
విజయవాడ: ఆటో కార్మికులకు దసరా కానుక పేరుతో ఈరోజు(అక్టోబర్ 4వ తేదీ) జరిగే సభ మోసపూరిత సభ అంటూ ఐఎఫ్‌టీయూ ఆధ్వర్యంలోని ఏపీ ప్రగతిశీల ఆటో మోటార్ వర్కర్స్ ఫెడరేషన్ ధ్వజమెత్తింది. తాము చంద్రబాబుకు వినతిపత్రం ఇవ్వడానికి కలెక్టర్‌ను, ఎమ్మెల్యే బోండాను కలిస్తే, సీఎంను కలవడానికి వీల్లేదంటూ షరతులు పెట్టారని మండిపడ్డారు మరి అటువంటుప్పుడు ఈ రోజు జరగే సభ మోసపూరిత సభ కాకపోతే ఇంకేంటని ప్రశ్నించారు ఏపీ ప్రగతిశీల ఆటో మోటార్ వర్కర్స్ ఫెడరేషన్ అధ్యక్షులు పోలారి.
‘ఆటో కార్మికులను చూసి చంద్రబాబు భయపడుతున్నారు. మా సమస్యల పై వినతిపత్రం తీసుకోవడానికి జంకుతున్నారు. ఈ రోజు జరిగే సభలో వినతి పత్రం ఇస్తామని కలెక్టర్‌ను కలిశాం , ఎమ్మెల్యే బోండా ఉమాను కలిశాం. సీఎంను కలవడానికి వీల్లేదని మా వినతిని తిరస్కరించారు. ఈరోజు జరిపే సభ మోసపూరిత సభ. ఆటో డ్రైవర్లను బలవంతంగా బెదిరించి అధికారులు సభకు తీసుకెళ్లారు.
సభలకు తరలిస్తే మంచి చేసినట్లు కాదు. నిజంగా మీరు మంచి చేస్తే స్వచ్ఛంధంగా మేమే తరలివస్తాం. సభకు బలవంతంగా ఆటో డ్రైవర్లను తరలించడం కాదు. ఇది దసరా కానుక కాదు..దగా మోసం. సూపర్ సిక్స్ పథకాలను భ్రష్టుపట్టించారు. జగన్ కంటే ఎక్కువ ఇస్తామన్నారు. ఏడాదిన్నరలో రూ. 2 లక్షల కోట్లు అప్పు తెచ్చిన మీరు ఆటో డ్రైవర్లకు రూ. 400 కోట్లు ఇవ్వలేకపోతున్నారా?, ఈ సభలోనైనా మీ హామీలను నెరవేరుస్తూ ప్రకటన చేయాలి. లేని పక్షంలో మా ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. అన్ని సంఘాలను కలుపుకుని పోరాడుతాం’ అని ఆయన హెచ్చరించారు.
ఐఎఫ్‌టీయూ ప్రధానకార్యదర్శి డి.శ్రీనివాసరావు మాట్లాడుతూ... ‘చంద్రబాబు ఒంటెద్దు పోకడతో వ్యవహరిస్తున్నారు. మా వినతిపత్రాలను కూడా తీస్కోవడం లేదు. ఎన్నికల ముందు మేం అడగకుండానే హామీలిచ్చారు. జగన్ కంటే ఎక్కువ ఇస్తామన్నారు. జగన్ రూ. 10 వేలు ఇచ్చాడు మేం రూ. 15 ఇస్తున్నామంటున్నారు. .చంద్రబాబుకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం తెలియదు.
పవన్‌ను చూసి ఓటేసిన నిరుద్యోగులు, యువత మోసపోయారు. మాకు ఇస్తామన్న ఆటో డ్రైవర్ లేవలో అనేక కొర్రీలు పెట్టారు. పెండింగ్ చలానాలు కడితేనే వాహనమిత్ర ఇస్తామని అసెంబ్లీ వేదికగా సీఎం ప్రకటించడం సిగ్గు చేటు. జీవో నెంబర్ 21 రద్దు చేయలేదు. చంద్రబాబు నువ్వు మర్చిపోతే నీ ఎన్నికల మ్యానిఫెస్టోను చదువుకో. వీడియోలు చూసి గుర్తు తెచ్చుకో.సింగ్ నగర్ వేదికగా మాకు ఇచ్చిన ఐదు హామీలు నెరవేర్చాలి. అప్పటి వరకూ మా ఉద్యమం ఆగదు’ అని వార్నింగ్ ఇచ్చారు.
ఇక్కడ చదవండి:
ఇంకో దుర్మార్గానికి తెర లేపుతున్నారు!