని అప్రమత్తం చేయలేదు. సురక్షిత ప్రాంతాలకు తరలించలేదు. దాంతో జల ప్రళయం విజయవాడను ముంచెత్తింది. కేవలం చంద్రబాబు సర్కారు వైఫల్యంతో 50మందికి పైగా దుర్మరణం చెందారు. వేలాదిమంది నిరాశ్రయులయ్యారు. దాంతో ప్రభుత్వంపై ప్రజాగ్రహం పెల్లుబికింది. తమ వైఫల్యం నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు చంద్రబాబు తనకు అలవాటైన రీతిలో డైవర్షన్‌ కుట్రకు తెరతీశారు. ఈ క్రమంలో తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం కోసం ఉపయోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిపారంటూ దుష్ప్రచారానికి తెగబడ్డారు. తద్వారా ప్రజల దృష్టి విజయవాడ వరదల నుంచి మళ్లించేందుకు యత్నించారు.

కుట్రతోనే ‘పచ్చ’ సిట్‌... అడ్డుకున్న సుప్రీంకోర్టు
తమ రాజకీయ కుట్రలో భాగంగానే చంద్రబాబు ప్రభుత్వం సిట్‌ను నియమించింది. టీడీపీ వీరవిధేయుడిగా ముద్రపడిన వివా­దా­స్పద అధికారి గుంటూరు ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి నేతృత్వంలో సిట్‌ను నియమించింది. మరో టీడీపీ వీరవిధేయ అధికారి, విశాఖ­పట్నం డీఐజీ గోపీనాథ్‌ జెట్టిని అందులో సభ్యుడిగా నియమించింది. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి, ప్రస్తుత రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్‌ కృష్ణయ్య అల్లుడే గోపీనాథ్‌ జెట్టి. లడ్డూ ప్రసాదం కోసం ఉపయోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిపారన్న తమ దుష్ప్రచారానికి రాజముద్ర వేయాలనే ఆ ఎత్తుగడ వేసింది. కాగా ఈ యత్నాన్ని సుప్రీంకోర్టు అడ్డుకుంది. ఆ సిట్‌ ఏర్పాటు చెల్లదని చెప్పింది. ఆ స్థానంలో సీబీఐ ఆధ్వర్యంలో స్వతంత్ర సిట్‌ను ఏర్పాటు చేయాలని సీబీఐని ఆదేశించింది. ఈ కేసును అన్ని కోణాల్లో విచారించిన సీబీఐ దర్యాప్తు పూర్తి చేసి కోర్టుకు చార్జ్‌షీట్‌ను సమర్పించింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement