సాక్షి, విజయవాడ: ఆపరేషన్ కగార్ ఒత్తిడితోనే మావోయిస్టులు అడవిని వీడుతున్నారని ఏపీ ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీ మహేష్ చంద్ర లడ్డా తెలిపారు. మావోయిస్టుల కదలికలపై రెండు నెలలుగా మానిటరింగ్ చేస్తున్నట్టు చెప్పుకొచ్చారు. ఎన్‌కౌంటర్ సమయంలో తప్పించుకున్న వారి కోసం కూంబింగ్ కొనసాగుతోందని పేర్కొన్నారు.
ఏపీలో పట్టుబడిన మావోయిస్టులను పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్బంగా ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీ మహేష్ చంద్ర లడ్డా మాట్లాడుతూ.. భద్రతా బలగాలు చారిత్రక విజయం సాధించాయి. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆపరేషన్ పూర్తి చేశాం. ఆపరేషన్‌లో పాల్గొన్న భద్రతా బలగాలకు అభినందనలు. మావోయిస్టుల నుంచి పెద్ద ఎత్తున ఆయుధాలను, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నాం. ఎన్‌కౌంటర్ సమయంలో కొంత మంది మావోయిస్టులు తప్పించుకున్నారు. తప్పించుకున్న వారి కోసం కూంబింగ్ కొనసాగుతోంది. నిన్న ఉదయం అల్లూరి జిల్లాలో ఎదురు కాల్పులు జరిగాయి. ఎదురు కాల్పుల్లో మావోయిస్టు అగ్రనేత హిడ్మా చనిపోయాడు. రాష్ట్రవ్యాప్తంగా 50 మంది మావోయిస్టులను అరెస్ట్‌చేశాం. కాకినాడలో మరో ఇద్దరిని, కోనసీమలో ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మావోయిస్టుల కదలికలపై రెండు నెలలుగా మానిటరింగ్ చేస్తున్నాం. ఆపరేషన్ కగార్ ఒత్తిడితోనే మావోయిస్టులు అడవిని వీడుతున్నారు.
ప్లాన్ ప్రకారమే ఆపరేషన్..
ఛత్తీస్‌ఘడ్ నుంచి ఏపీకి రావాలని మావోయిస్టులు ప్రయత్నం చేస్తున్నారు. నిఘా వర్గాలు వారి కదలికలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. నవంబరు 17న కీలకమైన ఆపరేషన్ చేపట్టాం. నిన్న మారేడుమిల్లిలో హిడ్మా, మరో ఐదుగురు ఎన్ కౌంటర్‌లో చనిపోయారు. వాళ్ల నుంచి సేకరించిన సమాచారంతో ఎక్కడెక్కడ మావోయిస్టులు ఉన్నారని దృష్టి పెట్టాం. ఎన్టీఆర్, కృష్ణా, కాకినాడ, కోనసీమ, ఏలూరు జిల్లాల నుంచి యాభై మంది మావోయిస్టులను పట్టుకున్నాం. ఎక్కడా ఎవరికీ ప్రమాదం జరగకుండా ఆపరేషన్ పూర్తి చేశాం. రాష్ట్ర చరిత్రలో ఇంతమంది కీలక వ్యక్తులను పట్టుకోవడం ఇదే ప్రథమం. కేంద్ర, రాష్ట్ర, ఏరియా, కమిటీ సభ్యులు, ఫ్లాటూన్ టీంలను పట్టుకున్నాం. వెపన్స్ 45, 272 రౌండ్స్, రెండు మ్యాగజైన్, 750 గ్రాముల వైర్, ఇతర సామాగ్రిని పట్టుకున్నాం. మా ఫీల్డ్ సిబ్బంది ప్రణాళిక ప్రకారం ఆపరేషన్ పూర్తి చేశారు. మా ఇంటెలిజెన్స్ విభాగం ఈ విషయంలో బాగా పని చేసింది. మాకు ముందే సమాచారం వచ్చినా.. వారి పై నిఘా పెట్టాం. వారి ఆలోచనలు, కార్యకలాపాలను గమనించాం. అన్నీ సెట్ చేసుకున్నాక ఒకేసారి వారందరినీ పట్టుకున్నాం.

వచ్చే ఏడాది మార్చి నాటికి ఆపరేషన్ కగార్ పూర్తి..
తెలంగాణలో కొంతమంది ఇటీవల సరెండర్ అయ్యారు. వాళ్ల ద్వారా సమాచారం వెళితే ఇబ్బందులు ఉంటాయని భావించారు. అందుకే కొన్ని రోజులు షెల్టర్ తీసుకునేందుకు ఏపీలో పలు ప్రాంతాలను ఎంచుకున్నారు. మళ్లీ సమయం చూసి వాళ్ల ప్రాంతాలకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. వారి మూవ్‌మెంట్, ప్లాన్లపై ఇతర సమాచారం లేదు. హిడ్మాను పట్టుకున్నాక చంపామనే ప్రచారంలో నిజం లేదు. వచ్చ ఏడాది మార్చినాటికి ఆపరేషన్ కగార్ పూర్తి చేస్తాం. మావోయిస్టుల కదలికలపై అనేక మార్గాల ద్వారా సమాచారం వస్తోంది. అనుమానితులపై నిఘా ఉంచాం. ఈరోజు కూడా ఏజెన్సీలో నక్సల్, పోలీసులకు మధ్య కాల్పులు జరిగాయి. ఆరు, ఏడుగురు చనిపోయారని సమాచారం ఉంది. ఇంకా పూర్తి వివరాలు రావాల్సి ఉందన్నారు. మావోయిస్టులు లొంగిపోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. లొంగిపోతే ప్రభుత్వం నుంచి రివార్డు ఇస్తాం’ అని చెప్పారు.


