‘ఈఆర్‌సీ’.. సీరియస్‌! సర్కారుకు 'షాక్‌' | APERC Serious Shock to Chandrababu Govt Electricity Charges | Sakshi
Sakshi News home page

‘ఈఆర్‌సీ’.. సీరియస్‌! సర్కారుకు 'షాక్‌'

Sep 29 2025 4:43 AM | Updated on Sep 29 2025 4:43 AM

APERC Serious Shock to Chandrababu Govt Electricity Charges

బాబు విద్యుత్‌ బాదుడుపై ‘సాక్షి’ ప్రచురించిన కథనాలు

దాదాపు రూ.వెయ్యి కోట్ల అడ్డగోలు వసూళ్లపై గట్టిగా మొట్టికాయలు

విద్యుత్తు వినియోగదారుల నుంచి ఇప్పటికే అదనంగా వసూలు చేసిన రూ.923.55 కోట్లు వెనక్కివ్వాలంటూ ఆదేశం

నవంబర్‌ బిల్లు నుంచి 12 వాయిదాల్లో తిరిగి చెల్లించాల్సిందే..

చంద్రబాబే దయతలచి ట్రూ డౌన్‌ చేసినట్లు ఎల్లో మీడియాలో నిస్సిగ్గుగా ప్రచారం

అధికారంలోకి రాగానే తగ్గించకపోగా చార్జీల మోతతో బాదేసిన బాబు 

దాదాపు రూ.19 వేల కోట్ల విద్యుత్తు చార్జీల బాదుడుతో ప్రజలకు షాక్‌లు..

2024–25లో వసూలు చేసిందంతా వెనక్కి ఇవ్వాలని వినియోగదారుల డిమాండ్‌

సాక్షి, అమరావతి: ఎడాపెడా విద్యుత్తు చార్జీలతో వినియోగదారులను బాదేస్తున్న చంద్రబాబు సర్కారుకు ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) గట్టి షాక్‌నిచ్చింది! విద్యుత్తు చార్జీల వాతలతో ప్రజల నుంచి ఇప్పటికే వసూలు చేసిన సొమ్ములో దాదాపు రూ.వెయ్యి కోట్లు తిరిగి వారికి వెనక్కి చెల్లించాలని ఆదేశించింది. చార్జీల మోత మోగించిన చంద్రబాబు సర్కారుకు ఏపీఈఆర్‌సీ ఇలా గట్టిగా మొట్టికాయలు వేస్తే అదేదో ప్రభుత్వం  దయతలచి ఔదార్యంగా ఇస్తున్నట్లు ఎల్లో మీడియాలో నిస్సిగ్గుగా ప్రచారం చేసుకోవడంపై సర్వత్రా తీవ్ర విస్మయం వ్యక్తమవుతోంది. 

చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదికి అంటే 2024–25 ఆర్ధిక సంవత్సరానికి రూ.2,787.18 కోట్లు ఇప్పటికే ప్రజల నుంచి ముక్కుపిండి వసూలు చేయగా అందులో రూ.923.55 కోట్లను వినియోగదారులకు వెనక్కి చెల్లించాలని ఏపీఈఆర్‌సీ తాజాగా ఆదేశించింది. అయితే ఇదంతా కూటమి సర్కారు గొప్పతనంగా, అసలు ట్రూ డౌన్‌ చంద్రబాబు ప్రభుత్వం కల్పించిన ఊరట అంటూ టీడీపీ అనుకూల మీడియా ప్రచారాన్ని నెత్తికెత్తుకుంది. ప్రజలపై ఇప్పటి వరకూ రూ.17,348.64 కోట్లు విద్యుత్‌ చార్జీల భారం వేసిన కూటమి ప్రభుత్వాన్ని భుజానకెత్తుకుని కీర్తించడంపై ఇంధన రంగ నిపుణులు, వినియోగదారులు విస్తుపోతున్నారు. 

తొలి ఏడాదికి అంటే 2024–25 ఆర్ధిక సంవత్సరానికి రూ.2,787.18 కోట్లు ఇప్పటికే ప్రజల నుంచి ముక్కుపిండి వసూలు చేయగా అందులో రూ.923.55 కోట్లను వినియోగదారులకు వెనక్కి చెల్లించాలని ఏపీఈఆర్‌సీ తాజాగా ఆదేశించింది. అయితే ఇదంతా కూటమి సర్కారు గొప్పతనంగా, అసలు ట్రూ డౌన్‌ చంద్రబాబు ప్రభుత్వం కల్పించిన ఊరట అంటూ టీడీపీ అనుకూల మీడియా ప్రచారాన్ని నెత్తికెత్తుకుంది. ప్రజలపై ఇప్పటి వరకూ రూ.17,348.64 కోట్లు విద్యుత్‌ చార్జీల భారం వేసిన కూటమి ప్రభుత్వాన్ని భుజానకెత్తుకుని కీర్తించడంపై ఇంధన రంగ నిపుణులు, వినియోగదారులు విస్తుపోతున్నారు.

కూటమి చెంప చెళ్లుమనిపించేలా ఏపీఈఆర్‌సీ ఆదేశాలు..
గత ప్రభుత్వం బహిరంగ మార్కెట్‌లో అధిక ధరలకు విద్యుత్‌ కొనుగోలు చేసిందంటూ తప్పుడు ప్రచారం చేసిన కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే ఏపీఈఆర్‌సీ అనుమతించిన దానికి మించి అధిక రేట్లకు కరెంట్‌ కొనుగోలు చేసింది. ఈ విషయం ఏపీఈఆర్‌సీ తాజా ఆదేశాల ద్వారా రుజువైంది. యూనిట్‌ రూ.5.27కు కొనమని ఏపీఈఆర్‌సీ చెబితే ఏపీఈపీడీసీఎల్‌లో యూనిట్‌ రూ.5.84 చొప్పున, ఏపీసీపీడీసీఎల్‌లో రూ.5.86 చొప్పున, ఏపీఎస్పీడీసీఎల్‌లో యూనిట్‌ రూ.5.89 వెచ్చించి కూటమి ప్రభుత్వం విద్యుత్‌ కొనుగోలు చేసింది. 

అందువల్లనే 2024–25 సంవత్సరానికి రూ.2,758.76 కోట్లు ఇంధన, విద్యుత్‌ కొనుగోలు సర్దుబాటు (ట్రూ అప్‌)ను డిస్కంలు ప్రతిపాదించాల్సి వచ్చింది. దీన్ని తీవ్రంగా ఆక్షేపించిన ఏపీఈఆర్‌సీ డిస్కంలు అడిగినదానికి ఆమోదం తెలపకుండా రూ.895.12 కోట్లను తగ్గించాల్సిందేనని తేల్చి చెప్పింది. రూ.1,863.64 కోట్లకు మాత్రమే అనుమతినిచ్చింది. అయితే కూటమి ప్రభుత్వం ప్రజలను విద్యుత్‌ బిల్లులతో బాదుతూ ఇప్పటికే రూ.2,787.18 కోట్లను అదనంగా వసూలు చేసేసింది. ఈ విషయాన్ని గుర్తించిన ఏపీఈఆర్‌సీ వినియోగదారుల నుంచి నేరుగా వసూలు చేసిన అదనపు చార్జీలను అక్టోబర్‌ నెల వినియోగం నుంచి అంటే నవంబర్‌లో ఇచ్చే బిల్లు నుంచి 12 వాయిదాల్లో వెనక్కి ఇవ్వాల్సిందేనని స్పష్టం చేసింది. 

ఏపీఈఆర్‌సీ ఆదేశాలు కూటమి సర్కారు చెంప చెళ్లుమనిపించేలా ఉన్నాయని విద్యుత్‌ రంగ నిపుణులు, వినియోగదారులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో తొలి ఏడాదికి బాబు సర్కారు వసూలు చేసిన మొత్తం రూ.2,787.18 కోట్లను తిరిగి ప్రజలకు చెల్లించాలని డిమాండ్‌ చేస్తున్నారు. వాస్తవం ఇలా ఉంటే, ఇదంతా చంద్రబాబు కూటమి సర్కారు ఇచ్చిన ఊరట అంటూ టీడీపీ కరపత్రం ఈనాడు నిస్సిగ్గుగా తప్పుడు కథనాన్ని అచ్చేసింది.

కూటమి ప్రభుత్వం వసూలు చేసిన రూ.923.55 కోట్లను ప్రజలకు తిరిగి చెల్లించాలంటూ ఏపీఈఆర్సీ ఇచ్చిన ఆదేశాలు 

బాబు బాదుడే బాదుడు..
టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడమే ఆలస్యం.. తొలి ఏడాదిలోనే ఏకంగా రూ.15,485.36 కోట్ల చార్జీల భారాన్ని వేసి బాదుడుకు శ్రీకారం చుట్టింది. అయితే అదనంగా వసూలు చేసిన రూ.2,787.18 కోట్లలో తాజాగా రూ.1,863.64 కోట్లకు మాత్రమే ఈఆర్‌సీ నుంచి అనుమతి లభించింది. అదే రూ.923.55 కోట్లను ప్రజలకు తిరిగి చెల్లించాలని ఏపీఈఆర్‌సీ ఆదేశించకుంటే ప్రజలపై దాదాపు రూ.19 వేల కోట్ల భారం మోపినట్లయ్యేది! అంతేకాదు.. మరో పిడుగు కూడా సిద్ధంగా ఉంది. 

ఆంధ్రప్రదేశ్‌ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ(డిస్కం)లు 4వ నియంత్రణ కాలానికి వాస్తవ ఆదాయ, ఖర్చుల వ్యత్యాసాన్ని రూ.12,771.96 కోట్లుగా లెక్కించాయి. ఈ మొత్తాన్ని విద్యుత్‌ బిల్లుల్లో కలిపి వినియోగదారుల నుంచి వసూలు చేసుకునేందుకు అనుమతినివ్వాల్సిందిగా ఇటీవల కమిషన్‌ను కోరాయి. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించకపోతే ఆ భారమంతా ప్రజలపైనే పడుతుంది.

జగన్‌ ప్రభుత్వంలో..జనంపై భారం పడకుండా
టీడీపీ కూటమి ప్రభుత్వం అదనంగా వసూలు చేసిన దానిలో కొంత మొత్తాన్ని తిరిగి ప్రజలకు ఇచ్చేయాల్సిందేనని ఏపీఈఆర్‌సీ ఆదేశిస్తే.. అదేదో తాము దయతలచి ఇస్తున్నట్లుగా ఎల్లో మీడియా ద్వారా ప్రచారం చేయించుకుంటున్నారు. వాస్తవానికి విద్యుత్తు రంగంలో మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో వినియోగదారులపై ఏమాత్రం భారం పడకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. 

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంస్కరణలు, చౌకగా కొనుగోళ్లు, ఇంధన పొదుపు లాంటి విప్లవాత్మక నిర్ణయాల వల్ల 2019–24 మధ్య విద్యుత్‌ పంపిణీ సంస్థ(డిస్కం)ల నిర్వహణ ఖర్చులు భారీగా తగ్గాయి. దీంతో ఆ ఐదేళ్లలో మొత్తం రూ.4,434.5 కోట్లను మిగిల్చినట్లు ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) అధికారికంగానే వెల్లడించింది. డిస్కంలు ఖర్చులు తగ్గించుకుని మిగిల్చిన డబ్బులను ట్రూ డౌన్‌ చేశాయి.

వైఎస్‌ జగన్‌ ప్రభుత్వంలో 2019–20 నుంచి 2023–24 వరకు ఆంధ్రప్రదేశ్‌ తూర్పు ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ(ఏపీఈపీడీసీఎల్‌) రూ.1,974.75 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌ మధ్య ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ(ఏపీసీపీడీసీఎల్‌) 2020–21 నుంచి 2023–24 వరకూ రూ.1,400 కోట్ల మేర ఖర్చులు మిగిల్చాయి. ఈ మొత్తం రూ.3,374.75 కోట్లను ట్రూ డౌన్‌ చేశాయి. ఈ డబ్బులను 2024–25 వార్షిక ఆదాయ వ్యయ నివేదిక (ఏఆర్‌ఆర్‌)లో డిస్కంలు సర్దుబాటు చేశాయి. అంటే వాటి రెవెన్యూ గ్యాప్‌ భర్తీ చేసుకోవడానికి వినియోగించుకున్నాయి. తద్వారా బకాయిలు తగ్గించుకున్నాయి. దీంతో ఆ మేరకు ప్రజలపై విద్యుత్‌ చార్జీల భారం కూడా తగ్గింది.

⇒ ఏపీ ట్రాన్స్‌కో విద్యుత్‌ లైన్లను వినియోగించుకోవడంలోనూ గత ప్రభుత్వంలో డిస్కంలు రూ.1,059.75 కోట్లు మిగిల్చాయి. విద్యుత్‌ ప్రసార వ్యవస్థ వినియోగానికి ఏపీఈఆర్‌సీ అనుమతించిన టారిఫ్‌ కంటే తక్కువగా డిస్కంలు వినియోగించాయి. ఇది ఏపీఈపీడీసీఎల్‌లో రూ.383.84 కోట్లు, ఏపీఎస్పీడీసీఎల్‌లో రూ.428.57 కోట్లు, ఏపీసీపీడీసీఎల్‌లో 247.35 కోట్లుగా ఉంది. వీటిని కూడా ఏఆర్‌ఆర్‌లో సర్దుబాటు చేశారు. ఇలా గత ప్రభుత్వం తీసుకున్న చర్యల కారణంగా రాష్ట్ర ప్రజలపై రూ.4,434.51 కోట్ల మేర ట్రూ అప్‌ భారం తగ్గింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement