breaking news
Auto Workers Union
-
చంద్రబాబుపై ఆటో కార్మిక సంఘాల ఫైర్
-
ఇది దసరా కానుక కాదు.. దగా, మోసం: ఆటో కార్మిక సంఘం ఫైర్
విజయవాడ: ఆటో కార్మికులకు దసరా కానుక పేరుతో ఈరోజు(అక్టోబర్ 4వ తేదీ) జరిగే సభ మోసపూరిత సభ అంటూ ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలోని ఏపీ ప్రగతిశీల ఆటో మోటార్ వర్కర్స్ ఫెడరేషన్ ధ్వజమెత్తింది. తాము చంద్రబాబుకు వినతిపత్రం ఇవ్వడానికి కలెక్టర్‌ను, ఎమ్మెల్యే బోండాను కలిస్తే, సీఎంను కలవడానికి వీల్లేదంటూ షరతులు పెట్టారని మండిపడ్డారు మరి అటువంటుప్పుడు ఈ రోజు జరగే సభ మోసపూరిత సభ కాకపోతే ఇంకేంటని ప్రశ్నించారు ఏపీ ప్రగతిశీల ఆటో మోటార్ వర్కర్స్ ఫెడరేషన్ అధ్యక్షులు పోలారి. ‘ఆటో కార్మికులను చూసి చంద్రబాబు భయపడుతున్నారు. మా సమస్యల పై వినతిపత్రం తీసుకోవడానికి జంకుతున్నారు. ఈ రోజు జరిగే సభలో వినతి పత్రం ఇస్తామని కలెక్టర్‌ను కలిశాం , ఎమ్మెల్యే బోండా ఉమాను కలిశాం. సీఎంను కలవడానికి వీల్లేదని మా వినతిని తిరస్కరించారు. ఈరోజు జరిపే సభ మోసపూరిత సభ. ఆటో డ్రైవర్లను బలవంతంగా బెదిరించి అధికారులు సభకు తీసుకెళ్లారు. సభలకు తరలిస్తే మంచి చేసినట్లు కాదు. నిజంగా మీరు మంచి చేస్తే స్వచ్ఛంధంగా మేమే తరలివస్తాం. సభకు బలవంతంగా ఆటో డ్రైవర్లను తరలించడం కాదు. ఇది దసరా కానుక కాదు..దగా మోసం. సూపర్ సిక్స్ పథకాలను భ్రష్టుపట్టించారు. జగన్ కంటే ఎక్కువ ఇస్తామన్నారు. ఏడాదిన్నరలో రూ. 2 లక్షల కోట్లు అప్పు తెచ్చిన మీరు ఆటో డ్రైవర్లకు రూ. 400 కోట్లు ఇవ్వలేకపోతున్నారా?, ఈ సభలోనైనా మీ హామీలను నెరవేరుస్తూ ప్రకటన చేయాలి. లేని పక్షంలో మా ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. అన్ని సంఘాలను కలుపుకుని పోరాడుతాం’ అని ఆయన హెచ్చరించారు. ఐఎఫ్టీయూ ప్రధానకార్యదర్శి డి.శ్రీనివాసరావు మాట్లాడుతూ... ‘చంద్రబాబు ఒంటెద్దు పోకడతో వ్యవహరిస్తున్నారు. మా వినతిపత్రాలను కూడా తీస్కోవడం లేదు. ఎన్నికల ముందు మేం అడగకుండానే హామీలిచ్చారు. జగన్ కంటే ఎక్కువ ఇస్తామన్నారు. జగన్ రూ. 10 వేలు ఇచ్చాడు మేం రూ. 15 ఇస్తున్నామంటున్నారు. .చంద్రబాబుకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం తెలియదు.పవన్‌ను చూసి ఓటేసిన నిరుద్యోగులు, యువత మోసపోయారు. మాకు ఇస్తామన్న ఆటో డ్రైవర్ లేవలో అనేక కొర్రీలు పెట్టారు. పెండింగ్ చలానాలు కడితేనే వాహనమిత్ర ఇస్తామని అసెంబ్లీ వేదికగా సీఎం ప్రకటించడం సిగ్గు చేటు. జీవో నెంబర్ 21 రద్దు చేయలేదు. చంద్రబాబు నువ్వు మర్చిపోతే నీ ఎన్నికల మ్యానిఫెస్టోను చదువుకో. వీడియోలు చూసి గుర్తు తెచ్చుకో.సింగ్ నగర్ వేదికగా మాకు ఇచ్చిన ఐదు హామీలు నెరవేర్చాలి. అప్పటి వరకూ మా ఉద్యమం ఆగదు’ అని వార్నింగ్ ఇచ్చారు.ఇక్కడ చదవండి: ఇంకో దుర్మార్గానికి తెర లేపుతున్నారు! -
బాబు సర్కార్‌కు ఆటో కార్మికుల హెచ్చరిక.. కార్యాచరణ ప్రకటన
సాక్షి, విజయవాడ: ఆటో కార్మికులు దశలవారీ ఆందోళనకు సిద్ధమవుతున్నారు. సీఐటీయూ, ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో కార్యాచరణ ప్రకటించారు. సెప్టెంబర్ 8న అన్ని జిల్లాల కలెక్టరేట్లలో వినతి పత్రాలు అందించాలని నిర్ణయించారు. ఎమ్మెల్యేలు, మంత్రులకు వినతి పత్రాలు అందజేయడంతో పాటు.. ప్రచార జాతాలు నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 18న ఛలో విజయవాడకు పిలుపునిచ్చారు.సెప్టెంబర్ 18న అసెంబ్లీ సమావేశాల మొదటి రోజున భారీ నిరసన చేపట్టనున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి ఆటో, క్యాబ్, టాటా మ్యాజిక్ డ్రైవర్లు తరలిరానున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో ఆటో కార్మికులకు ఇచ్చిన హామీని నెరవేర్చాలని సీఐటీయూ, ఐఎఫ్టీయూ డిమాండ్ చేసింది. స్త్రీశక్తి పథకంతో నష్టపోతున్న ఆటో కార్మికులకు వాహన మిత్ర కింద రూ.30 వేలు ఇవ్వాలని.. లేనిపక్షంలో బంద్ చేపడతామని హెచ్చరించారు. -
4న ఆటో డ్రైవర్ల మహాధర్నా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి పథకంలో భాగంగా అమలు చేస్తున్న ‘మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం’పథకంతో తాము ఉపాధి కోల్పోయామని ఆటో డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో జనవరి 3న రాష్ట్రవ్యాప్తంగా బస్స్టాండ్లు, బస్ డిపోల ముందు భిక్షాటన చేస్తామని ప్రకటించారు. అలాగే ఈ నెల 4న హైదరాబాద్ లోని ఇందిరాపార్క్ వద్ద ‘మహా ధర్నా’నిర్వహిస్తామని ప్రకటించారు. మహాలక్ష్మి పథకం అమలుతో ఉపాధి దెబ్బతిన్న ఆటో కార్మికులకు ప్రభుత్వం ప్రతీనెల రూ.15 వేలు జీవన భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు బీఆర్ఎస్ కార్మిక విభాగం నేతలు రూప్ సింగ్, జి.రాంబాబు యాదవ్, వేముల మారయ్య తెలంగాణభవన్‌లో ఆదివారం ఆటో డ్రైవర్లతో సమావేశం ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం గత నెల 9వ తేదీ నుంచి అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకంతో రాష్ట్రంలో సుమారు 8 లక్షల మంది ఆటో, టాటా మ్యాజిక్, ఓలా, ఉబర్, సెవెన్ సీటర్ వాహన డ్రైవర్లు ఉపాధి కోల్పోయారని వేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశం మేరకు డ్రైవర్ల స్థితిగతులను ఆధ్యయనం చేసి నివేదిక ఇచ్చేందుకు ఈ భేటీ ఏర్పాటు చేసినట్లు కార్మిక విభాగం నేతలు వెల్లడించారు. -
సిద్దిపేటలో ఆటో వార్
రెండు గంటలపాటు ఆందోళన రాస్తారోకో.. ఆర్డీఓకు వినతి పలు పార్టీల మద్దతు సిద్దిపేట జోన్ : ఆర్టీసీ, ఆటో వర్కర్స్ యూనియన్ మధ్య కొనసాగుతున్న వివాదం శుక్రవారం రోడ్డెక్కింది. స్థానిక పాతబస్టాండు వద్ద ఆటో స్టాండు కోసం కేటాయించిన స్థలాన్ని తమకే వదలాలని, పెట్టిన కేసులన్నీ ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ ఆటో డ్రైవర్లు రెండుగంటలపాటు ఆందోళన నిర్వహించారు. సిద్దిపేట పాతబస్టాండు వద్ద పార్కింగ్ విషయంలో ఆర్టీసీ,ఆటో యూనియన్ కు మధ్య గొడవ జరిగిన విషయం విదితమే. ఈ క్రమంలో ఆర్టీసీ అధికారుల విధులకు ఆటంకం కలిగించారనే ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిని నిరసిస్తూ శుక్రవారం ఆటో వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో స్థానిక ముస్తాబాద్ చౌరస్తా వద్ద బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. దీనితో ట్రాఫిక్ స్తంభించింది. విషయం తెలుసుకున్న వన్‌టౌన్ సీఐ సురేందర్‌రెడ్డి, ఎస్ఐలు మారుతీప్రసాద్, శ్రీనివాస్ రెడ్డిలు సిబ్బందితో అక్కడికి చేరుకొని ఆటో డ్రైవర్లను శాంతింపజేసే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ వారు అంగీకరించకపోవడంతో పోలీసులు వాహనాలను మళ్లించి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. మరోవైపు ఆటోడ్రైవర్లు అక్కడినుంచి నేరుగా ఆర్డీవో కార్యాలయానికి చేరుకుని డిమాండ్ లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షుడు ఖాజా, ప్రధానకార్యదర్శి బాలకృష్ణ,ప్రతినిధులు భాస్కర్, యాదగిరి, బాల్‌రెడ్డి, కిషన్, చంద్రం, కనకరాజుతో పాటు వివిధ పార్టీల నాయకులు రేవంత్ కుమార్, బొమ్మల యాదగిరి, శ్రీకాంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


