498 –ఎ దుర్వినియోగం అవుతోంది.. భర్త, అతని కుటుంబాన్ని వేధించే ఆయుధంగా ..

AP high Court expressed concern Section 498-A of IPC is being Misused - Sakshi

సాక్షి, అమరావతి: వరకట్న వేధింపుల నిరోధానికి తీసుకొచ్చిన ఐపీసీ సెక్షన్‌ 498–ఎ దుర్వినియోగం అవుతోందని హైకోర్టు ఆందోళన వ్యక్తంచేసింది. అసంతృప్త భార్యలు ఈ సెక్షన్‌ను రక్షణ కవచంగా కాకుండా ఓ ఆయుధంగా ఉపయోగిస్తున్నారని తెలిపింది. భర్త, అతని బంధువులను సులభంగా వేధించేందుకు, అరెస్ట్‌ చేయించేందుకు  ఉపయోగిస్తున్నారని చెప్పింది. చిన్న చిన్న కారణాలతో ఈ సెక్షన్‌ కింద ఫిర్యాదులు చేస్తున్నారని పేర్కొంది. 

గుంటూరు జిల్లా మాచర్ల పోలీస్‌ స్టేషన్‌లో ఓ మహిళ తన భర్త కుటుంబ సభ్యులపై 498 – ఎ కింద పెట్టిన కేసును కొట్టేసింది. పిటిషనర్లపై తదుపరి ప్రొసీడింగ్స్‌ కొనసాగిస్తే అది కోర్టు ప్రక్రియ దుర్వినియోగమే అవుతుందని తెలిపింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ కొనకంటి శ్రీనివాసరెడ్డి ఇటీవల తీర్పు వెలువరించారు. వరకట్నం కోసం వేధిస్తున్నారంటూ మాచర్లకు చెందిన షేక్‌ నూర్జహాన్‌ చేసిన ఫిర్యాదు మేరకు 2020లో మాచర్ల పట్టణ పోలీసులు ఆమె భర్త, అతని తల్లిదండ్రులు, సోదరులు, వారి భార్యలను నిందితులుగా చేర్చారు.

మాచర్ల ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ కోర్టులో చార్జిషీటు దాఖలు చేశారు. మాచర్ల కోర్టు విచారణ జరుపుతోంది. తమపై నమోదు చేసిన చార్జిషీట్‌ను కొట్టేయాలని కోరుతూ నూర్జహాన్‌ తోడికోడళ్లు షేక్‌ ఆరీఫా, ఆయేషా, వారి భర్తలు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై జస్టిస్‌ కె. శ్రీనివాసరెడ్డి విచారణ జరిపారు. ఫిర్యాదుదారు చేసినవన్నీ నిరాధార ఆరోపణలని న్యాయమూర్తి తేల్చారు. అదనపు కట్నం వేధింపుల్లో పిటిషనర్లు ఆమె భర్తకు సహకరించారని నిరూపించేందుకు ఎలాంటి ఆధారాలు లేవని తెలిపారు. వారిపై కేసు కొట్టేస్తున్నట్లు తన తీర్పులో పేర్కొన్నారు.

చదవండి: (మరో కీలక అడుగు.. విశాఖలో ఆంగ్లియాన్‌ పారిశ్రామిక, లాజిస్టిక్‌ పార్క్‌)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top