రఘురామరాజుది దుష్ప్రచారమే

AP CID Department Announcement On Raghu Rama Krishna Raju Issue - Sakshi

నిబంధనల ప్రకారమే సెల్‌ఫోన్‌ సీజ్‌

సెల్‌ఫోన్‌ నంబరుపై పరస్పర విరుద్ధ సమాచారమిస్తున్న రఘురామ

ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించేలా ఓ వర్గం మీడియాలో కథనాలు

ఏపీ సీఐడీ విభాగం ప్రకటన

సాక్షి, అమరావతి: సమాజంలో విద్వేషాలు రేకెత్తించేందుకు కుట్రపూరితంగా వ్యవహరించిన కేసులో నిందితునిగా నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు తన సెల్‌ఫోన్‌ను అనధికారికంగా జప్తు చేసినట్టు, ఆ ఫోన్‌ నుంచి వాట్సాప్‌ సందేశాలు వెళ్తున్నట్టు చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని ఏపీ సీఐడీ విభాగం స్పష్టం చేసింది. దర్యాప్తులో భాగంగా నిబంధనల ప్రకారమే ఆయన సెల్‌ఫోన్‌ను సీజ్‌ చేశామని, ఆ విషయాన్ని సీఐడీ న్యాయస్థానానికి కూడా నివేదించామని సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ కేసులో నిందితులైన రఘురామకృష్ణరాజు, టీవీ 5, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి చానళ్లపై నిబంధనల ప్రకారమే దర్యాప్తు చేస్తున్నామని తెలిపింది. సెల్‌ఫోన్‌ జప్తు సమయంలో రఘురామకృష్ణరాజు చెప్పిన వివరాలకు.. ఢిల్లీ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్న వివరాలు పూర్తి విరుద్ధంగా ఉన్న విషయాన్ని కూడా సీఐడీ ప్రముఖంగా ప్రస్తావించింది. అసత్య ఆరోపణలతో రఘురామకృష్ణరాజు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కొన్ని మీడియా సంస్థలు ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించేందుకు ప్రయత్నిస్తున్నాయని పేర్కొంది.

సెల్‌ఫోన్‌ జప్తునకు సంబంధించి సీఐడీ వెల్లడించిన వివరాలివీ..
► ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన తరువాత రఘురామకృష్ణరాజును హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో అరెస్ట్‌ చేశాం. నేరానికి సంబంధించి కీలక ఆధారమైన ఆయన సెల్‌ఫోన్‌ను జప్తు చేసి నిబంధనల ప్రకారం ఇద్దరు సాక్షుల సమక్షంలో మే 15న జప్తు మెమోను జారీ చేశాం. ఆ సమయంలో తనది ఐఫోన్‌ 11 ప్రొ మ్యాక్స్‌ సెల్‌ఫోన్‌ అని, 90009 11111 ఎయిర్‌టెల్‌ నంబరుతో ఉందని రఘురామకృష్ణరాజు చెప్పారు. ఆ సమయంలో ఆ సెల్‌ఫోన్‌ ఏ నంబరు సిమ్‌తో ఉందనే విషయం దర్యాప్తు అధికారికి తెలియదు కాబట్టి రఘురామకృష్ణరాజు చెప్పిందే నమోదు చేశారు. కాగా ఆయన ఢిల్లీ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో 9000922222 అనే సిమ్‌ నంబరుతో ఉన్న తన సెల్‌ఫోన్‌ను సీఐడీ అధికారులు జప్తు చేశారని పేర్కొన్నట్టు పత్రికల్లో ప్రచురితమైంది. సెల్‌ఫోన్‌ జప్తు సమయంలో సాక్షుల సమక్షంలో చెప్పిన దానికి పూర్తి విరుద్ధంగా ఢిల్లీ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. అంటే వాట్సాప్‌ సందేశాలు వెళ్లాయని ఆయన చెబుతున్న సిమ్‌ కార్డు నంబర్‌తో ఉన్న సెల్‌ఫోన్‌ సీఐడీ పోలీసుల వద్ద లేదని ఆయన ఒప్పుకున్నట్టే.

► సీఐడీ అధికారులు ఆ సెల్‌ఫోన్‌కు సీల్‌వేసి గుంటూరులోని సీఐడీ న్యాయస్థానానికి సమర్పించారు. ఆ సీల్‌ కవర్‌లోని సెల్‌ఫోన్‌ను ఫోరెన్సిక్‌ పరీక్షల కోసం మే 18న ఏపీ ఫోరెన్సిక్‌ ల్యాబొరేటరీకి పంపారు. ఆ సెల్‌ఫోన్‌లోని డేటా, ఇమేజ్‌లను పరిశీలించి తుది నివేదికను ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ ఇవ్వాల్సి ఉంది. ఈ వ్యవహారంలో ప్రతి అంశాన్ని న్యాయస్థానానికి ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నాం. ఆ ఫోన్‌ను ఎప్పుడెప్పుడు ఎలా ఉపయోగించారనే సమాచారాన్ని న్యాయస్థానానికి మే 27న, ప్రోసెస్డ్‌ డంప్‌ డేటాను మే 31న న్యాయస్థానానికి సమర్పించాం. ఆయన సెల్‌ఫోన్‌ మే 18 నుంచి సీల్‌ వేసి ఫోరెన్సిక్‌ ల్యాబొరేటరీ ఆధీనంలో ఉంది. ఆ సెల్‌ఫోన్‌ సీఐడీ అధికారులకు అందుబాటులో లేనే లేదు. దర్యాప్తును ప్రభావితం చేసేందుకే రఘురామకృష్ణరాజు అసత్య ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పటికీ ఆ సెల్‌ఫోన్‌లో ఉన్న సిమ్‌ అసలు నంబరు ఏమిటన్నది సీఐడీ పోలీసులకు తెలియదు. ఫోరెన్సిక్‌ ల్యాబొరేటరీలో ఉన్న ఆ సెల్‌ఫోన్‌కు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు న్యాయస్థానానికి నివేదిస్తున్నారు. ఫోరెన్సిక్‌ ల్యాబొరేటరీ నుంచి తుది నివేదిక రావాల్సి ఉంది. ఆ తరువాతే ఆ సెల్‌ఫోన్‌ సిమ్‌ నంబరు ఏమిటన్నది నిర్ధారించగలం.

► జప్తు చేసిన రఘురామకృష్ణరాజు సెల్‌ఫోన్‌కు సంబంధించిన అన్ని వాస్తవాలను సుప్రీం కోర్టుకు నివేదిస్తాం. తదనుగుణంగా తదుపరి చర్యలు తీసుకుంటాం. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top