ఉద్యోగులకు ఎగనామం.. పెద్ద సార్లకు అందలం | APSRTC Employees fires on Andhra pradesh Govt | Sakshi
Sakshi News home page

ఉద్యోగులకు ఎగనామం.. పెద్ద సార్లకు అందలం

May 12 2025 6:19 AM | Updated on May 12 2025 6:19 AM

APSRTC Employees fires on Andhra pradesh Govt

ఆర్టీసీ పదోన్నతుల్లో వింత

47 వేల మంది ప్రమోషన్లకు ప్రభుత్వం మోకాలడ్డు

మెరిట్‌ రేటింగ్‌ రిపోర్ట్స్‌ విధానానికి చెల్లుచీటి

డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్‌లు, క్లర్క్‌లకు నష్టం

ఉన్నతాధికారులకు మాత్రం ఇదే విధానంతో పదోన్నతులు

ప్రభుత్వ తీరుపై మండిపడుతున్న ఆర్టీసీ ఉద్యోగులు

సాక్షి, అమరావతి: అయిన వారికి ఆకుల్లో.. కాని వారికి కంచాల్లో అన్నట్టుగా తయారైంది ఆర్టీసీలో పదోన్నతుల వ్యవ­హారం. దాదాపు 47 వేల మంది ఆర్టీసీ సాధారణ ఉద్యోగుల పదోన్నతులకు ప్రభుత్వం మోకాలడ్డుతోంది. కేవలం వందలోపు ఉండే ఉన్నతా­ధికారులకు మాత్రం అత్యంత సరళతర విధానంలో పదోన్నతులు కల్పించాలని నిర్ణయించింది. ఆర్టీ­సీ­లో ఉద్యోగుల పదోన్నతుల కోసం మెరిట్‌ రేటింగ్‌ రిపోర్ట్స్‌ (ఎంఆర్‌ఆర్‌) విధానం అమలులో ఉండేది.

దీన్ని కాదని ప్రభు­త్వ ఇతర శాఖల ఉద్యోగుల పదోన్నతుల కోసం అమ­లు చేస్తున్న ‘యాన్యువల్‌ కాన్ఫిడెన్షియల్‌ రిపోర్ట్స్‌ (ఏసీఆర్‌) విధానాన్ని ఆర్టీసీ ఉద్యోగులకు కూడా వర్తింప చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిర్ణయించింది. ఈ విధానాన్ని ఆర్టీసీ ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే ఇతర ప్రభుత్వ శాఖల ఉద్యోగుల పని విధానానికి, ఆర్టీసీలో పని విధానానికి మధ్య చాలా వ్యత్యాసాలు ఉన్నాయి. ఇతర ప్రభుత్వ శాఖల్లో ఎంతో తీవ్ర­మైన అంశాలకే మెమోలు జారీ చేస్తారు. కానీ ఆర్టీసీలో చిన్న చిన్న అంశాలకు కూడా మెమోలు ఇస్తారు. 

ఆర్టీసీ బస్సుల సమయ పాలన, ట్రాఫిక్‌ ఇబ్బందులు ఇతరత్రా అంశాల దృష్ట్యా ఈ విధానాన్ని పాటిస్తుంటారు. కానీ ఆ మెమోలను ఉద్యోగుల పనితీరుకు ప్రతి­కూల అంశంగా పరిగణించరు. సర్వసాధారణ అంశంగానే చూస్తారు. ఈ లెక్కన ఎంఆర్‌ఆర్‌ విధానంలో పదోన్నతుల కల్పనకు ఈ మెమోలు ప్రతిబంధకం కావు. కానీ ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన ఏసీఆర్‌ విధానంలో మాత్రం ఆ మెమోలను తీవ్రంగా పరిగణిస్తారు.

తద్వారా ఉద్యోగుల పనితీరు సరిగా లేదని పదోన్నతులు, ఇతర ప్రోత్సాహకాలను నిరాకరిస్తారు. అందుకే ఆర్టీసీ ఉద్యోగులు ఏసీఆర్‌ విధానాన్ని వ్యతిరేకిస్తున్నారు. తమకు ఎంఆర్‌ఆర్‌ విధానంలోనే పదోన్నతులు కల్పించాలని డిమాండ్‌ చేస్తున్నారు. కాగా కొద్ది రోజుల క్రితం నిర్వహించిన డిపార్ట్‌మెంటల్‌ పదోన్నతుల కమిటీ (డీపీసీ) సమావేశంలో ప్రభుత్వ ప్రతినిధులుగా ఉన్న ఐఏఎస్‌ అధికారులు కొత్తగా ఏసీఆర్‌ విధానంలోనే పదోన్న­తులు కల్పిస్తామని స్పష్టం చేశారు. ఏసీఆర్‌ నివేదికలు రూపొందించనందున ఆర్టీసీ ఉద్యోగుల పదోన్నతులను వాయిదా వేశారు.

ఉన్నతాధికారులకు మాత్రం ఎంఆర్‌ఆర్‌!
రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం జారీ చేసిన ఉత్త­ర్వులు తీవ్ర వివాదాస్పదమవుతున్నాయి. ఆర్టీ­సీలో ఆరు కేటగిరీల ఉన్నతాధికారులకు మాత్రం గతంలో అనుసరించిన ఎంఆర్‌ఆర్‌ విధానంలోనే పదోన్న­తులు కల్పించాలని నిర్ణయించింది. ఆర్టీసీ అత్యు­న్నత అధికారులైన ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్, రీజనల్‌ మేనేజర్లు సీనియర్‌ స్కేల్‌ మేనేజర్లు, చీఫ్‌ మేనేజర్లు, డిప్యూటీ అకౌంట్స్‌ ఆఫీసర్లు, ఎగ్జిక్యూ­టివ్‌ ఇంజినీర్లకు ఎంఆర్‌ఆర్‌ విధానంలోనే పదో­న్న­తులు కల్పించేందుకు అనుమతినిస్తూ రవాణా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కానీ కింది స్థాయి­లో విధులు నిర్వర్తించే డ్రైవర్లు, కండక్టర్లు, మెకా­నిక్‌లు, డిపో మేనేజర్లు, సూపర్‌వైజర్లు, సీనియర్‌ అసిస్టెంట్లు, జూనియర్‌ అసిస్టెంట్లు మొదలైన వారికి కొత్తగా ప్రవేశపెట్టిన ఏసీఆర్‌ విధానంలోనే పదోన్నతులు కల్పిస్తామని స్పష్టం చేసింది. తద్వారా 47 వేల మంది ఉద్యోగుల ఆర్థిక ప్రయో­జనాలకు భంగం వాటిల్లనుంది. దీనిపై ఆర్టీసీ ఉద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement