‘ప్రాథమిక దశలోనే మంచి విద్య అందించేలా విప్లవాత్మక చర్యలు’

AP Cabinet Meeting Decisions - Sakshi

సాక్షి, అమరావతి : రాష్ట్రంలో విద్యా వ్యవస్థను మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటున్నామని, నాడు-నేడు కింద స్కూళ్లను సౌకర్యవంతంగా తీర్చిదిద్దామని మంత్రి పేర్నినాని అన్నారు. రాష్ట్రంలో 34 వేలకు పైగా ప్రాథమిక పాఠశాలలు అభివృద్ధి చేశామని, మెరుగైన విద్య అందించాలన్నదే సీఎం జగన్‌ ఆకాంక్షని పేర్కొన్నారు. శుక్రవారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రి వర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను పేర్ని నాని మీడియాకు వెల్లడించారు. దీనిలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ ఏ తరగతికైనా తెలుగు తప్పనిసరి సబ్జెక్ట్‌గా ఉంటుంది. ప్రాథమిక దశలోనే మంచి విద్య అందించేలా విప్లవాత్మక చర్యలు తీసుకుంటున్నాం. రాష్ట్రంలో కొత్తగా 6,22,856 మంది విద్యార్థులు ఎన్‌రోల్‌ చేసుకున్నారు. నూతన విద్యావిధానంలో స్కూళ్లను 6 రకాలుగా వర్గీకరించాం.
1) శాటిలైట్‌ స్కూల్స్‌ (పీపీ-1, పీపీ-2)
2) ఫౌండేషన్‌ స్కూల్స్‌ (పీపీ-1, పీపీ-2. 1, 2)
3) ఫౌండేషన్‌ ప్లస్‌ స్కూల్స్‌ (పీపీ-1 నుంచి 5వ తరగతి వరకు)
4) ప్రీ హైస్కూల్స్‌ (3 నుంచి 7 లేదా 8వ తరగతి వరకు)
5) హైస్కూల్స్‌ (3 నుంచి 10వ తరగతి వరకు)
6) హైస్కూల్ ప్లస్‌ (3వ తరగతి నుంచి 12వ తరగతి వరకు)
ప్రతి సబ్జెక్ట్‌కు ఒక టీచర్‌, ప్రతి తరగతికి ఒక తరగతిగది ఉంటుంది. రాష్ట్రంలో కొత్తగా 4,800 తరగతి గదులు ఉన్నాయి. రాష్ట్రంలో ఏ విద్యార్థి కూడా చదువులో వెనుకబడకూడదనేదే సీఎం లక్ష్యం. మంచి విద్య అందించాలనే లక్ష్యంతో సీఎం పనిచేస్తున్నారు. ఈనెల 16న విద్యాకానుక అందిస్తాం. ఇప్పటికే రూ.10 వేల లోపు డిపాజిట్‌ చేసిన..3 లక్షల 40 వేలమంది అగ్రిగోల్డ్‌ బాధితులకి డబ్బు అందించాం. ఈనెల 24న రూ.10వేల నుంచి 20 వేల లోపు డిపాజిట్‌ చేసిన.. అగ్రిగోల్డ్‌ బాధితులకు నగదు పంపిణీ చేస్తాం. ఇకపై కాకినాడ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీగా గోదావరి అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ. అభ్యంతరం లేని భూముల్లో ఆక్రమణల క్రమబద్ధీకరణకు ఆమోదం తెలిపాం. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు అదనంగా రూ.10 లక్షలు ఇస్తాం. పులిచింతల 16వ గేట్‌ అంశం కేబినెట్‌లో ప్రస్తావనకు వచ్చింది. మెకానికల్‌ ఫెయిల్యూర్‌ వల్ల గేట్‌ కొట్టుకుపోయినట్లు ప్రాథమిక నిర్థారణ అయింది. మాన్యువల్‌ ఆపరేటెడ్‌ గేట్లు కాకుండా.. హైడ్రాలిక్‌ గేట్ల ఏర్పాటుపై అధ్యయం చేయాలని.. సచివాలయాలకు మంత్రులు, ఎమ్మెల్యేల పర్యటనలు ఉండాలని కేబినెట్‌ ఆదేశించింది. నెలలో 12 రోజులపాటు ఎమ్మెల్యేలు సచివాలయాల సందర్శన చేయాలని సూచించింది’’ అని తెలిపారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top