
తెలంగాణలో ఇంటర్ చదివిన ఏపీ విద్యార్థులకు సర్కారు షాక్
ఈఏపీసెట్ కౌన్సెలింగ్‌లో ప్రవేశాలకు మోకాలొడ్డు
విద్యార్థి తల్లిదండ్రులు పదేళ్లు ఏపీలో నివసించినట్టు సర్టిఫికెట్ తేవాలంటూ నిబంధన
తహసీల్దార్ కార్యాలయాల్లో సర్టిఫికెట్లు ఇచ్చేందుకు నిరాకరణ
పునర్‌వ్యవస్థీకరణ చట్టం ప్రకారం గతేడాదితో ముగిసిన పదేళ్ల గడువు
ఏడాది తర్వాత హడావుడిగా స్థానికతపై జీవోలిచ్చిన ఉన్నత విద్యాశాఖ
సాక్షి, అమరావతి: ఇంజినీరింగ్ ప్రవేశాల వేళ లోకల్, నాన్‌లోకల్ కోటా విభజన విద్యార్థుల్లో తీవ్ర గందరగోళాన్ని సృష్టిస్తోంది. పదో తరగతి వరకు ఏపీలోనే చదివి.. తెలంగాణలో ఇంటర్మీడియెట్ పూర్తి చేసిన విద్యార్థులను నాన్‌లోకల్ (స్థానికేతరులు)గా రాష్ట్ర ప్రభుత్వం పరిగణిస్తోంది. తెలంగాణలో ఇంటర్ పూర్తి చేసిన ఏపీ విద్యార్థులు ఈఏపీసెట్ ద్వారా ఇంజినీరింగ్‌లో చేరేందుకు దరఖాస్తు చేసుకోగా వారికి స్థానిక కోటా వర్తించడం లేదు. స్థానికేతర కోటా పొందడానికి వీలులేకుండా వారి భవిష్యత్‌తో రాష్ట్ర ప్రభుత్వం చెలగాటమాడుతోంది.
ఏడాదంతా ఏం చేసినట్టు?
భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏపీ ఏర్పడినప్పుడు రాజ్యాంగంలోని ఆర్టికల్ 371డీ ప్రకారం ప్రత్యేక నిబంధనలు పొందుపరిచారు. దీనిద్వారా తెలంగాణ, ఏపీ ప్రాంతాల్లో ఉపాధి, విద్యలో సమాన అవకాశాలు కల్పించాలనేది దీని ఉద్దేశం. దీనినే 2014 రాష్ట్ర విభజన సమయంలోనూ మరో పదేళ్లపాటు కొనసాగించేలా రాష్ట్రపతి ప్రత్యేక ఆర్డర్ ఇచ్చారు. ఇందులో భాగంగా విద్యాసంస్థల్లో ప్రవేశం కోసం ఉస్మానియా, ఆంధ్ర(ఏయూ), శ్రీవెంకటేశ్వర (ఎస్వీయూ) రీజియన్ల వారీగా స్థానికతను (లోకల్ 85 శాతం, నాన్‌లోకల్ 15శాతం) ప్రామాణికంగా తీసుకుని సీట్లు భర్తీ చేసేవారు. గతేడాది జూన్ 2వ తేదీతో పదేళ్ల గడువు ముగిసింది. ఆ వెంటనే తెలంగాణ ప్రభుత్వం నాన్‌లోకల్ 15 శాతం సీట్లను ఇకపై ఏపీ విద్యార్థులకు కేటాయించేది లేదని స్పష్టం చేసింది. కానీ, కూటమి ప్రభుత్వం కాలయాపన చేసి.. ఈ ఏడాది ప్రవేశాలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో హడావుడిగా జీవోలు ఇచ్చి చేతులు దులుపుకుంది. దీనిపై ఎవరికీ అవగాహన కల్పించకపోవడం గమనార్హం.
న్యాయస్థానంలో సవాల్?
ఉన్నత విద్యాశాఖ స్థానికతను సవరిస్తూ ఇచ్చిన జీవోలు చట్టం ముందు నిలవలేవని, న్యాయస్థానంలో సవాల్ చేస్తే.. పాత విధానాన్ని అమలు చేసేలా తీర్పు వస్తుందని.. దీనివల్ల తెలంగాణలో చదివినప్పటికీ ఎటువంటి చిక్కులు లేకుండానే ఏపీలో నాన్‌లోకల్ కోటా వర్తిస్తుందని తేల్చి చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యావేత్తలు, సామాజిక కార్యకర్తలు న్యాయస్థానాన్ని ఆశ్రయించేందుకు యోచిస్తున్నట్టు సమాచారం. స్థానికత అంశం ప్రాథమిక పాఠశాలల నుంచి ఉన్నత విద్యా సంస్థల వరకు వర్తిస్తుంది.
కానీ, ఒక్క ఉన్నత విద్యాశాఖ పరిధిలోని ప్రవేశ పరీక్షలకు సంబంధించి మాత్రమే స్థానికతను మార్పుచేస్తూ ఉత్తర్వులు వచ్చాయి. విద్యార్థుల తల్లిదండ్రులు పదేళ్లపాటు ఏపీలో నివసిస్తున్నట్టు చూపిస్తే స్థానికేతర కోటాలో కౌన్సెలింగ్‌లో పాల్గొనవచ్చని ప్రభుత్వం చెబుతోంది. కానీ,్థ తల్లిదండ్రులకు నివాస ధ్రువీకరణ పత్రం ఇవ్వడానికి రెవెన్యూ అధికారులు నిరాకరిస్తున్నారని విద్యార్థులు వాపోతున్నారు. తల్లిదండ్రుల నివాస ధ్రువీకరణ పత్రాలు లేకుంటే.. సంబంధిత విద్యార్థుల తల్లిదండ్రుల స్టడీ సర్టిఫికెట్స్ ఏపీలో ఉంటే కౌన్సెలింగ్‌కు అనుమతిస్తామని ఈఏపీ సెట్ కౌన్సెలింగ్ అధికారులు చెబుతున్నారు. చదువు లేని తల్లిదండ్రులున్న విద్యార్థుల పరిస్థితి ఏమిటనేది ప్రశ్నార్థకంగా మారింది. దీనిపై ఈఏపీ సెట్ హెల్ప్‌లైన్ నంబర్లకు ఫిర్యాదులు వస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.