ఏపీ జడ్జిపై ట్రోలింగ్‌.. న్యాయ వ్యవస్థపై దాడే! | bar council condemns online attacks on ap high court judge urges action against judicial trolling | Sakshi
Sakshi News home page

ఏపీ జడ్జిపై ట్రోలింగ్‌.. న్యాయ వ్యవస్థపై దాడే!

Jul 7 2025 2:52 AM | Updated on Jul 7 2025 7:19 AM

bar council condemns online attacks on ap high court judge urges action against judicial trolling

జస్టిస్‌ శ్రీనివాసరెడ్డిపై ట్రోలింగ్‌ను తీవ్రంగా ఖండిస్తున్నాం 

కారకులపై ప్రభుత్వం తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలి

ఆయన నిష్పాక్షికంగా తీర్పులు వెలువరించారు.. న్యాయమూర్తుల వ్యక్తిత్వ హననాన్ని సహించేది లేదు 

న్యాయ వ్యవస్థ స్వతంత్రత విషయంలో రాజీ లేదు 

దురుద్దేశపూర్వకంగా సాగించే దాడులు, దూషణలపై డీజీపీ నేతృత్వంలో ప్రత్యేక విభాగంతో దర్యాపు చేపట్టాలి 

గతంలో జరిగిన ఘటనలపైనా విచారణకు ఆదేశించాలి 

కారకులపై న్యాయపరమైన చర్యలకు ఉపక్రమించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, సుప్రీంకోర్టు, హైకోర్టును కోరుతూ బార్‌ కౌన్సిల్‌ తీర్మానం  

సాక్షి అమరావతి: హైకోర్టు న్యాయ­మూర్తి జస్టిస్‌ కొనకంటి శ్రీనివాస­రెడ్డిపై సామా­జిక మాధ్యమాల్లో జరుగు­తున్న ట్రోలింగ్‌ను న్యాయ­వ్య­వస్థపై దాడిగా రాష్ట్ర న్యాయ­వాద మండలి (బార్‌ కౌన్సిల్‌) అభివర్ణించింది. జస్టిస్‌ శ్రీనివాస­రెడ్డిపై ట్రోలింగ్‌ను, దూషణ­లను తీవ్రంగా ఖండించింది. దీనికి బాధ్యు­లను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభు­త్వాన్ని డిమాండ్‌ చేసింది. జస్టిస్‌ శ్రీనివాసరెడ్డిపై కొద్ది రోజులుగా ట్రోలింగ్‌ జరుగుతున్న నేపథ్యంలో బార్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ ఎన్‌. ద్వారకానాథరెడ్డి అధ్య­క్షతన ఆదివారం అత్యవసర సమావేశం జరిగింది.

కౌన్సిల్‌ ఉపాధ్యక్షుడు ఎస్‌.కృష్ణమోహన్, బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా సభ్యులు రామిరెడ్డి, ఇతర సభ్యులు ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కౌన్సిల్‌ పలు తీర్మానాలు చేసింది. న్యాయమూర్తిగా నిష్పాక్షికంగా తీర్పులు వెలువరించిన జస్టిస్‌ శ్రీనివాసరెడ్డిపై సామాజిక మాధ్యమాలు, డిజిటల్‌ మాధ్యమాలు, ప్రజా వేదికల్లో  ట్రోలింగ్‌ చేయ­టాన్ని, నిరాధార ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు కౌన్సిల్‌ తన తీర్మానంలో పేర్కొంది. న్యాయమూర్తుల వ్యక్తిత్వ హననాన్ని సహించేది లేదని హెచ్చరించింది. ఇలాంటివి పునరావృతం అవుతున్న నేపథ్యంలో దీన్ని తీవ్రంగా పరిగణించి తక్షణమే చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని తీర్మానించారు. 

చర్యలకు రిజిస్ట్రార్‌ నేతృత్వంలో యంత్రాంగం!
న్యాయవ్యవస్థపై దూషణలు, ట్రోలింగ్‌పై చర్యలు తీసుకునేందుకు రిజిస్ట్రార్‌ నేతృత్వంలో ఓ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని బార్‌ కౌన్సిల్‌ హైకోర్టును కోరింది. న్యాయమూర్తులను లక్ష్యంగా చేసుకుని సామాజిక మాధ్యమాల్లో దురుద్దేశపూర్వ­కంగా సాగించే దాడులు, దూషణలపై దర్యాపు చేసేందుకు డీజీపీ నేతృత్వంలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని సూచించింది. న్యాయ­మూర్తులపై ప్రస్తుతం, గతంలో జరిగిన వ్యక్తిత్వ హనన దాడుల ఘటనలపైనా దర్యాపు జరిపేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను, సుప్రీంకోర్టు, హైకోర్టు ను బార్‌ కౌన్సిల్‌ కోరింది. కారకులపై న్యాయపరమైన చర్యలకు ఉపక్రమించాలని పేర్కొంది. న్యాయ వ్యవస్థ స్వతంత్రత విషయంలో రాజీ పడేదే లేదని, న్యాయమూర్తులు నిష్పాక్షికంగా రాజ్యాంగ విధులను నిర్వర్తించేందుకు రాష్ట్ర బార్‌ కౌన్సిల్‌ సదా మద్దతు అందించాలని సమావేశంలో తీర్మానించారు.

న్యాయమూర్తిపై నిందలా!
జస్టిస్‌ శ్రీనివాసరెడ్డిపై సోషల్‌ మీడియాలో టీడీపీ సైకోల ట్రోలింగ్‌
దురుద్దేశాలు ఆపాదించే రీతిలో వర్ల రామయ్య వ్యాఖ్యలు
టీడీపీ మూకల ట్రోలింగ్‌కు ఆ పార్టీ నేతల వత్తాసు

చంద్రబాబు సర్కారు అండదండలతో టీడీపీ సైకో మూకలు ఏకంగా న్యాయమూర్తులను లక్ష్యంగా చేసుకోవడం విభ్రాంతి కలిగిస్తోంది. తమకు నచ్చకుంటే ఎంతటి వారిపైన అయినా బురద జల్లుతాం..! సోషల్‌ మీడియాలో ట్రోల్‌ చేస్తాం.. ! మానసికంగా వేధిస్తామనే రీతిలో టీడీపీ సోషల్‌ మీడియా కార్యకర్తలు బరి తెగిస్తున్నారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కొనకంటి శ్రీనివాసరెడ్డిని లక్ష్యంగా చేసుకుని టీడీపీ సోషల్‌ మీడియా విభా­గం కొద్ది రోజులుగా సోషల్‌ మీడియాలో ట్రోలింగ్‌ చేస్తుండటమే ఇందుకు నిదర్శనం. టీడీపీ సోషల్‌ మీడియా విభాగమే కాదు.. ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ పోలీస్‌ అధికారి కూడా అయిన వర్ల రామయ్య సైతం జస్టిస్‌ శ్రీనివాసరెడ్డికి దురు­ద్దేశాలు ఆపాదించే రీతిలో వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

తద్వారా న్యాయ­మూర్తిపై ట్రోలింగ్‌ తమ అధికారిక విధానమని టీడీపీ పరో­క్షంగా వెల్లడించినట్లైంది. స్వయంగా న్యాయమూర్తి కొనకంటి శ్రీనివాసరెడ్డే తనను సోషల్‌ మీడియాలో ట్రోల్‌ చేస్తున్నారని వెల్లడించడం రాష్ట్రంలో దిగజారిన పరిస్థితులకు అద్దం పడుతోంది. ఓ కేసులో నిందితులకు బెయిల్‌ మంజూరు సమయంలో ఆయన హైకోర్టులో నర్మగర్భంగా ఈ వ్యాఖ్యలు చేయడం జాతీయస్థాయిలో చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో ఏకంగా న్యాయమూర్తిని లక్ష్యంగా చేసుకుని ట్రోల్‌ చేయడంపై ఏపీ బార్‌ కౌన్సిల్‌ తీవ్రంగా స్పందించింది. 

