టైర్లు, బ్యాటరీల సమస్యలతో వాహనాలు షెడ్డులకే పరిమితం
మరమ్మతులతో ఎక్కడికక్కడ ఆగిపోతున్న అంబులెన్సులు
ఆపద్బాంధవి సేవలు అందక ప్రాణాలు విడుస్తున్న బాధితులు
అంబులెన్స్ కోసం ఫోన్ చేస్తే 40 నిమిషాలు ఎదురు చూపులు
శ్రీకాకుళం జిల్లాలో నడిరోడ్డుపై కన్నుమూసిన క్షతగాత్రుడు
ప్రజారోగ్యంపై చంద్రబాబు సర్కారు అలసత్వం.. 104, 108 సేవల నిర్వహణను స్కామ్‌గా మార్చేయడంపై అలజడి
108 అంబులెన్సుల దుస్థితిపై ‘సాక్షి’ గ్రౌండ్ రిపోర్ట్‌లో దిగ్భ్రాంతికర వాస్తవాలు వెలుగులోకి
ప్రజల ప్రాణాలకు భరోసా ఇచ్చే 108 సర్వీసులకు చంద్రబాబు సర్కారు ఉరి వేస్తోంది! కుయ్ కుయ్ మూగబోతోంది..! నిమిషాల వ్యవధిలో చేరుకోవాల్సిన అంబులెన్సుల జాడ లేక ప్రజల ప్రాణాలు పోతున్నాయ్! 108 సేవల నిర్వహణలో తీవ్ర అలక్ష్యం, ప్రభుత్వ అసమర్థతతో రోడ్డు ప్రమాదాల క్షతగాత్రుల నుంచి అనారోగ్య బాధితులు, నిండు గర్భిణులు దాకా బలైపోతున్నారు! 108 రాకపోవడంతో గర్భిణులు ఆటోలను ఆశ్రయిస్తుండటం.. సకాలంలో వైద్యం అందక ఆటోలోనే పసిగుడ్డు ప్రాణాలు విడవడం.. రోడ్డుపై రయ్ రయ్‌మంటూ పరుగులు తీయాల్సిన ఆపద్బాంధవి నిస్సహాయంగా షెడ్‌లకే పరిమితం కావడం.. తాజాగా శ్రీకాకుళం జిల్లాలో ఓ క్షతగాత్రుడు నడిరోడ్డుపైనే ప్రాణాలు కోల్పోయిన ఘటనపై సర్వత్రా అలజడి రేగుతోంది. ఈ నేపథ్యంలో 108 సేవల తీరును ‘సాక్షి’ బృందం రాష్ట్రవ్యాప్తంగా పరిశీలించగా దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.
చిత్తూరు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో నిరుపయోగంగా మారిన 108వాహనాలు
శ్రీకాకుళం జిల్లాలో రోడ్డు ప్రమాదానికి గురైన ఓ ద్విచక్రవాహనదారుడి ప్రాణాలను కాపాడేందుకు 108 కోసం కాల్ చేస్తే ఎంతసేపైనా రాలేదు. చివరకు అంబులెన్స్ కోసం ఎదురు చూస్తూ.. విలవిల్లాడుతూ క్షతగాత్రుడు నడిరోడ్డుపైనే ప్రాణాలు విడిచాడు. రణస్థలం జాతీయ రహదారి–16పై బుధవారం చోటు చేసుకున్న ఈ ఘటన రాష్ట్రంలో 108 సేవల నెట్‌వర్క్ నిర్వహణ ఎంత అధ్వానంగా ఉందో
చెప్పేందుకు నిదర్శనం.
‘ఊపిరి’ ఆగుతోంది..!
పల్నాడు జిల్లా నకరికల్లుకు చెందిన అబ్బూరి శ్రీనివాసరావు ఇటీవల ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా త్రిపురాపురం వద్ద ట్రిప్పర్ ఢీకొని గాయాలపాలయ్యాడు. 108 కోసం ఫోన్ చేయగా 20 నిమిషాలు గడిచినా రాకపోవడంతో ప్రైవేట్ వాహనంలో వైద్యశాలకు తరలించారు. ఇక్కడ రెండు మండలాలకు ఒకే వాహనం ఉంది. పల్నాడు జిల్లాలోనే జలాల్‌పురంలో ఇటీవల మరియమ్మ అనే మహిళకు ఊపిరి అందకపోవటంతో మెరుగైన వైద్యం కోసం సీహెచ్‌సీ నుంచి 108లో గుంటూరు తరలించారు. తిరుగు ప్రయాణంలో బ్యాటరీ చార్జింగ్ లేక వాహనం మొరాయించడంతో రోగి కుటుంబ సభ్యులు, సెక్యూరిటీ గార్డులు తోయాల్సి వచ్చింది. ఏలూరు జిల్లాలో పాత అంబులెన్స్‌లకు రంగులేసి నడిపిస్తున్నారు. అవి ఎప్పుడు మొరాయిస్తాయో చెప్పలేని దుస్థితి.
ఏలూరు జీజీహెచ్‌లో మూలపడి ఉన్న 108 వాహనాలు
పయ్యావుల ఇలాకాలో ‘హ్యాండ్సప్’..
అనంతపురం జిల్లాలో 108 సేవలు అస్తవ్యస్థంగా మారాయి. మంత్రి పయ్యావుల కేశవ్ ప్రాతినిథ్యం వహిస్తున్న ఉరవకొండలో ఇతర ప్రాంతాలకు చెందిన వాటిని బ్యాకప్‌గా వినియోగిస్తున్నారు. ఉరవకొండ వాహనం పాడవడంతో గుంటూరులో షెడ్డుకు పరిమితమైంది. రాయదుర్గం, డి.హీరేహాళ్, కణేకల్లు బేసిక్ లైఫ్ సపోర్ట్ వాహనాలు తరచూ మరమ్మతులకు గురవుతున్నాయి. నేషనల్ హైవే కనెక్టివిటీ ఉన్న అనంతపురం జిల్లాలో అడ్వాన్స్ లైఫ్ సపోర్ట్ వాహనాలు అత్యంత కీలకం. కానీ ఇవి మరమ్మతులకు గురవుతున్నాయి. 
బెడ్డు వద్దకు కాదు.. షెడ్డుకే!
వైఎస్సార్ కడప జిల్లా చింతకొమ్మదిన్న మండలంలో ఇటీవల స్పృహ కోల్పోయిన ఓ వ్యక్తిని కాపాడాలని కాల్ సెంటర్‌కు సమాచారం ఇవ్వగా ‘108 వాహనం మరో చోటకు వెళ్లింది. కడపలో వాహనాలు అందుబాటులో లేవు. మరమ్మతులకు గురైన వాహనాలను పాత రిమ్స్‌లో షెడ్డుకు తరలించారు. చెన్నూరు మండలం నుంచి 108 రావడానికి దాదాపు గంట పడుతోంది. వచ్చే వరకు వేచి చూడాలి. లేదంటే ఆటో తీసుకొని కడపలో ఆస్పత్రికి వెళ్లాలి’ అని సిబ్బంది సలహా ఇచ్చారు.
రోగిని తరలిస్తుండగా పేలిన టైరు..
నంద్యాల జిల్లాలో కొద్ది రోజుల క్రితం బిల్లా బక్కన్న అనే వృద్ధుడిని 108లో తరలిస్తుండగా బండి ఆత్మకూరు వద్దకు చేరుకోగానే వాహనం టైర్ పేలి రోడ్డు మీద ఆగిపోయింది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో టైర్లు, బ్యాటరీల సమస్యలతో పలు వాహనాలు షెడ్డుకు పరిమితమయ్యాయి. 
దయచేసి వేచి ఉండండి...!
