మహనీయుల స్ఫూర్తి.. భావితరాలకు దీప్తి

Azadi ka Amrit Mahotsav Photo Exhibition In Palnadu District - Sakshi

ఎమ్మెల్సీలు డొక్కా మాణిక్యవర ప్రసాద్, జంగా కృష్ణమూర్తి

ఆకట్టుకున్న ఫొటో ఎగ్జిబిషన్‌

కొనసాగుతున్న ఆజాదీ కా అమృత్‌  మహోత్సవ్‌ కార్యక్రమాలు

నరసరావుపేట ఈస్ట్‌: దేశం కోసం తమ ప్రాణాలను తృణప్రాయంగా ఎంచి పోరాడిన మహనీయుల జీవిత చరిత్రలను భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందని శాసనమండలి సభ్యులు డొక్కా మాణిక్య వరప్రసాదు, జంగా కృష్ణమూర్తి తెలిపారు. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ కార్యక్రమాలలో భాగంగా శనివారం శ్రీసుబ్బరాయ అండ్‌ నారాయణ కళాశాలలో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను జిల్లా కలెక్టర్‌ లోతేటి శివశంకర్‌తో కలసి ప్రారంభించారు. జాతిపిత మహాత్మా గాం«ధీ, రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్ల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో విద్యార్థులనుద్దేశించి వారు మాట్లాడారు. 75 సంవత్సరాల స్వాతంత్య్ర దినోత్సవాన్ని నూతన పల్నాడు జిల్లాలో జరుపుకోవటం ఆనందంగా ఉందన్నారు. స్వాతంత్య్రం కోసం ప్రాణార్పణ చేసి దేశానికి దిశ, దశ మార్గాన్ని చూపి నవభారత నిర్మాణంలో భాగస్వాములైన మహనీయుల స్ఫూర్తిని నేటి తరానికి అందించాలని తెలిపారు. మహాత్మాగాంధీ పల్నాడు ప్రాంతంలో పర్యటించి ప్రజలలో చైతన్యం నింపారని తెలిపారు. గాంధీ నడిచిన అహింస బాటలో ఎందరో విదేశీయులు నడిచి తమతమ దేశాలకు స్వేచ్ఛా వాయువు అందించారన్నారు. పుల్లరి ఉద్యమంలో కన్నెగంటి హనుమంతు నాటి బ్రిటిష్‌ పాలకులను ఎదిరించి స్ఫూర్తి నింపారని తెలిపారు.

ఉన్నవ లక్ష్మీనారాయణ, గుర్రం జాషువ వంటి కవులు సమసమాజ స్థాపనకు తమ రచనలు సాగించారని వివరించారు. అటువంటి మహనీయులను మననం చేసుకుంటూ వారి బాటలో పయనించాలని తెలిపారు. జిల్లా కలెక్టర్‌ శివశంకర్‌ మాట్లాడుతూ, నేటి తరం చిన్నారులు దేశ ఔన్నత్యం తెలుసుకునేందుకు ఆజాదీ కా అమృతోత్సవ్‌ దోహదపడుతుందన్నారు.

భారత రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రాథమిక హక్కులతోపాటు ఆర్టికల్‌ 51 (ఏ)లోని పదకొండు ప్రాథమిక విధులను సైతం గుర్తుంచుకోవాలన్నారు. భారత పౌరునిగా జాతీయ పతాకం, గీతాన్ని గౌరవించటం, స్వాతంత్య్ర సముపార్జనకు కృషిచేసిన మహనీయులను గుర్తు చేసుకోవటం మన విధి అని తెలిపారు. మహనీయుల త్యాగాలు అందరికీ అర్థమయ్యేలా, చిన్నారులు, యువతలో స్ఫూర్తి నింపేలా ఫొటో ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేశామన్నారు. పట్టణంలో ఆదివారం మూడు కిలోమీటర్ల స్వాతంత్య్ర  వేడుకల పాదయాత్ర నిర్వహిస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ శ్యాంప్రసాద్, ఎస్పీ రవిశంకర్‌ రెడ్డి, సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ ఓబుల్‌ నాయుడు, విద్యాశాఖాధికారి వెంకటప్పయ్య, సమాచార, పౌర సంబందాల అధికారిణి సుభాష్‌దీప్తి తదితరులు పాల్గొన్నారు.

 ఆకట్టుకున్న ఫొటో ఎగ్జిబిషన్‌  
ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా దేశ ఔన్నత్యం, స్వాతంత్య్ర పోరాట దృశ్యాలు, దేశ నాయకులతో ఏర్పా టు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ ఆకట్టుకుంది. యూరోపియన్ల రాక మొదలుకొని బ్రిటిష్‌ కాలనీల ఏర్పాటు, స్వాతంత్య్ర పోరాటం, స్వాతంత్య్ర సముపార్జన, స్వాతంత్య్రానంతర సంఘటనలు తదితర చిత్రాలు వివరణాత్మక సందేశంతో చిత్రాలను ఏర్పాటు చేశారు. వీటిలో 1498 సంవత్సరం నుండి 1885 సంవత్సరం వరకు, 1885 నుండి 1947 స్వాతంత్య్రం సముపార్జన వరకు ఫొటోలను ప్రదర్శించారు. అలాగే జాతిపిత మహాత్మా గాం«ధీ, రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ జీవితచరిత్ర చిత్రాలను ఏర్పాటు చేశారు. స్వాతంత్య్ర సమరయోధుల వేషధారణతో చిన్నారులు అలరించారు.     

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top