
రాష్ట్ర ప్రభుత్వ తీరుపై హైకోర్టు విస్మయం
విశాఖ బటర్‌ఫ్లై పార్కు స్థలంపై పురపాలక శాఖ ప్రొసీడింగ్స్ మీద స్టే
పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశం
సాక్షి, అమరావతి :గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) పరిధిలోని బటర్‌ఫ్లై పార్కు స్థలాన్ని ప్రైవేటు వ్యక్తులకు అన్యాక్రాంతం చేసేందుకు విశాఖపట్నానికి చెందిన ఓ ఎమ్మెల్యే, అతని వియ్యంకుడైన ఓ రాష్ట్ర మంత్రి తీసుకున్న నిర్ణయానికి హైకోర్టు బ్రేక్ వేసింది. విలువైన పార్కు స్థలాన్ని ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చి, వారికి సంబంధించిన స్థలాన్ని భూమార్పిడి కింద తాము తీసుకునేందుకు అనుమతినిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి జారీచేసిన ప్రొసీడింగ్స్‌పై హైకోర్టు స్టే విధించింది. ఈ పార్కు స్థలాన్ని ప్రైవేటు వ్యక్తులకు కేటాయించరాదని గతంలో ప్రభుత్వం నిర్ణయించిందని హైకోర్టు గుర్తుచేసింది.
అయినా ఇప్పుడు తిరిగి అదే పార్కు స్థలాన్ని ప్రైవేటు వ్యక్తులకు భూమార్పిడి కింద ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధపడటంపై హైకోర్టు విస్మయం వ్యక్తంచేసింది. భూ మార్పిడి విషయంలో పురపాలక శాఖ నియమించిన కమిటీ నివేదిక సైతం చాలా అస్పష్టంగా ఉందని అభిప్రాయపడింది. ఈ మొత్తం వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి, టౌన్ ప్లానింగ్ డైరెక్టర్, జీవీఎంసీ కమిషనర్, జిల్లా కలెక్టర్లను ఆదేశిస్తూ నోటీసులు జారీచేసింది. తదుపరి విచారణను అక్టోబరుకి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి రవి ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీచేసింది.
ప్రైవేటు వ్యక్తులకు కేటాయింపుపై పిల్..
జీవీఎంసీ వార్డు నెం.6లో ఉన్న బటర్‌ఫ్లై పార్కు స్థలాన్ని భూ మార్పిడి పద్ధతిన పోతిన అప్పారావు, పిళ్లా లక్ష్మణపాత్రుడికి కేటాయించేందుకు వీలుగా పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఈ ఏడాది మే 13న జారీచేసిన ప్రొసీడింగ్స్‌ను సవాలుచేస్తూ జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై బుధవారం సీజే ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది కె. శ్రీనివాసమూర్తి వాదనలు వినిపించారు. భూ మార్పిడి పేరుతో విలువైన పార్కు స్థలాన్ని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడుతున్నారని ఆయన కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.
గతంలో ఇదే వ్యవహారంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలకు విరుద్ధంగా అధికారులు నిర్ణయం తీసుకున్నారన్నారు. ప్రైవేటు వ్యక్తులు వ్యవస్థలను, అధికారులను మేనేజ్ చేసి విలువైన పార్కు స్థలాన్ని కాజేయాలని చూస్తున్నారని తెలిపారు. గతంలో ప్రైవేటు వ్యక్తులకు ఆ భూమిని ఇవ్వకూడదని నిర్ణయించిన ప్రభుత్వం, రాజకీయ జోక్యంతో తన నిర్ణయాన్ని మార్చుకుందని ఆయన వివరించారు. ప్రభుత్వం నుంచి పొందిన పార్కు స్థలంలో ప్రైవేటు వ్యక్తులు ఇప్పటికే పనులు చేస్తున్నారని, హైకోర్టు జోక్యం చేసుకోకపోతే విలువైన స్థలం చేజారి
పోతుందన్నారు.