విజయవాడ సిటీ పరిధిలో కాల్ చేసిన 18 నిమిషాల్లో రావాల్సిన 108 వాహనం దాదాపు అరగంటకుగానీ చేరుకోవడం లేదు. నందిగామ, జగ్గయ్యపేట, తిరువూరు లాంటి దూర ప్రాంతాల నుంచి రిఫర్ కేసులను విజయవాడకు తీసుకొస్తుంటారు. అలాంటి సమయంలో ఫోన్ చేస్తే రావడానికి మరో వాహనం అందుబాటులో ఉండటం లేదు. కృష్ణా జిల్లాలో పూర్తిగా పనికిరాని (కండెమ్) 108 వాహనాన్ని జీజీహెచ్ ఆవరణలో ఉంచారు.
ప్రైవేట్ సేవలకు వేలకు వేలు..
చిత్తూరు జిల్లాలో 108 వాహనాలు మొరాయిస్తున్నాయి. అరిగిన టైర్లతో దర్శనమిస్తున్నాయి. కొన్నింటి సైరన్ కూడా పని చేయడంలేదు. ఆపదలో పది మందికి సాయపడాల్సిన 108.. నలుగురు తోస్తేగానీ కదలని దుస్థితి. పల్లెల్లో 108 సేవలు అరుదుగా మారాయి. ప్రసవం కోసం ఆటోలను ఆశ్రయించాల్సి వస్తోంది. చిత్తూరు నుంచి తమిళనాడులోని వేలూరుకు (30 కి.మీ) ప్రైవేటు అంబులెన్స్‌లో వెళ్లాలంటే కనీసం రూ.5 వేలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. తిరుపతి జిల్లాలో తరచూ 18 వాహనాలు మరమ్మతులకు గురవుతున్నాయి. రోజూ 8 నుంచి 10 వాహనాలు షెడ్‌లకే చేరుతున్నాయి.
అనుభవం లేని అస్మదీయ సంస్థ వల్లే ఈ దుస్థితి
అంతర్జాతీయంగా పేరుగాంచిన, వైద్య రంగంలో అపార అనుభవం ఉన్న ప్రముఖ సంస్థలను కాదని అస్మదీయ సంస్థకు రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం అడ్డగోలుగా 108, 104 నిర్వహణ కాంట్రాక్టు కట్టబెట్టడమే ఈ దుస్థితికి కారణమని స్పష్టమవుతోంది. ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని లాభాపేక్ష లేకుండా సేవా దృక్ఫథంతో ముందుకొస్తున్న, స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ అయిన సంస్థలను పక్కనపెట్టి.. టీడీపీ డాక్టర్స్ విభాగంలోని పవన్‌కు చెందిన ‘భవ్య’ అనే ఎలాంటి అనుభవం లేని సంస్థకు ఈ కాంట్రాక్టును అప్పగించింది. ప్రజల ప్రాణ, ఆరోగ్య రక్షణ కోసం తీసుకొచ్చిన వీటి నిర్వహణపై ఇంత నిర్లక్ష్యం క్షమార్హం కాదని ప్రజలు మండిపడుతున్నారు.
గతేడాది చంద్రబాబు ప్రభుత్వం రాగానే అప్పటి వరకు బాగా పనిచేస్తున్న కాంట్రాక్టర్‌లకు పొగపెట్టారు. గడువు ఉన్నప్పటికీ కాంట్రాక్టర్‌లే పనులు వదులుకుని వెళ్లిపోయేలా వేధింపులకు దిగారు. దీంతో 104 మొబైల్ మెడికల్ యూనిట్స్ (ఎంఎంయూ), 108 నిర్వహణ కాలపరిమితి 2027 వరకూ ఉన్నప్పటికీ కాంట్రాక్టర్ ఎంవోయూను రద్దు చేసుకున్నారు. అనంతరం భవ్య హెల్త్ సర్వీసెస్‌కు ఈ కాంట్రాక్ట్‌ను కట్టబెట్టడం కోసం పక్కా ప్రణాళికతో నిబంధనలు రూపొందించి టెండర్ పిలిచారు. ఈ సంస్థకు అత్యవసర వైద్య సేవల నిర్వహణలో అనుభవం లేకపోవడంతో ఏకంగా నిబంధనలే మార్చేయడం గమనార్హం.
– సాక్షి నెట్‌వర్క్