టీడీపీ అధికారిక విధానమే..!
ఎంతటివారిపైన అయినా సరే దుష్ప్రచారం చేయటాన్ని టీడీపీ అధికారిక విధానంగా చంద్రబాబు ఏనాడో మార్చేశారు. 1995లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావుకు వెన్నుపోటు పొడిచి తాను అడ్డదారిలో పీఠాన్ని అధిష్టించే వరకు అదే దుష్ప్రచార కుతంత్రాన్నే అస్త్రంగా చేసుకు­న్నారు. ప్రస్తుతం సోషల్‌ మీడియా యుగంలో టీడీపీ దుష్ప్రచార కుతంత్రం వెర్రి తలలు వేస్తోంది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ శ్రీనివాసరెడ్డిని సైతం ఉపేక్షించకపోవడం టీడీపీ మార్కు కుట్రకు నిదర్శనం. కొద్ది రోజులుగా టీడీపీ కార్యకర్తలు ఆయన్ను లక్ష్యంగా చేసుకుని అత్యంత అవమాన­కర రీతిలో ట్రోలింగ్‌కు తెగబడుతున్నారు. మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇటీవల పల్నాడు జిల్లా పర్యటనలో సింగయ్య అనే వ్యక్తి అనుమతి లేని ఓ ప్రైవేటు వాహనం ఢీకొని మృతి చెందారు.

ఆ విషయాన్ని గుంటూరు ఎస్పీ సతీశ్‌ సైతం అధికారికంగా వెల్లడించారు. కానీ ప్రభుత్వ పెద్దలు కుట్రపూరితంగా ఆ ఉదంతాన్ని వక్రీకరిస్తూ అక్రమ కేసు నమోదు చేయించారు. వైఎస్‌ జగన్‌ ప్రయా­ణిస్తున్న వాహనం కింద పడే సింగయ్య మృతి చెందారంటూ ఓ ఫేక్‌ వీడియోను వైరల్‌ చేశారు. అనంతరం ఆ వాహన డ్రైవర్‌గా ఉన్న ఏఆర్‌ కానిస్టేబుల్‌ రమణారెడ్డితో­పాటు వాహనంలో ప్రయాణిస్తున్న వైఎస్‌ జగన్, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, మాజీ మంత్రులు పేర్ని నాని, విడదల రజని తదితరులను నిందితులుగా చేరుస్తూ అక్రమ కేసు నమోదు చేశారు. దీనిపై వైఎస్సార్‌సీపీ హైకోర్టును ఆశ్రయించింది. అసలు కారులో ప్రయాణిస్తున్నవారిపై కేసు ఎలా నమోదు చేస్తారు...? ఏ చట్టంలో అటువంటి నిబంధన ఉందని న్యాయస్థానం సూటిగా ప్రశ్నించింది.

ఆ కేసులో తదుపరి చర్యలను నిలిపివేస్తూ న్యాయమూర్తి జస్టిస్‌ శ్రీనివాసరెడ్డి ఆదేశాలు జారీ చేశారు. అప్పటి నుంచి టీడీపీ సోషల్‌మీడియా ఆయన్ను లక్ష్యంగా చేసుకుంది. ఆయనకు వ్యతి­రేకంగా సోషల్‌ మీడియాలో ట్రోలింగ్‌ చేస్తోంది. ఈ క్రమంలో కల్తీ నెయ్యి  కేసులో చాలా నెలలుగా జైలులో ఉన్న నిందితులకు హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. ఈ సందర్భంగా జస్టిస్‌ శ్రీనివాస­రెడ్డి తనపై ట్రోలింగ్‌ అంశాన్ని ప్రస్తావించారు. తాను ఇచ్చిన తీర్పు సోషల్‌ మీడియా ట్రోలర్లకు ఓ అంశం అవుతుందని వ్యాఖ్యానించారు. అంటే న్యాయమూర్తులను కూడా టీడీపీ సోషల్‌ మీడియా ఉపేక్షించడం లేదన్నది స్పష్టమవుతోంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement