దిగజారుతున్న పొగాకు ధర.. రైతులు విలవిల
సాక్షి, అమరావతి: పొగాకు సగటు అమ్మకం ధర రోజురోజుకు దిగజారిపోతోంది. ఓ వైపు వేలం కేంద్రాలు ప్రారంభించి రెండు నెలలు పూర్తయినా ఆశించిన స్థాయిలో కొనుగోళ్లు ఊపందుకోవట్లేదు. మరొక వైపు పెద్ద ఎత్తున బేళ్లు తిరస్కరణకు గురవుతున్నాయి. ఇంకొక వైపు సగటు ధరలు పతనమవుతున్నాయి. ఈ పరిణామాలు పొగాకు రైతులపాలిట అశనిపాతంగా మారాయి. కానీ ప్రభుత్వం మాత్రం మార్కెట్ స్థిరంగా కొనసాగుతుందని, కొనుగోళ్లు ఊపందుకుంటున్నాయంటూ చేస్తున్న ప్రకటనలపై రైతులు మండిపడుతున్నారు. గతేడాది కొనేవారు లేక నల్లబర్లీ పొగాకు రైతులు నష్టపోతే, ఈసారి ప్రభుత్వ నిర్వాకంతో ఆశించిన ధరలు రాక నష్టపోతున్నారు.
ఉత్పత్తి 2.65 లక్షల టన్నులు..వేలం జరిగింది 17,290 టన్నులు..
2025–26 సీజన్‌లో 2.93 లక్షల ఎకరాల్లో పొగాకు సాగవగా.. రెండో ముందస్తు అంచనా ప్రకారం హెక్టార్‌కు 2,276 కిలోల చొప్పున ఈ ఏడాది కనీసం 2.65 లక్షల టన్నులు(265 మిలియన్ కిలోలు) దిగుబడి వస్తుందని అంచనా వేశారు. కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి 63 రోజులు పూర్తికావస్తోంది. కానీ ఇప్పటి వరకు 17,290 టన్నులు(17.29 మిలియన్ కిలోలు)కు మించలేదు. గతేడాది ఇదే సమయానికి 48,840 టన్నులు (48.84 మిలియన్ కేజీలు) కొనుగోళ్లు జరిగాయి. కొనుగోళ్ల తీరు చూస్తుంటే, మొత్తం ఉత్పత్తిలో కనీసం 5 శాతం పంటకు వేలం జరగలేదని స్పష్టమవు తోంది. ఈ స్థాయిలో కొనుగోళ్లు కొనసాగితే ఏడాదైనా సరే రైతుల వద్ద ఉన్న పంట పూర్తి స్థాయిలో అమ్ముడుపోయే అవకాశం లేదు.
రూ.211కు దిగజారిన సగటు ధర
మరొక వైపు 2023–24 సీజన్‌లో సగటుఅమ్మకం ధర కిలోకు రూ.288.65 పలుకగా, 2024–25లో కిలోకు రూ.248.86కి పడిపోయింది. కాగా 2025–26లో సగటు అమ్మకం ధర ప్రస్తుతం కిలో రూ.211కి దిగజారిపోయింది. మే 25న సరాసరి అమ్మకం ధర కిలోకు రూ.237.21 పలికింది. జూన్ 1వ తేదీ నాటికి రూ.235.63కు పడిపోగా,12వ తేదీ నాటికి రూ.211కు దిగజారిపోయింది.
దక్షిణాది తేలిక నేలల్లో పండిన పొగాకు జూన్ 1న కిలోకు రూ.231.02 పలకగా, ప్రస్తుతం రూ.211.04 మాత్రమే పలుకుతోంది. ఉత్తరాదితేలిక నేలల్లో పండిన పొగాకు జూన్ 1న కిలోకు రూ.260.29 పలకగా, ప్రస్తుతం రూ.255.98కు దిగజారింది. ఒంగోలు దక్షిణాది నల్ల నేలల్లో పండిన పొగాకు జూన్ 1న సగటు ధర కిలోకు రూ.224.45 పలకగా, ప్రస్తుతం రూ.200.41కి పడిపోయింది. అంటే 2023–24 సగటు ధరతో పోలిస్తే గరిష్టంగా కిలోకు రూ.77.65 మేర రైతులు నష్టపోతున్నారు.
ప్రభుత్వ ప్రకటనల పట్ల తీవ్ర అసంతృప్తి
ఓ వైపు ఆశించిన స్థాయిలో వేలం జరగడం లేదు. మరొక వైపు సగటు ధరలు దిగజారిపోతున్నాయి. అయినా సరే పొగాకు కొనుగోళ్లు ఊపందుకున్నాయంటూ మంత్రి అచ్చెన్నాయుడు రోజు విడిచి రోజు జారీ చేస్తున్న ప్రకటనలు విస్మయానికి గురిచేస్తున్నాయని రైతులు వాపోతున్నారు. తిరస్కరణలు, నో బిడ్‌ల స్థాయి 20 శాతం కంటే తగ్గిపోయిందంటూ చెబుతుండడం పట్ల రైతులు మండిపడుతున్నారు. సగటు ధరలు కిలోకు కనీసం రూ.350 తక్కువ కాకుండా పలికేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
కొనసాగుతున్న బేళ్ల తిరస్కరణ..
మరోవైపు బేళ్ల తిరస్కరణ కొనసాగుతూనే ఉంది. తొలుత 43శాతం నుంచి 55 శాతం తిరస్కరణకు గురికాగా, ప్రస్తుతం సగటున 21.81 శాతం బేళ్లు తిరస్కరణకు గురవుతున్నాయి. తిరస్కరించిన బేళ్లను వెనక్కి తీసుకెళ్లడానికి ఒక్కో బేలుకు రూ.2వేలు అదనంగా ఖర్చవుతుందని రైతులు వాపోతున్నారు. ఈసారి మంచి దిగుబడి, నాణ్యమైన ఉత్పత్తి సాధించినా అమ్మకం ధరలు కుప్పకూలుతుండడం ఆందోళనకు గురిచేస్తోంది. పొగాకు రైతుల్లో మెజార్టీ రైతులు కౌలు దారులే. ఆరుగాలం రెక్కలు ముక్కలు చేసుకొని కంపెనీలిచి్చన బాండ్లకనుగుణంగానే నాణ్యమైన పంటను పండించినప్పటికీ ధర లేక నష్టపోవాల్సి వస్తోందని సన్న, చిన్నకారు రైతులు వాపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆత్మవిమర్శ చేసుకోవాలని కోరుతున్నారు.


