
అప్పులు తీర్చలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సెల్ఫీ వీడియో
బెట్టింగ్‌లకు అలవాటు పడి రూ.21 లక్షలు అప్పులు
కాపాడిన పోలీసులు
విశాఖపట్నం: బెట్టింగులకు అలవాటు పడి అప్పుల ఊబిలో చిక్కుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఉద్యోగిని పోలీసులు కాపాడిన సంఘటన భీమిలి బీచ్‌రోడ్డులో చోటు చేసుకుంది. పీఎంపాలెం సీఐ జి.బాలకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. గాజువాక ప్రాంతానికి చెందిన కొండా సుందర్ (30), భార్య, కుమార్తెతో కలిసి పీఎంపాలెంలో నివాసం ఉంటున్నారు. రెండున్నరేళ్లుగా రుషికొండ ఐటీ సెజ్‌లోని ఓ సాఫ్ట్‌వేర్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. ఖాళీ సమయాల్లో బెట్టింగులకు పాల్పడుతూ, అది కాస్తా వ్యసనంగా మారింది. బెట్టింగ్‌ల కారణంగా సుమారు రూ. 21 లక్షల అప్పు చేశాడు. స్నేహితుల ఖాతాలో బ్యాంకుల నుంచి కూడా అప్పులు తీసుకున్నాడు. అప్పులు తీర్చాల్సిందిగా.. ఒత్తిడి పెరిగింది. దీంతో మానసికంగా ఒత్తిడికి గురయ్యాడు.
ఈ క్రమంలో సోమవారం ఉదయం విధులకు వెళ్తున్నానని చెప్పి బయల్దేరాదు. కాసేపటి తర్వాత ‘నాన్నా నన్ను క్షమించు, నీకు ముఖం చూపించలేకపోతున్నా రూ. 21 లక్షలు అప్పు చేశాను. నేను ఎంత కష్టపడినా అప్పులు తీర్చలేని పరిస్థితి. నాభార్య, కుమార్తెను బాగా చూసుకోండి.. నేను చచ్చిపోతానంటూ..’ఓ సెల్ఫీ వీడియో తీసి తన తండ్రికి పంపించాడు. అది చూసిన తండ్రి వెంటనే 112కు కాల్ చేసి విషయం చెప్పి, ఆ వీడియోను పోలీసులకు పంపించారు. అతను పంపిన వీడియోలో.. తన కోసం వెతికితే బీచ్ రోడ్డులో ఫోన్ దొరుకుతుందని చెప్పడంతో..
ఆయన పంపిన వీడియోలో బ్యాక్‌గ్రౌండ్ ఆధారంగా పోలీసులు వెంటనే స్పందించి భీమిలి బీచ్ రోడ్డు రామానాయుడు ఫిల్మ్‌సూ్టడియో సమీపంలో ఉన్న బీచ్‌కు చేరుకున్నారు. సుందర్ ఓ చెట్టు కింద కూర్చుని ఏడుస్తూ ఉన్నాడు. పీఎంపాలెం బీచ్ మొబైల్ పోలీసులు ఆయనను పట్టుకుని స్టేషన్‌కు తరలించారు. ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు పోలీసులు తెలుసుకుని సుందర్‌కు కౌన్సెలింగ్ ఇచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. అయితే దీనిపై ఎలాంటి కేసు నమోదు కాలేదని, పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించి అతి తక్కువ సమయంలో సుందర్‌ను గుర్తించి ప్రాణాలు కాపాడిన సిబ్బందిని సీఐ బాలకృష్ణ అభినందించారు.