breaking news
Satyaprasad Anagani
-
చట్టవిరుద్ధ కార్యాకలాపాలకు పాల్పడితే ఉపేక్షించం
సాక్షి, అమరావతి : శాసనసభ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు రెండో రోజు వాడివేడిగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వం ఆన్లైన్ జూదాన్ని నిషేధిస్తూ మంగళవారం అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టింది. అనంతరం బిల్లుపై జరిపిన చర్చలో భాగంగా టీడీపీ సభ్యుడు అనగాని సత్యప్రసాద్ నిజాంపట్నంలో యథేచ్ఛగా జూదాలు కొనసాగుతున్నాయని ఎటువంటి చర్యలు తీసుకోలేదంటూ ఆరోపించారు. ఈ సందర్భంగా అనగాని సత్యప్రసాద్ ఆరోపణలపై ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. ఆన్లైన్ జూదానికి సంబంధించి ఎక్కడైనా, ఎవరైనా తప్పు చేస్తే వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకురండి.. తప్పకుండా కఠిన చర్యలు తీసుకుంటాం.కర్నూలు జిల్లాలో మంత్రి జయరామ్ దూరపు బంధువు ఒకరు గ్రామంలో ఆ కార్యక్రమం నిర్వహిస్తున్నారని తెలిసిన వెంటనే పోలీసులు దాడి చేశారు. ఆ నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు. మంత్రి బంధువు అని చెప్పి ఊరుకోకుండా కేసు పెట్టడం జరిగింది. ఆ మర్నాడు స్వయంగా మంత్రి జయరామ్ కూడా స్పందించారు. ఎవరు చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడినా ఉపేక్షించబోమని చెప్పారు. మా ప్రభుత్వం ఆ విధంగా పని చేస్తున్నందుకు గర్వపడుతున్నాను. తప్పు ఎవరు చేసినా తప్పే.. ఎక్కడైనా సరే ఇలాంటివి జరుగుతున్నాయని తెలిస్తే వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకురండి. పోలీసులకు కూడా స్పష్టంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎక్కడా, ఎవరినీ వదిలిపెట్టడమనేది ఉండదు.. కచ్చితంగా చర్య తీసుకుంటాం.దీనిలో భాగంగానే ఆన్లైన్ జూదంకు కళ్లేం వేయాలనే అంశంతో నేడు జూదాన్ని నిషేధిస్తూ చట్టం తీసుకు రావడం జరిగింది.ఆన్లైన్ జూదానికి పిల్లలు అలవాటు కావొద్దనే వారి భవిష్యత్తు చెడిపోకూడదు అన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నాం.గత అయిదేళ్లలో ప్రభుత్వం దాన్ని నియంత్రించడానికి కనీసం చట్టం కూడా ఎందుకు తీసుకు రాలేదు? ఎందుకు చర్యలు తీసుకోలేకపోయారు? కనీసం ఆ ప్రయత్నం కూడా జరగలేదు. ఇవాళ ఒక మంచి కార్యక్రమం జరుగుతుంటే దాన్ని స్వాగతించాల్సింది పోయి.. రాజకీయంతో దాన్ని ట్విస్ట్ చేయాలన్న దిక్కుమాలిన ఆలోచన చేస్తున్న తీరు ఏ మాత్రం బాగా లేదని' సీఎం స్పష్టం చేశారు. -
రేపల్లెలో అవినీతి భూపాలుడు
సాక్షి, గుంటూరు : రేపల్లె తీరాన అవినీతి తిమింగలంలా మారారు ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్. అధికారాన్ని అడ్డుపెట్టుకుని మడ అడవులను అడ్డగోలుగా ఆక్రమించేశారు. అధికారులను బెదిరించి రికార్డులు తారుమారు చేసి వందల ఎకరాలను కైవసం చేసుకున్నారు. రేపల్లెలో భూపాలుడి అవతారమెత్తి కోట్ల రూపాయలు దండుకున్నారు. మరో వైపు మత్స్యకారుల నోటికాడ కూడు లాక్కుని కృష్ణానదిలో ఇసుకను తవ్వేశారు. ప్రజలకు అందాల్సిన ఇసుకను అడ్డదారుల్లో తరలించి అధిక మొత్తానికి అమ్మేసుకున్నారు. ఇలా వందల కోట్ల రూపాయలను పోగేసుకున్నారు.కిడ్నాపర్లు, హంతకులకు కొమ్ముకాస్తూ బాధితుల ఉసురుపోసుకుంటున్నారు. నీరు–చెట్టు పథకం పేరుతో చెరువులను చెరబట్టి మట్టిని మింగేశారు. ఇలా నియోజకవర్గ వ్యాప్తంగా సహజ వనరులను లూటీ చేశారు ఎమ్మెల్యే అనగాని. అధికారం దక్కగానే భూ కుంభకోణాలు.. పెనుమూడి రేవులో డ్రెడ్జర్లతో అక్రమంగా తవ్వుతున్న ఇసుక కనుచూపు మేరలో ఖాళీగా ఉన్న అటవీ భూములపై టీడీపీ నాయకుల కన్ను పడింది. 2014లో అధికారం చేపట్టిన ఐదు నెలల్లో అధికారులను బెదిరించి ఏకంగా 15.13 ఎకరాల అటవీ భూమికి పట్టాలు సృష్టించారు. దీంతోపాటు అదే ప్రాంతంలోని మరో పది ఎకరాల అటవీ భూమిని ఆక్రమించి చెరువులను తవ్వి ఆక్వా సాగుకు సిద్ధం చేశారు. నిజాంపట్నం మండల ఆముదాలపల్లి పంచాయతీ పరిధిలోని చింతరేవులోని అటవీ భూమి 583 సర్వే నంబరులోని 15.13 ఎకరాలను ఎమ్మెల్యే బినామీలు ఆరుగురి పేరున 10–11–2014 తేదీన అప్పటి తహసీల్దారు రవికుమార్ పట్టాలు ఇచ్చారు. ఇసుక అమ్మకాల్లో రూ. 250 కోట్లు... అధికార పార్టీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ అధికారం చేపట్టినప్పటి నుంచి ఇసుక, మట్టిని దోపిడీ చేసి కోట్ల రూపాయలు గడించాడు. పెనుమూడి రేవులో మ్యాన్యువల్‌గా ఇసుకను తరలించుకునే విధంగా కలెక్టర్ మత్స్యకారులకు కల్పించిన అవకాశాలను.. వారికి దక్కకుండా అడ్డుకుని అక్రమ దందాకు తెరతీశారు. చెరుకుపల్లి, నగరం, నిజాంపట్నం, రేపల్లె, రేపల్లె రూరల్ మండలాల్లో నిబంధనలకు విరుద్ధంగా భారీ డ్రెజ్జర్లను వినియోగించిన ఇసుకను తరలించి సుమారు రూ.250 కోట్లు దండుకున్నారు. తమ పొట్టగొడుతున్నారని అనేక సందర్భాళ్లో మత్స్యకారులు ఎమ్మెల్యేపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతోపాటు రేపల్లె, భట్టిప్రోలు మెయిన్ డ్రెయిన్ల ఆధునికీకరణలో భాగంగా తవ్విన ఇసుకను సైతం అమ్ముకుని రూ. కోటి రూపాయలు కొట్టేశారు. విద్యార్థుల భవితవ్యంతో ఆటలు పాలిటెక్నిక్ కళాశాల సాంకేతిక విద్యా శాఖ మంత్రిగా మోపిదేవి వెంకటరమణారావు ఉన్న హయాంలో తీర ప్రాంత విద్యార్థుల భవితవ్యం కోసం పట్టణంలో 2010లో పాలిటెక్నిక్ కళాశాల నెలకొల్పేందుకు కృషి చేశారు. నూతన భవనాల నిర్మాణానికి కావలసిన రూ.4.61 కోట్లు కేటాయించారు. ఈ బాధ్యతను పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్‌కు అప్పగించారు. అనంతరం ఎన్నికలు రావటంతో పాలకులు మారారు. పాలిటెక్నిక్ కళాశాల భవన నిర్మాణ పనులు ప్రారంభానికే నోచుకోలేదు. ఏ ఏటికాయేడు జాప్యం జరుగుతుండటంతో విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఆందోళనలు నిర్వహించారు. దీంతో కాస్తంత కదిలిన పాలకపక్ష ప్రజాప్రతినిధులు, అధికారులు 2016 జనవరిలో పనులు ప్రారంభించి 2016–17 విద్యా సంవత్సరంలో నూతన భవనాలు అందుబాటులోకి తీసుకొస్తామని హామీ ఇచ్చారు. హామీ ఇచ్చి రెండేళ్లు దాటుతున్నా భవ నిర్మాణ పనులకు కనీసం శంకుస్థాపన కూడా చేయలేదు. బినామీలకు బ్యాంకు రుణాలు.. ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ తన బినామీల పేరుతో రుణాలు పొంది బ్యాంకులను సైతం మోసగించారు. దీనిపై సమగ్ర విచారణకు శ్రీకారం చుట్టిన అధికారులపై ఒత్తిళ్లు తీసుకొచ్చారు. అంతే ఆ విచారణ మధ్యలోనే నిలిచిపోయింది. అక్రమంగా మత్స్యకార రుణాలు... ఆక్రమించుకున్న ప్రభుత్వ భూములను చూపుతూ మత్స్యశాఖ ఆధ్వర్యంలో సబ్సిడీ రుణాలు పొందారు. ఇలా సుమారు రూ. 6 కోట్లు తమ ఖాతాల్లో ఎమ్మెల్యే, ఆయన బినామీలు జమ చేసుకున్నారు. దీనిపై విచారణ నిర్వహించిన అధికారులను అధికారంతో కట్టడి చేశారు. ఎస్టీ అధికారి బలి... ప్రభుత్వ భూమిని టీడీపీ నాయకుల సొంత భూమిగా 1బీ అడంగల్‌లో నమోదవడంపై అప్పటి తహసీల్దార్ మోహనకృష్ణపై అధికారులు చర్యలు తీసుకున్నారు. రిటైర్డ్ అనంతరం తహశీల్దార్‌కు రావల్సిన బెనిఫిట్స్‌ను ఇప్పటికీ ఇవ్వలేదు. గతంలో పని చేసిన కంప్యూటర్ ఆపరేటర్ ద్వారా బెంగళూరు కేంద్రంగా ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ 1బీ అడంగల్‌లో తన బినామీల పేర్లు నమోదు చేయించి అప్పటి తహసీల్దార్‌పై నేరాన్ని మోపారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రిటైర్డ్ తరువాత బెనిఫిట్స్ రాకపోవటంతో ఎస్టీ అధికారిని బలి చేశారని ఆయా వర్గాలు మండిపడుతున్నాయి. వసూల్ రాజా ప్రభుత్వంలో ప్రతి పోస్టుకూ భారీ స్థాయిలో సొమ్ము దండుకున్నారు అనగాని. అంగన్వాడీ కార్యకర్త పోస్టుకు రూ. 4–రూ.7 లక్షలు, విద్యుత్ సబ్‌స్టేషన్‌లో కాంట్రాక్ట్ ఉద్యోగానికి రూ.7–రూ.10 లక్షలు, ఆయా పోస్టుకు రూ.50 వేల నుంచి రూ.రూ.2 లక్షలు, న్యూట్రీషన్ పోస్టులకు రూ.1–రూ.1.50 లక్షల వరకూ స్వయంగా ఎమ్మెల్యే సోదరుడు అనగాని శివప్రసాద్ వసూళ్లు చేసినట్లు బహిరంగానే చెబుతున్నారు. తమ వద్ద సొమ్ము తీసుకుని పోస్టు ఇవ్వలేదంటూ ఇటీవల జన్మభూమి కార్యక్రమాల్లో పాల్గొన్న అనగాని సత్యప్రసాద్‌ను చెరుకుపల్లి మండలం కుంచాలవారిపాలెంలో బాధితులు నిలదీశారు. నిజాంపట్నం మండలం తోటపాలెంలో అంగన్వాడీ పోస్టులకు ఎమ్మెల్యే సోదరుడు స్వయంగా వేలం నిర్వహించి అత్యధికంగా రూ.10 లక్షలు వసూలు చేశాడు. దీనిపై టీడీపీ నాయకుల్లోనూ తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది. జూదాలకు నిలయంగా.. రేపల్లె నియోజకవర్గాన్ని జూదాలకు నిలయంగా మార్చిన ఘనత అనగాని సత్యప్రసాద్‌కు దక్కుతుంది. సంక్రాంతి పండుగ వచ్చిందంటే కుటుంబాలతో ఆనందంగా గడిపే సంస్కృతి నుంచి జూదాలకు పరుగుతీసే విధంగా మార్చారు. ఇలా ఎన్నో కుటుంబాల ఉసురుపోకున్నారని మహిళలు తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నారు. దీంతోపాటు నియోజకవర్గంలో పేకాట, బెట్టింగ్‌లను ప్రోత్సహిస్తూ ఆయన సోదరుడు నెలవారీ మామూళ్ల వసూలు చేస్తున్నారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ కనుసన్నల్లో ఏటా సంక్రాంతి పండుగను పురస్కరించుకుని సంప్రదాయ ముసుగులో కోడి పందేలు, పేకాటలను భారీగా నిర్వహిస్తున్నారు. చెరుకుపల్లి మండలంలోని తూర్పుపాలెంలో 2018లో ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ఆధ్వర్యంలో కోడి పందేల బరిని ఏర్పాటు చేశారు. మూడురోజుల పాటు జాదాల నిర్వహణకు సుమారు రూ. 50 కోట్ల వరకు దండుకున్నారు. -
‘అనగాని' ఇదేందయ్యా !
ఓ వైపు ప్రకృతి..మరో వైపు టీడీపీ పాలకులు రైతులను కష్టాల పాలుజేస్తున్నారు. ఈ ఏడాది ఖరీఫ్ ఆరంభంలో వర్షాలు లేక ఆలస్యంగా సాగు చేపట్టిన రైతు అడుగడుగునా ఇబ్బంది పడుతూనే ఉన్నాడు. తీరా పంట పక్వానికి చేరుతున్న దశలో యూరియా లభ్యంకాక ఆందోళనకు గురవుతున్నాడు. ఇలాంటి సమయంలో అండగా ఉండాల్సిన సహకార పరపతి సంఘాలు సైతం ప్రజాప్రతినిధుల పంచన చేరి రైతులను వంచన చేస్తున్నాయి. రైతులకు అందించాల్సిన యూరియా బస్తాలను దాచేస్తున్నాయి. ఎరువు కోసం వెళ్లిన రైతులకు ఒట్టి చేతులు చూపుతున్నాయి. ఓ చోటైతే ఏకంగా.. ఎమ్మెల్యేగారి కోసమే లోడు తెచ్చాం... మీరిక వెళ్లండంటూ యూరి యా కోసం క్యూలో నిలుచున్న రైతులను సొసైటీ అధ్యక్షుడు కసురుకున్న సంఘటన బుధవారం ఇసుకపల్లిలో చోటు చేసుకుంది. రైతులను కాదని యూరియా బస్తాలను ఏం చేసుకుంటారో రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ సమాధానం చెప్పాలి..! - రేపల్లె రేపల్లె: టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం రేపల్లె. ఇసుకపల్లి వ్యవసాయ ప్రాథమిక సహకార సంఘం కూడా పట్టణ పరిధిలోనే ఉంటుంది. బుధవారం ఉదయం యూరియా వచ్చిందన్న కబురు అందడంతో రైతులంతా సొసైటీ వద్దకు చేరుకున్నారు. అయితే సొసైటీ అధ్యక్షుడు దాసరి నాగరాజు మాటలు రైతులను బాధించాయి.‘ఎమ్మెల్యేగారికి ఒక లోడు, రైతులకు ఒక లోడు అందిస్తున్నాం. ప్రస్తుతం ఒక్క బస్తా కూడా యూరియా లేదు. మీరు గొడవ చేస్తే యూరియా తెప్పించను’ ఇలా రైతులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేకి యూరియా కేటాయించటం ఏంటి, ఇంతకు ముందు ఇలా జరగలేదుగదా, ఎరువుల విషయంలో రాజకీయాలేంటి, ఉన్న లోడు(400 బస్తాలు) అందించాలని రైతులు ఎంత కోరినా సొసైటీ అధ్యక్షుడు అంగీకరించకపోగా ‘యూరియా తెప్పించను’ అంటూ మరింత ఆగ్రహం వ్యక్తం చేశారు. సుమారు రెండు గంటలపాటు వేచి ఉన్నా ఫలితం లేకపోవటంతో ‘అనగాని ఇదేందయ్యా’ అనుకుంటూ రైతులు వెనుతిరిగారు. అనంతరం గుట్టుచప్పుడు కాకుండా యూరియాను ట్రాక్టర్లపై తరలించారు. డిమాండ్‌తో అధిక ధరలకు... యూరియాకు డిమాండ్ ఏర్పడటంతో బ్లాక్ మార్కెట్లో విక్రయాలు జోరందుకున్నాయి. సొసైటీల నుంచి వచ్చిన యూరియానే బ్లాక్ మార్కెట్లో అధిక ధరలకు విక్రయిస్తున్నారనే ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. పంట పక్వానికి చేరుతూ చివరి దశలో ఉన్న తరుణంలో యూరియా అందించకపోతే దిగుబడి తగ్గే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్న రైతులు బ్లాక్ మార్కెట్‌ను ఆశ్రయిస్తున్నారు. సొసైటీలలో రూ. 290కు లభించే యూరియా బస్తా బ్లాక్ మార్కెట్లో రూ. 330 నుంచి రూ. 360 వరకు చెపుతున్నారు. రైతుల కోసం సొసైటీలు తీసుకువస్తున్న యూరియాను ఎమ్మెల్యే పేరు చెప్పి బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్నారని తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి యూరియాను రైతులకు సక్రమంగా అందించే విధంగా చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు. యూరియూ పంపిణీలోనూ రాజకీయూలా..? ఎన్నడూ లేనివిధంగా యూరియా అందించడంలో రాజకీయాలు చేస్తూ రైతులను ఇబ్బందుల పాలు చేయడం సరైన విధానం కాదు. ఎమ్మెల్యేకి లోడు కేటాయిస్తున్నామని చెబుతూ యూరియాను తరలించడం ఏమిటి? రైతులకు యూరియా అందించడంలో ఇప్పటికైనా రాజకీయాలు మానుకుని సక్రమంగా పంపిణీ చేయాలి. - జి.శ్రీనివాస్, సొసైటీ డెరైక్టర్ 400 బస్తాలున్నా.. లేదంటారేం..? నాలుగు రోజులుగా యూరియా కోసం రావడం...ఒట్టి చేతులతో తిరిగి వెళ్లడం... పంట చివరి దశలో యూరియా అందించకపోతే దిగుబడి తగ్గింది. సొసైటీలో 400 బస్తాలు ఉన్నా ఒక్క రైతుకు కూడా అందించకుండా యూరియాను ఎక్కడికి తరలిస్తున్నారు. ఇప్పటికైనా యూరియా సక్రమంగా అందించాలి. - శ్రీను, రైతు, ఇసుకపల్లి