ఆ కుటుంబంలో వరుస మరణాలు | Father Dies In Road Accident On Way To Meet Wife And Children In Palnadu, Leaving Family Devastated | Sakshi
Sakshi News home page

ఆ కుటుంబంలో వరుస మరణాలు

Jan 20 2026 1:54 PM | Updated on Jan 20 2026 2:08 PM

Road incident in palnadu district

పండక్కి పుట్టింటికి వెళ్లిన భార్యను తెచ్చేందుకు బైక్‌పై వెళ్తుండగా ప్రమాదం 

మృతిచెందిన గామాలపాడు యువకుడు, అనాధలైన భార్య, పిల్లలు  

మృతుడు జగపతిబాబు కుటుంబంలో వరుస విషాద ఘటనలు    

పల్నాడు జిల్లా: భార్య, బిడ్డల కోసం వెళుతున్న భర్త రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడ్డాడు. విధి ఆడిన వింత నాటకంలో భార్య బిడ్డలను చూడకుండానే భర్త కన్నుమూశాడు. ఈ హృదయవిదార  ఘటన నడికుడి సమీపంలో సోమవారం జరిగింది. ఈ ఘటనలో మండలంలోని గామాలపాడుకి చెందిన సంకురాత్రి జగపతిబాబు(28) మృతిచెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి.. గామాలపాడుకి చెందిన ముక్కంటి,  వెంకటరావమ్మ దంపతులకు జగపతిబాబు ఏకైక కుమారుడు కాగా కుమార్తె కూడా సంతానం. 

కారంపూడి మండలం ఒప్పిచర్లకి చెందిన రవళితో జగపతిబాబుకి వివాహాం కాగా వీరికి సాత్విక్‌(3), హేమశ్రీ(1) సంతానం. – నడికుడి మార్కెట్‌యార్డు వద్ద ఉన్న పెట్రోల్‌ బంకులో జగపతిబాబు పనిచేస్తున్నాడు. సంక్రాంతి పండుగ కోసం భార్య రవళి ఆమె పుట్టింటికి వెళ్లింది. సంక్రాంతి పండుగ రోజు జగపతిబాబు కూడా అత్తగారింట్లోనే ఉండి ఆ తరువాత గామాలపాడుకి వచ్చాడు. పండుగ ముగియటంతో భార్య, పిల్లలను తీసుకువచ్చేందుకు ద్విచక్రవాహనంపై జగపతిబాబు బయలుదేరాడు. ఈ క్రమంలో నడికుడి దాటిన తరువాత జామతోట వద్ద టాటా ఏసీ వాహనం ద్విచక్రవాహనాన్ని బలంగా ఢీకొట్టింది. 

దీంతో రెండు వాహనాలు రోడ్డు పక్కనే ఉన్న కాలువలోకి వెళ్లాయి. ఈ ఘటనలో జగపతిబాబు తలకు బలమైన గాయాలు కాగా టాటా ఏసీ వాహనం డ్రైవర్‌ బెల్లంకొండ మండలం చిన్నరాజుపాలెంకి చెందిన  కలపాల వీరయ్య కూడా తీవ్రంగా గాయపడ్డాడు. తీవ్రంగా గాయపడిన ఇద్దరిని గురజాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. చికిత్స పొందుతూ జగపతిబాబు మృతిచెందగా మెరుగైన వైద్యం కోసం వీరయ్యని గుంటూరుకు తరలించారు. సంఘటన స్థలాన్ని ఎస్‌ఐ జి.పాపారావు పరిశీలన చేశారు. మృతుడు జగపతిబాబు భార్య రవళి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.  

జగపతిబాబు కుటుంబంలో వరుస మరణాలు 
రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన జగపతిబాబు కుటుంబం తీవ్ర విషాదంలో ఉన్నది. జగపతిబాబు తల్లిదండ్రులు ముక్కంటి, వెంకటరావమ్మలు మృతిచెందగా తోడబుట్టిన చెల్లెలు కూడా మృతిచెందింది. ముక్కంటి తాలుకా కుటుంబ సభ్యులంతా మృతిచెందగా జగపతిబాబు మాత్రమే ఉన్నారు. ఇప్పుడు రోడ్డు ప్రమాదంలో జగపతిబాబు కూడా మృతిచెందటంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. జగపతిబాబు, రవళి దంపతులకు మూడేళ్ల కుమారుడు సాతి్వక్, ఏడాది వయస్సున హేమశ్రీ సంతానం. పెట్రోల్‌ బంకులో పనిచేస్తూ జగపతిబాబు కుటుంబాన్ని పోషిస్తున్నాడు. జగపతిబాబు కూడా రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందటంతో భార్య, పిల్లలు అనాధలయ్యారు.  

⇒ సంఘటన గురించి తెలిసిన వెంటనే భార్య, ముక్కుపచ్చలారని పిల్లలు గురజాల ప్రభుత్వ వైద్యశాలకు వచ్చి బోరన విలపించారు. నువ్వు లేకుండా మేమేట్లా బతకాలయ్యా అంటూ రవళి ఏడుస్తున్న తీరు చూపరులను కంటతడి పెట్టించింది. పిల్లలిద్దరిని నేనేట్ల బ్రతికించాలయ్యా అంటూ రవళి గుండెలు పగిలేలా రోధిస్తుంది. చిన్నారులైన సాత్విక్, హేమశ్రీలు మా నాన్నకి ఏమైందని చూస్తున్న తీరు కూడా అక్కడున్నవారిని తీవ్రంగా కలచివేసింది. బంధువులు, కుటుంబ సభ్యులు చిన్నారులను హత్తుకుని రోదించారు. జగపతిబాబు కుటుంబంలో జరుగుతున్న వరుస ఘటనలతో గామాలపాడు విషాదఛాయలు అలుముకున్నాయి.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement