కాపు యువకుడిది లాకప్‌ డెత్తేనా! | Andhra pradesh High Court Orders in Sai Krishna Case | Sakshi
Sakshi News home page

కాపు యువకుడిది లాకప్‌ డెత్తేనా!

Jun 16 2026 5:07 AM | Updated on Jun 16 2026 5:07 AM

Andhra pradesh High Court Orders in Sai Krishna Case

అతడి ఆచూకీపై సందేహాలు 

బతికే ఉన్నాడా.. లేక లాకప్‌లో బలయ్యాడా అని అనుమానాలు 

సూత్రధారులు టీడీపీ నేతలు.. పాత్రధారులు పోలీసులు 

చంద్రబాబు రెడ్‌బుక్‌ రాజ్యాంగంలో పోలీసుల మరో అరాచకపర్వం 

సాయికృష్ణను తన ముందు ప్రవేశ పెట్టాల్సిందేనని హైకోర్టు ఆదేశాలు 

దీంతో ఈ వ్యవహారాన్ని పక్కదోవ పట్టించేందుకు ప్రభుత్వం కుతంత్రం 

కృష్ణలంక సీఐ నాగరాజును వీఆర్‌కు పంపినట్లు వార్తలు 

రాష్ట్రంలో శాంతిభద్రతలపై నీలినీడలు

సాక్షి టాస్క్ ఫోర్స్‌: చంద్రబాబు, చినబాబు రెడ్‌బుక్‌ అరాచక పాలనలో మరో సమాధానం లేని ప్రశ్న.. కాపు యువకుడు గాదె సాయికృష్ణ ఏమయ్యాడు?  సాయికృష్ణ మిస్సింగ్‌ వ్యవహారం రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ పనితీరుపై,  శాంతిభద్రతల పరిస్థితిపై తీవ్ర సందేహాలు లేవనెత్తుతోంది. సాయికృష్ణ బ్రతికే ఉన్నాడా? లాకప్‌లో చంపేశారా? అనేది మిలియన్‌ డాలర్ల ప్రశ్నగా మారింది. సాయికృష్ణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని, బలవంతంగా ఎత్తుచికె­ళ్లా­రని కుటుంబ సభ్యులు చెబుతుండగా, అతని ఆచూకీ గురించి పోలీసులు స్పష్టత ఇవ్వలేకపోవడం ప్రజాస్వామ్య వ్యవస్థకు ఆందోళన కలిగిస్తోంది.  ఒక తల్లి తన కుమారుడు బతికున్నాడో, లేదో తెలియక హైకోర్టును ఆశ్రయించాల్సి రావడం రాష్ట్ర పరిపాలనపై ప్ర­జల్లో అనుమానాలు పెంచుతోంది. ప్రజల ప్రాణాలు, స్వేచ్ఛలను కాపాడాల్సిన వ్యవస్థే ఒక వ్యక్తి ఆచూకీపై స్పష్టత ఇవ్వలేకపోతే, సాధారణ పౌరుడు తన భద్రత గురించి ఎలా నమ్మకం కలిగి ఉంటాడు?   

సమాధానాలు లేని ప్రశ్నలు 
ఈ వ్యవహారంలో హైకోర్టు స్పందించి సాయికృష్ణ ఆచూ­కీ కనుగొని తన ముందు హాజరుపరచాలని ఆదేశించడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.  ఒకవేళ పోలీసులు చెప్పినట్లే సాయికృష్ణ వారి అదుపులో లేకపోతే, అతను చివరిసారిగా ఎక్కడ కనిపించాడు? అతని కదలికలపై స్పష్టమైన వివరాలు ఎందుకు లేవు? అనే ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత  ప్రభుత్వంపైనా అలాగే పోలీసు శాఖపైనా ఉంది. సాయికృష్ణను ఈ నెల 29వ తేదీలోపు తన ముందు ప్రవేశపెట్టి తీరాల్సిందేనంటూ హైకోర్టు ధర్మాసనం ఇచ్చిన ఆదేశాలతో ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని మసిబూసి మారేడుకాయ చేసే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. దీనిలో భాగంగానే కృష్ణలంక సీఐ నాగరాజును హడావిడిగా వీఆర్‌కు పంపినట్లు తెలుస్తోంది.  

స్వతంత్ర విచారణకు ఆదేశించాలి 
చంద్రబాబు ప్రభుత్వంలో పోలీసు వ్యవస్థ రాజకీయ ఒత్తిళ్ల కింద పనిచేస్తోందన్నది ఇప్పటికే పలు సందర్భాల్లో స్పష్టమైంది. ఒక వ్యక్తిని అక్రమంగా నిర్బంధించారనే అనుమానం ఉన్నప్పుడు భారత రాజ్యాంగం అత్యవసర పరిష్కారంగా ‘హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌’ను తన ప్రజల ముందు ఉంచింది. అలాంటి పరిస్థితి ఏర్పడటమే ప్రజాస్వామ్య వ్యవస్థకు ఒక  హెచ్చరికగా చూడాలి. ఇలాంటి పిటిషన్లు ఇప్పుడు హైకోర్టులో పెరిగిపోతుండడం ఆందోళన కలిగించే విషయం. ఇక్కడ సమస్య ఒక్క సాయికృష్ణ గురించే కాదు. రాష్ట్రంలో చట్టబద్ధ పాలన ఎలా అమలవుతోంది? పోలీసుల చర్యలపై పర్యవేక్షణ ఎంత సమర్థంగా ఉంది? పౌర హక్కులకు ఎంత విలువ ఇస్తున్నారు? అనే తీవ్ర ప్రశ్నలు ముందుకు వస్తున్నాయి.

ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ సాయికృష్ణ మిస్సింగ్‌ వ్యవహారంపై స్వతంత్ర విచారణకు ఆదేశించి, వాస్తవాలను  ప్రజల ముందు ఉంచాలి. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. పోలీసు శాఖ చట్టానికి మాత్రమే విధేయంగా ఉండాలి. కానీ ఒక వ్యక్తి ఆచూకీపై హైకోర్టు పదేపదే జోక్యం చేసుకోవాల్సి రావడం పరిపాలనా వైఫల్యంగా కనిపిస్తోంది. సాయికృష్ణ ఎక్కడ ఉన్నాడు? అతని పరిస్థితి ఏమిటి? అనే ప్రశ్నలకు త్వరితగతిన, విశ్వసనీయ సమాధానం రాకపోతే, ఈ ఘటన చంద్రబాబు ప్రభుత్వ పాలనపై మరింత తీవ్రమైన అనుమానాలను రేకెత్తిస్తుంది.   

సీఐ బెదిరించారంటున్న తల్లి 
‘నీ కొడుకును చంపేస్తా.. చచ్చిపోయాడనుకో.. వా­డిపై ఆశలు వదులుకో... వాడు ఇకపై నీవద్దకు రా­డు’ అంటూ కృష్ణలంక సీఐ నాగరాజు బెదిరించా­డని  సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి ఆరోపిస్తున్నారు. గత మే నెల 9, 10 తేదీలలో మార్కాపురం నుండి తన కుమారుడు గాదె సాయికృష్ణను కృష్ణలంక పో­లీసులు ఎవరికి చెప్పకుండా స్టేషన్‌కు తీసుకువచ్చారని, అప్పటి నుంచి అతని ఆచూకీ తెలియలేదని తల్లి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘బ్రతికి ఉంటే కోర్టుముందు హాజరుపరచండి.. లేదంటే మృతదేహాన్ని అప్పగించండి’ అంటూ కన్నీటి పర్యంతమవుతుండడం రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలనూ తీ­వ్ర ఆవేదనకు గురిచేస్తోంది.

ఈ విషయమై ఆమె బె­జవాడ బార్‌ అసోసియేషన్‌ మానవహక్కుల కమిటీ చైర్మన్‌ను సంప్రదించి, తనకు న్యాయం చేయాలని అర్థించారు. ‘మే నెలలో కృష్ణలంక పోలీసులు నా ఇంటివద్దకు వచ్చారు. సీఐ పోలీసుస్టేషన్‌కు రమ్మంటున్నారంటూ స్టేషన్‌కు తీసుకెళ్లారు. అక్కడ నా  సెల్‌ఫోన్‌ను లాక్కొని, కొద్దిరోజులు వారి వద్దే ఉంచుకొన్నారు. ఫోన్‌ను తిరిగి ఇవ్వమని ఎన్నిసార్లు అడిగినా, రోజుల తరబడి తిప్పించుకొన్నారే తప్ప తిరిగి ఇవ్వలేదు’అంటూ ఆమె చెబుతున్న మాటలు రాష్ట్రంలో చంద్రబాబు పాలనలో పోలీసుల అరాచకాన్ని  కళ్లకు కడుతోంది. తన కొడుకును చంపేసి ఉంటారని ఆమె హైకోర్టు ధర్మాసనం సాక్షిగా ఆందోళన వ్యక్తం చేయడం చర్చనీయాంశంగా మారింది. ‘నా కొడుకును చంపేశారేమోనని చివరికి ప్రభు­త్వ ఆసుపత్రిలోని మార్చురీకి కూడా వెళ్లి చూశా’ అన్న ఆమె ఆవేదన అందరినీ కంటతడి పెట్టిస్తోంది. 

సాయికృష్ణను మా ముందు హాజరుపరిచి తీరాల్సిందే
కృష్ణలంక పోలీసులకు 29 వరకు గడువు పొడిగించిన హైకోర్టు

విజయవాడకు చెందిన గాదె సాయికృష్ణను తమ ముందు హాజరుపరచి తీరాల్సిందేనని కృష్ణలంక పోలీసులకు హైకోర్టు తేల్చి చెప్పింది. ఇందుకు 29వ తేదీ వరకూ గడువు పొడిగించిన హైకోర్టు.. కేసు తదుపరి విచారణనూ అదే రోజుకు వాయిదా వేసింది. ఆలోపు సాయికృష్ణ ఆచూకీ లభించినా కూడా.. వెంటనే తమ ముందు హాజరు పరచాలని హైకోర్టు స్పష్టం చేసింది. కాగా, పోలీసులు చంపేసి ఉంటారన్న అనుమానాలను సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి వ్యక్తం చేశారు.

సాక్షి, అమరావతి: విజయవాడకు చెందిన గాదె సాయికృష్ణను తమ ముందు హాజరుపరచి తీరాల్సిందేనని కృష్ణలంక పోలీసులకు హైకోర్టు తేల్చి చెప్పింది. ఇందుకు 29 వతేదీ వరకూ గడువు పొడిగించిన హైకోర్టు, కేసు తదుపరి విచారణనూ అదే రోజుకు వాయిదా వేసింది.  ఆలోపు సాయికృష్ణ ఆచూకీ లభించినా కూడా.. వెంటనే తమ ముందు హాజరు పరచాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్‌ రావు రఘునందన్‌రావు, జస్టిస్‌ తూటా చంద్ర ధనశేఖర్‌ ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.  విజయవాడ కృష్ణలంకకు చెందిన సాయికృష్ణ కొంత కాలంగా మార్కాపురంలో ఉంటున్నాడు.

అయితే పలు కేసులు ఉన్నాయన్న కారణంతో సాయికృష్ణను కృష్ణలంక పోలీసులు ఇటీవల మార్కాపురం నుంచి విజయవాడకు తీసుకొచ్చారని, ఆ తరువాత నుంచి ఆచూకీ తెలియడంలేదని, తన కుమారుడు అసలు బతికున్నాడో లేదో కూడా తెలియడం లేదని, అతడిని కోర్టు ముందు హాజరుపరిచేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ తల్లి విజయలక్ష్మి హైకోర్టులో హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై ఇటీవల విచారణ జరిపిన ధర్మాసనం, ఈ నెల 15న సాయికృష్ణను తమ ముందు హాజరుపరచాలని పోలీసులను ఆదేశించింది.

సోమవారం విచారణ సందర్భంగా పోలీసుల తరఫున ఏజీపీ కృష్ణ ప్రణీత్‌ వాదనలు వినిపిస్తూ, సాయికృష్ణ ఆచూకీ తెలియలేదని, అందుకే అతడిని కోర్టు ముందు హాజరుపరచలేదని తెలిపారు. అతడిని వెతికేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామన్నారు. కోర్టు ముందు హాజరుపరిచేందుకు మరింత సమయం కావాలని కోరారు. విజయలక్ష్మి తరఫు న్యాయవాది ఆదిత్య చౌదరి వాదనలు వినిపిస్తూ పోలీసుల చేతిలో చిత్రహింసలకు గురై సాయికృష్ణ మరణించి ఉంటాడని తల్లి ఆందోళన చెందుతోందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement