చట్టవిరుద్ధ కార్యాకలాపాలకు పాల్పడితే ఉపేక్షించం

AP Assembly Session YS Jagan Mohan Reddy Answer To Anagani Satyaprasad - Sakshi

సాక్షి, అమరావతి : శాసనసభ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు రెండో రోజు వాడివేడిగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వం ఆన్‌లైన్‌ జూదాన్ని నిషేధిస్తూ మంగళవారం అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టింది. అనంతరం బిల్లుపై జరిపిన చర్చలో భాగంగా టీడీపీ సభ్యుడు అనగాని సత్యప్రసాద్‌ నిజాంపట్నంలో యథేచ్ఛగా జూదాలు కొనసాగుతున్నాయని ఎటువంటి చర్యలు తీసుకోలేదంటూ ఆరోపించారు. ఈ సందర్భంగా  అనగాని సత్యప్రసాద్‌ ఆరోపణలపై ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పందించారు.

ఆయన మాట్లాడుతూ.. ఆన్‌లైన్‌ జూదానికి సంబంధించి ఎక్కడైనా, ఎవరైనా తప్పు చేస్తే వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకురండి.. తప్పకుండా కఠిన చర్యలు తీసుకుంటాం.కర్నూలు జిల్లాలో మంత్రి జయరామ్‌ దూరపు బంధువు ఒకరు గ్రామంలో ఆ కార్యక్రమం నిర్వహిస్తున్నారని తెలిసిన వెంటనే పోలీసులు దాడి చేశారు. ఆ నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు. మంత్రి బంధువు అని చెప్పి ఊరుకోకుండా కేసు పెట్టడం జరిగింది. ఆ మర్నాడు స్వయంగా మంత్రి జయరామ్‌ కూడా స్పందించారు. ఎవరు చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడినా ఉపేక్షించబోమని చెప్పారు. మా ప్రభుత్వం ఆ విధంగా పని చేస్తున్నందుకు గర్వపడుతున్నాను. తప్పు ఎవరు చేసినా తప్పే.. ఎక్కడైనా సరే ఇలాంటివి జరుగుతున్నాయని తెలిస్తే వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకురండి.

పోలీసులకు కూడా స్పష్టంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎక్కడా, ఎవరినీ వదిలిపెట్టడమనేది ఉండదు.. కచ్చితంగా చర్య తీసుకుంటాం.దీనిలో భాగంగానే ఆన్‌లైన్‌ జూదంకు కళ్లేం వేయాలనే అంశంతో నేడు జూదాన్ని నిషేధిస్తూ చట్టం తీసుకు రావడం జరిగింది.ఆన్‌లైన్‌ జూదానికి పిల్లలు అలవాటు కావొద్దనే వారి భవిష్యత్తు చెడిపోకూడదు అన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నాం.గత అయిదేళ్లలో ప్రభుత్వం దాన్ని నియంత్రించడానికి కనీసం చట్టం కూడా ఎందుకు తీసుకు రాలేదు? ఎందుకు చర్యలు తీసుకోలేకపోయారు? కనీసం ఆ ప్రయత్నం కూడా జరగలేదు. ఇవాళ ఒక మంచి కార్యక్రమం జరుగుతుంటే దాన్ని స్వాగతించాల్సింది పోయి.. రాజకీయంతో దాన్ని ట్విస్ట్‌ చేయాలన్న దిక్కుమాలిన ఆలోచన చేస్తున్న తీరు ఏ మాత్రం బాగా లేదని' సీఎం‌ స్పష్టం చేశారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top