మరిన్ని వ్యాపారాల్లోకి ఏపీ ఫైబర్‌గ్రిడ్‌ | Sakshi
Sakshi News home page

మరిన్ని వ్యాపారాల్లోకి ఏపీ ఫైబర్‌గ్రిడ్‌

Published Sun, Oct 8 2023 5:14 AM

AP FiberGrid to more businesses - Sakshi

సాక్షి, అమరావతి: కేబుల్‌ టీవీ, టెలికాం కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఏపీ స్టేట్‌ ఫైబర్‌నెట్‌ లిమిటెడ్‌ (ఏపీఎస్‌ఎఫ్‌ఎల్‌) మరిన్ని వ్యాపార రంగాల్లోకి అడుగుపెట్టనున్నట్లు ఆ సంస్థ చైర్మన్‌ పి.గౌతమ్‌ రెడ్డి తెలిపారు. శనివారం విజయవాడలోని ఆ సంస్థ ప్రధాన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఇటీవల జరిగిన సర్వసభ్య సమావేశం నిర్ణయాలను ఆయన వివరించారు. రాష్ట్రంలో శాంతిభద్రతల కోసం ఏర్పాటు చేస్తున్న సీసీ కెమెరాల నిర్వహణను ఏపీఎస్‌ఎఫ్‌ఎల్‌ చేపట్టినట్లు ఆయన తెలిపారు. అదే విధంగా దేశవ్యాప్తంగా టెలికాం సంస్థలు పిలిచే టెండర్లలో పాలొ­్గని ఆ ప్రాజెక్టులను కూడా చేపడతామన్నారు.

వ్యాపార విస్తరణకు అనుగుణంగా మూలధనం పెంచుకోవడానికి బోర్డు ఆమో­దం తెలిపిందని, ప్రస్తుతం రూ. 7 కోట్లుగా ఉన్న మూలధనా­న్ని రూ. 2,000 కోట్లకు పెంచుకోవాలని నిర్ణయించినట్లు చెప్పా­రు. ప్రస్తుతం ఏపీఎస్‌ఎఫ్‌ఎల్‌ ఆస్తుల విలువ రూ. 3,586.22 కోట్లుగా ఉందన్నారు. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో ఫైబర్‌నెట్‌ ఫేజ్‌–2 ప్రాజెక్టును చేపట్టామని, ఇందులో రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్‌ గ్రాంట్‌ రూ. 627 కోట్లను రుణ రూపంలో సమకూర్చుకుంటున్నట్లు తెలిపారు.

2020–21 ఆర్థిక సంవత్సరం వరకు ఏపీఎస్‌ఎఫ్‌ఎల్‌ అకౌంట్లను ఇంటర్నల్‌/ఎక్స్‌టర్నల్‌ ఆడిటింగ్‌ తర్వాత కాగ్‌కు సమర్పించాలని బోర్డు నిర్ణయం తీసుకుందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో సెట్‌టాప్‌ బాక్స్‌ల కొరత ఉండటంతో ఎంఎస్‌వోలు సొంతంగా వాటిని కొనుగోలు చేసి వినియోగదారులకు అందిస్తే తొమ్మిది నెలల గడువులో ఆ మొత్తం చెల్లించడానికి నిర్ణయించినట్లు తెలిపారు. 

యనమల పాత్ర గురించి అప్పట్లోనే చెప్పా.. 
ఫైబర్‌ గ్రిడ్‌ కుంభకోణంలో చంద్రబాబు, అప్పటి ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు పాత్ర ఉందని గతంలోనే చెప్పానని గౌతమ్‌రెడ్డి గుర్తుచేశారు. ఈ కుంభకోణంలో లోకేశ్‌ పాత్ర ఉందా లేదా అన్న విషయం దర్యాప్తులో తేలుతుందన్నారు. అధికారంలో ఉన్నప్పుడు తనను ఎవరూ ఏమీ చేయలేరన్న అహంకారంతో చంద్రబాబు ఉండేవారని, ఇప్పుడు అడ్డంగా దొరికిపోయి జైల్లో ఉన్నారన్నారు. చంద్రబాబు బాధితుల్లో తానూ ఒకడినని, తనను కూడా జైలుకు పంపించారన్నారు. ఒక వ్యక్తిని అన్యాయంగా అరెస్ట్‌ చేస్తే ఆ కుటుంబం ఎంత వేదన చెందుతుందో ఇప్పుడు బాబు కుటుంబసభ్యులకు కూడా తెలుస్తుందన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement