సాక్షి, గుంటూరు: వైఎస్సార్‌సీపీ నేతలపై కూటమి సర్కార్ కక్ష సాధింపు కొనసాగుతోంది. వైఎస్సార్‌సీపీ సీఆర్‌డీఏ రైతు పరిరక్షణ కమిటీ సభ్యులపై పోలీసులు అట్రాసిటీ కేసు నమోదు చేశారు. సీఐ విధులకు ఆటంకం కలిగించారని తాడేపల్లి పీఎస్‌లో మరో కేసు నమోదైంది. వైఎస్సార్‌సీపీ నేతలు అంబటి రాంబాబు, పేర్ని నాని, లేళ్ల అప్పిరెడ్డి, దేవినేని అవినాష్, డైమండ్ బాబు, దొంతిరెడ్డి వేమారెడ్డి, పానుగంటి చైతన్య, పెనుమాక రైతు శివారెడ్డి, నూనె ఉమామహేశ్వర్ రెడ్డి నవరత్నాల మూర్తితో పాటు పలువురిపై కేసు నమోదు చేశారు.
టీడీపీ నేతల గూండాగిరి పరాకాష్టకు చేరింది. రెడ్‌బుక్ రాజ్యాంగం నడుపుతున్న మంత్రి లోకేశ్ నియోజకవర్గంలోనే వైఎస్సార్‌సీపీ నేతలపై దాడికి తెగబడ్డారు. వైఎస్సార్‌సీపీ నేతలపై రాళ్లు, కర్రలు, కోడిగుడ్లతో దాడి చేయడంతో రాజధాని ముఖ ద్వారమైన ఉండవల్లిలో శనివారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. రైతుల ఆహ్వానం మేరకు రాజధాని రైతుల పరిరక్షణ కమిటీ సభ్యులు మాజీ మంత్రి పేర్ని నాని, అంబటి రాంబాబు, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, మొండితోక అరుణ్‌కుమార్, వైఎస్సార్‌సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్.. మంగళగిరి, తాడికొండ నియోజకవర్గాల సమన్వయకర్తలు దొంతిరెడ్డి వేమారెడ్డి, వనమా బాల వజ్రబాబు ఉండవల్లి సెంటర్ సమీపానికి చేరుకున్నారు.
ట్రాఫిక్ నిలిచి పోవడంతో ధర్నా జరుగుతున్న ప్రాంతానికి 500 మీటర్ల దూరంలో ఉన్నారు. అక్కడికి వెళ్లడానికి వీల్లేదని పోలీసులు చెబుతుండగానే, ధర్నా చేస్తున్న టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఒక్కసారిగా ఎమ్మెల్సీ అరుణ్‌కుమార్ ప్రయాణిస్తున్న కారుపై చేతులతో బాదారు. పోలీసులు వారిని ఏమాత్రం వారించలేదు. దీంతో కొంత మంది టీడీపీ కార్యకర్తలు నోటికి వచ్చినట్లు అరుణ్‌కుమార్, పేర్ని నాని, అంబటి రాంబాబును కులం పేరుతో దూషిస్తూ, ఇంట్లో మహిళలను కూడా తిడుతూ అంబటి రాంబాబు దగ్గరకు వెళ్లే ప్రయత్నం చేశారు.
ఈ క్రమంలో కొంత మంది వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, టీడీపీ కార్యకర్తలను అడ్డుకున్నారు. దీంతో మమ్మల్నే అడ్డుకుంటారా అంటూ వెనుక ఎమ్మెల్సీ అరుణ్‌కుమార్, పార్టీ నేత ఉమామహేశ్వరరెడ్డి కార్లపై రాళ్లు రువ్వారు. దీంతో అద్దాలు పగిలిపోయి అక్కడే ఉన్న కానిస్టేబుల్‌కు తగలడంతో అతను సొమ్మసిల్లి పడిపోయాడు. అయినప్పటికీ టీడీపీ కార్యకర్తలు ఆగకుండా రాళ్లు, కోడిగుడ్లు విసిరారు.


