ప్రభుత్వాస్పత్రుల్లో వైద్యం భేష్‌

Bharati Pawar praises Andhra Pradesh Govt Hospitals Medical services - Sakshi

కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి భారతీ ప్రవీణ్‌పవార్‌ కితాబు  

64 పరీక్షలు, 350 రకాల మందులు ఉచితంగా ఇస్తున్నారని వ్యాఖ్య 

వైద్య విద్యలో మెరుగైన కృషి జరుగుతోందని వెల్లడి 

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రభుత్వాస్పత్రుల్లో ప్రజలకు మంచి వైద్యసేవలు అందుతున్నాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి భారతీ ప్రవీణ్‌పవార్‌ కితాబిచ్చారు. ఎక్కువమంది విద్యార్థులకు మెరుగైన వైద్య విద్యను అందించడానికి కూడా కృషి జరుగుతోందని చెప్పారు. మూడ్రోజుల రాష్ట్ర పర్యటనకు వచి్చన ఆమె సోమవారం విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.

తన రాష్ట్ర పర్యటనలో భాగంగా.. ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో రోగులకు అందించే వైద్యసేవలను తనిఖీ చేసినట్లు ఆమె చెప్పారు. 64 రకాల పరీక్షలను, 350 రకాల మందులను ఉచితంగా ఇస్తున్నారన్నారు. మచిలీపట్నంలో మెడికల్‌ కాలేజీ నిర్మాణ పనులను కూడా పరిశీలించినట్లు భారతీ ప్రవీణ్‌పవార్‌ చెప్పారు. ఆ కాలేజీకి 150 సీట్లను కూడా మంజూరు చేసినట్లు చెప్పారు. నిర్ణీత గడువులోగా మెడికల్‌ కాలేజీ నిర్మాణం పూర్తిచేయాలని సూచించానన్నారు.

ఇక ‘స్పందన’ కార్యక్రమంలోనూ తాను పాల్గొన్నట్లు కేంద్రమంత్రి చెప్పారు. కొంతమంది రేషన్‌కార్డు లబ్ధిదారులకు ఐదు కేజీల కంటే తక్కువ బియ్యం పంపిణీ జరుగుతున్న విషయం తన దృష్టికి తీసుకొచ్చారన్నారు. మచిలీపట్నంలో 8,912 టిడ్కో ఇళ్ల నిర్మాణం పూర్తయిందని.. అయితే, ఆ ప్రాంతానికి ప్రభుత్వం రోడ్లు, మంచినీరు, కరెంట్‌ వసతి కలి్పంచాల్సి ఉందని, డిసెంబరు నాటికి ఆయా పనులు పూర్తిచేస్తామని అధికారులు చెప్పారన్నారు. అలాగే, ఆయుష్మాన్‌ భారత్‌ పథకం ద్వారా కేంద్రం దేశవ్యాప్తంగా పేదలకు ఉచిత వైద్యసేవలు అందిస్తున్నట్లు ఆమె చెప్పారు.

ఈ సమయంలో.. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పథకం అమలుచేస్తున్న విషయాన్ని మీడియా గుర్తుచేసింది. ఆరోగ్యశ్రీ ద్వారా పొరుగు రాష్ట్రాల్లో వైద్యం చేయించుకునే అవకాశం ఉండదు కదా అని కేంద్రమంత్రి బదులివ్వగా.. చెన్నై, హైదరాబాద్, బెంగళూరులో ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులో ఉన్నాయని విలేకరులు వివరించారు. ఆయుష్మాన్‌ భారత్‌ పథకంలో మిగిలిన రాష్ట్రాల్లోనూ వైద్య సేవలు పొందే అవకాశం ఉంటుంది కదా అని కేంద్రమంత్రి వివరించారు.   

‘ఫ్యామిలీ డాక్టర్‌’ గురించి తెలీదు 
ఇక రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా అమలుచేస్తున్న ఫ్యామిలీ డాక్టర్‌  కార్యక్రమం గురించి తనకు పూర్తిగా అవగాహనలేదని.. వైద్య సేవలకు సంబంధించి కేంద్రం రాష్ట్రాలతో కలిసి చాలా కార్యక్రమాలు అమలుచేస్తోందని, అవి సమర్థవంతంగా అమలవుతున్నాయా లేదా అన్న దానిపై తాను ప్రధానంగా దృష్టి పెట్టినట్లు భారతీ ప్రవీణ్‌పవార్‌ చెప్పారు. కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వ ఉమ్మడి నిధులతో అమలయ్యే పథకాలలో కేంద్రానికి కూడా రాష్ట్రాలు తగిన గుర్తింపునివ్వాలని, ప్రధాని మోదీ ఫొటోను  ఉంచాలని ఆమె ఆకాంక్షించారు.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top