AP High Court: పీఆర్సీపై పిటిషన్‌.. కీలక వ్యాఖ్యలు చేసిన ఏపీ హైకోర్టు

AP High Court Key Comments On Employees Petition Against 11th PRC - Sakshi

Latest Updates: పీఆర్సీపై దాఖలైన పిటిషన్‌ ప్రజా ప్రయోజన వ్యాజ్యం కాదని, అదే సమయంలో విభజన చట్టానికి సంబంధించిన పిటిషన్‌ కూడా కాదని హైకోర్టు స్పష్టం చేసింది. ఇది వ్యక్తిగత సర్వీస్‌కు సంబంధించిన మేటర్‌ కాబట్టి ఈ కోర్టులో విచారించలేమని తేల్చి చెప్పింది. ఈ పిటిషన్‌ను వేరొకరికి రిఫర్‌ చేయాలంటూ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ అమానుల్లా, జస్టిస్‌ భానుమతి తెలిపారు.

హైకోర్టులో మళ్లీ ప్రారంభమైన వాదనలు
పీఆర్సీ పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు మధ్యాహ్నం 2:15కి తిరిగి ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఏజీ శ్రీరామ్‌ వాదనలు వినిపిస్తూ.. కోర్టులో పిటిషన్‌ వేసిన వ్యక్తికి రూ.28 వేల జీతం పెరిగిందన్నారు. ప్రభుత్వంపై రూ.10,860 కోట్ల భారం పడుతుందని పేర్కొన్నారు. 2018లో ఉద్యోగుల జీతాల కోసం రూ.50వేల కోట్లు ఖర్చు చేస్తే.. ఇప్పుడు ఆ ఖర్చు రూ.68 వేల కోట్లకు చేరిందన్నారు. ఉద్యోగులకు ఇవ్వకూడదన్న ఆలోచన ప్రభుత్వానికి లేదని, పునర్విభజన చట్టంలో హెచ్‌ఆర్‌ఏ ఇంత పర్సెంటేజ్‌ ఇవ్వాలని పేర్కొనలేదని పేర్కొన్నారు.

పీఆర్సీపై ఏపీ జేఏసీ దాఖలు చేసిన పిటిషన్‌ను ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు సోమవారం విచారించింది. ఈసందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేసింది. కొత్త పీఆర్సీతో జీతాలు తగ్గాయా? పెరిగాయా? చెప్పండని పిటిషన్‌ దారులను హైకోర్టు ప్రశ్నించింది.  పూర్తి సమాచారం లేకుండా పిటిషన్‌ ఎలా వేస్తారని, అయినా పీఆర్సీని సవాల్‌ చేసే హక్కు ఉద్యోగులకు లేదని స్పష్టం చేసింది. పీఆర్సీ నివేదిక బయటకు రాకుంటే ప్రభుత్వాన్ని సంప్రదించాలని సూచించింది. తదుపరి విచారణను మధ్యాహ్నం 2:15కి వాయిదా వేసింది. ఉద్యోగ సంఘాల నేతలు తమ ముందు హాజరుకావాలని ఆదేశించింది.

అంతకుముందు కోర్టులో ఇరు వర్గాలు తమ వాదనలు వినిపించాయి. విభజన చట్టం ప్రకారం పీఆర్సీ ఇవ్వలేదని పిటిషనర్‌ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. విభజన చట్టం ప్రకారం హెచ్‌ఆర్‌ఏ ఇవ్వలేదని అన్నారు. ఇక ఏపీ అడ్వకేట్‌ జనరల్‌ ప్రభుత్వం తరపున వాదనలు వినిపించారు. పీఆర్సీపై ఉద్యోగులు ప్రభుత్వాన్ని ఎలా బెదిస్తారని వాదించారు. సమ్మెకు వెళ్తామని ఉద్యోగులు ప్రభుత్వాన్ని బెదిరించడమే కాకుండా కోర్టులో రిట్‌ పిటిషన్‌ ఎలా వేస్తారని ప్రశ్నించారు. అంగన్‌వాడీ, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు జీతాలు ఇవ్వకుండా అడ్డుకుంటున్నారని ఏజీ కోర్టుకు దృష్టికి తెచ్చారు. ఉద్యోగ సంఘాల నేతలను ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించిందని, అయితే, చర్చలను రాబోమని చెప్తున్నారని కోర్టుకు తెలిపారు.
(చదవండి: ‘మీ కుమారుడు చనిపోయినట్లు ఆన్‌లైన్‌లో చూపుతోంది.. మేమేం చేయలేం’  )

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top