సాక్షి, విజయవాడ: వైఎస్సార్‌సీపీ నేత, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఊరట లభించింది. అక్రమ మద్యం కేసులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు గురువారం చెవిరెడ్డికి బెయిల్ మంజూరు చేసింది. భాస్కర్‌రెడ్డితో పాటు సజ్జల శ్రీధర్‌రెడ్డి, వెంకటేష్ నాయుడులకు సైతం బెయిల్ ఇచ్చింది.
వేల కోట్ల రూపాయల మద్యం కుంభకోణం జరిగిందని.. ఇందులో చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పాత్ర కూడా ఉందంటూ జూన్17వ తేదీన సిట్ బెంగుళూరులో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే అలాంటి కుంభకోణానికే ఆస్కారమే లేదని.. ఇదంతా కూటమి ప్రభుత్వ కుట్రేనని వైఎస్సార్‌సీపీ మొదటి నుంచి చెబుతూ వస్తోంది.
ఈ క్రమంలో అనారోగ్యంతో భాధపడుతున్నప్పటికీ కూడా చెవిరెడ్డి సుబ్బారెడ్డిని ఇబ్బంది పెట్టింది కూటమి ప్రభుత్వం. చివరకు 226 రోజుల తర్వాత ఆయనకు బెయిల్ ద్వారా ఉపశమనం లభించింది.
సిట్ అభియోగాలు
డిస్టిలరీలు, మద్యం సరఫరా కంపెనీల నుంచి కొల్లగొట్టిన సొత్తులో కొంత మొత్తాన్ని ప్రధాన నిందితుడిగా ఉన్న రాజ్ కేసిరెడ్డి నుంచి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అందుకున్నారని.. ఆ సొమ్మును గత అసెంబ్లీ ఎన్నికల టైంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులకు చేరవేసినట్లు చంద్రబాబు ప్రభుత్వం వేసిన సిట్ తన అభియోగాల్లో పేర్కొంది. ఈ వ్యవహారంలో కర్త, కర్మ, క్రియగా చెవిరెడ్డి భాస్కరరెడ్డి వ్యవహరించారంటూ అభియోగం నమోదు చేసింది. ఈ కేసులో ఆయన్ని ఏ-38గా, భాస్కరరెడ్డి తనయుడు మోహిత్‌రెడ్డిని ఏ-39 నిందితులుగా పేర్కొనడం గమనార్హం.


