ముగిసిన టీచర్ల బదిలీ | Andhra Pradesh Teachers Transfer completed | Sakshi
Sakshi News home page

ముగిసిన టీచర్ల బదిలీ

Jun 17 2025 5:42 AM | Updated on Jun 17 2025 5:42 AM

Andhra Pradesh Teachers Transfer completed

67,732 మందికి స్థాన చలనం 

4,477 మందికి పదోన్నతులు

అభ్యంతరాలపై జిల్లా, జోనల్‌ స్థాయిలో కమిటీల ఏర్పాటు

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఉపాధ్యాయుల బదిలీలు పూర్తయినట్టు పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. ప్రభుత్వ, జిల్లా పరిషత్, మున్సిపల్‌ కార్పొరేషన్, మున్సిపల్‌ పాఠశాలల్లో పనిచేస్తున్న హెచ్‌ఎంలు, స్కూల్‌ అసిస్టెంట్లు, భాషా పండితులు, వ్యాయామ ఉపాధ్యాయులు, ఎస్జీటీలకు స్థాన చలనం కల్పించినట్టు తెలిపింది. ఉపాధ్యాయుల బదిలీలకు ఈ ఏడాది కొత్త చట్టాన్ని తీసుకొచ్చి దాని ప్రకారం ప్రక్రియను చేపట్టారు. గతనెల 21న చేపట్టిన బదిలీల ప్రక్రియ ఈ నెల 11వ తేదీ నాటికి ముగుస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

అయితే, ఎస్జీటీలకు మాన్యువల్‌గా కౌన్సెలింగ్‌ నిర్వహించాలని ఈ నెల 8న ప్రక్రియను బహిష్కరించడంతో గందరగోళ పరిస్థితులు తలెత్తాయి. విద్యాశాఖ మంత్రి లోకేశ్‌ సైతం మాన్యువల్‌ కౌన్సెలింగ్‌ సాధ్యం కాదని ప్రకటించారు. దీంతో విద్యా శాఖ డైరెక్టరేట్‌ ముట్టడికి ఉపాధ్యాయ సంఘాలు పిలుపునిచ్చాయి. తీవ్ర ఒత్తిడి నేపథ్యంలో గంటల వ్యవధిలోనే మంత్రి తన ప్రకటనను మార్చుకున్నారు. ఎమ్మెల్సీల విజ్ఞప్తి మేరకు మాన్యువల్‌ కౌన్సెలింగ్‌కు అవకాశం కల్పించారు. దాంతో ఈనెల 11న ముగియాల్సిన బదిలీల ప్రక్రియ సోమవారం కొనసాగింది. 

4.477 మందికి పదోన్నతి
ప్రస్తుత బదిలీల్లో 67,732 మందికి స్థాన చలనం కల్పించినట్టు విద్యాశాఖ డైరెక్టర్‌ విజయ రామరాజు తెలిపారు. వీరిలో 4,477 మంది టీచర్లకు పదోన్నతులు కల్పించినట్టు వివరించారు. గ్రేడ్‌–2 హెచ్‌ఎంలు 1,494 మంది, ఎంపీఎస్‌ హెచ్‌ఎంలు 5,717 మంది, స్కూల్‌ అసిస్టెంట్లు 27,804, ఎస్జీటీలు 31,174 మంది, భాషా పండితులు 1,199, వ్యాయామ ఉపాధ్యాయులు 344 మంది ఉన్నారు. గ్రేడ్‌–2 హెచ్‌ఎంలు 1,375 మంది, ఎంపీఎస్‌ హెచ్‌ఎంలు 1,592, స్కూల్‌ అసిస్టెంట్లు 1,510 మందికి పదోన్నతి లభించినట్టు డైరెక్టర్‌ తెలిపారు. బదిలీలు, పదోన్నతులపై అభ్యంతరాలు ఉంటే.. జిల్లా లేదా జోనల్‌ స్థాయిలో ఏర్పాటు చేసిన సమస్యల పరిష్కార కమిటీని సంప్రదించాలని ఉపాధ్యాయులకు సూచించారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement