జనసేనలో ‘మట్టి’ కుస్తీ | Another group attack on former MP Kurumalla Rambabu | Sakshi
Sakshi News home page

జనసేనలో ‘మట్టి’ కుస్తీ

Jun 9 2025 2:18 AM | Updated on Jun 9 2025 2:18 AM

Another group attack on former MP Kurumalla Rambabu

మాజీ ఎంపీపీ కురుమళ్ళ రాంబాబుపై మరో వర్గం దాడి 

పిఠాపురం: వరుస వివాదాలతో కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని జనసేన నాయకులు పరువు తీసుకుంటున్నారు. శనివారం ఇసుక వివాదం సద్దుమణగక ముందే ఆదివారం చెరువు మట్టి కోసం జనసేనలోని రెండు వర్గాలు ఘర్షణకు దిగాయి. ఈ ఘర్షణలో తమపై దాడి చేశారని విరవ గ్రామానికి చెందిన మాజీ ఎంపీపీ కురుమళ్ళ రాంబాబు పిఠాపురం రూరల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాలివీ.. రైతుల అవసరాల పేరుతో ఎఫ్‌కే పాలెం – విరవాడ గ్రామాల మధ్య పాపిడిదొడ్డి చెరువులో మట్టి తవ్వకాలకు అధికారుల నుంచి జనసేన నాయకులు అనుమతులు పొందారు. 

చెరువులోని మట్టిని మండలంలోని పలు ఇటుక బట్టీలకు విక్రయిస్తున్నారు. మట్టి తరలింపులో కొన్ని బట్టీలకే ప్రాధాన్యం ఇస్తున్నారని, మిగిలిన వారికి ఇవ్వడం లేదని జనసేన నేత కురుమళ్ళ రాంబాబు ఆరోపించారు. చెరువులో మట్టి తవ్వకాలను పరిశీలించేందుకు ఆదివారం వెళ్లిన ఆయన మట్టి తరలింపు చేపడుతున్న వారిని ప్రశ్నించారు. 

ఈ నేపథ్యంలో మట్టి తవ్వకందారులు రాంబాబుతోపాటు సకుమళ్ళ నాగేశ్వరరావు, కురుమళ్ళ మణికంఠ స్వామి, ఆకుల ఆదినారాయణలపై దాడికి పాల్పడ్డారు. రాంబాబు చొక్కా చించివేశారు. కొందరికి గాయాలయ్యాయి. దీంతో కురుమళ్ళ రాంబాబు తదితరులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమపై దాడికి పాల్పడిన వారిపై కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. వారిని వైద్య పరీక్షల నిమిత్తం పోలీసులు ప్రభుత్వాస్పత్రికి పంపించారు. పేట్రేగిపోతున్న మట్టి మాఫియాపై అధికారులు, పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement