ప్రభుత్వ స్కూళ్ల డిజిటల్‌ బాట.. తొలి విడతలో 6,511 స్కూళ్లు డిజిటల్‌ విధానంలోకి.. 

Andhra Pradesh government schools Into Digital - Sakshi

అత్యున్నత స్థాయి బోధనకు వీలుగా వీటిలో అన్ని ఏర్పాట్లు 

30,213 ఇంటరాక్టివ్‌ ఫ్లాట్‌ ప్యానళ్లతో పాఠాలు 

రూ.302 కోట్లు ఖర్చు చేయనున్న ప్రభుత్వం 

13,301 నాడు–నేడు స్కూళ్లలో రూ.60 కోట్లతో స్మార్ట్‌ టీవీలు 

6–10 తరగతులకు డిజిటల్‌ కంటెంట్‌ ఇప్పటికే సిద్ధం 

సీబీఎస్‌ఈ బోధనకు వీలుగా ఈ–కంటెంట్‌ 

సాక్షి, అమరావతి: విద్యా రంగంలో ఇప్పటికే అనేక విప్లవాత్మక సంస్కరణలకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసించే పేద విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలతో అత్యుత్తమ విద్యను అందిస్తోంది. ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులు సైతం భవిష్యత్తులో అంతర్జాతీయ స్థాయిలో మంచి అవకాశాలు అందుకునేలా డిజిటల్‌ విద్యను వారికి చేరువ చే­స్తోంది. ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుని వి­ద్యార్థులను అన్ని విషయాల్లో మేటిగా తీర్చిదిద్దుతోం­ది.

ఈ క్రమంలో దశల వారీగా ఫౌండేషనల్‌ స్థాయి నుంచి ఇంటర్‌ స్థాయి అయిన హైస్కూల్‌ ప్లస్‌ స్కూళ్ల వరకు డిజిటల్‌ తరగతులను ఏర్పాటు చేయనుంది. ఇప్పటికే అత్యున్నత ప్రమాణాలు ఉ­న్న సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సీబీఎస్‌ఈ) విధానాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. సీబీఎస్‌ఈ బోధనకు అనుగుణంగా నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషనల్‌ రీసెర్చ్‌ అండ్‌ ట్రైనింగ్‌ (ఎన్‌సీఈఆర్‌టీ) డిజిటల్‌ కంటెంట్‌ను ఇప్పటికే సిద్ధం చేసింది.  

ముందుగా మనబడి నాడు–నేడు మొదటి దశ స్కూళ్లలో.. 
డిజిటల్‌ తరగతులను ముందుగా మనబడి: నాడు–­నేడు కింద తొలిదశ పనులు పూర్తయిన స్కూళ్లలో ఏర్పాటు చేయనున్నారు. ఇందులో భాగంగా తరగతి గదుల్లో ఇంటరాక్టివ్‌ ఫ్లాట్‌ ప్యానళ్లు (ఐఎఫ్‌పీ) ఏర్పాటు చేసి డిజిటల్‌ విద్యాబోధన చేస్తారు. విద్యాశాఖ అంచనాల ప్రకారం.. దశలవారీగా 45,328 స్కూళ్లలో వీటిని అందుబాటులోకి తెచ్చేందుకు అంచనాలు రూపొందించారు.

ఇందులో భాగంగా వచ్చే జూన్‌ నాటికి 6,511 స్కూళ్లలో ఆయా ఆధునిక సాంకేతిక పరికరాలను ఏర్పాటు చేయనున్నారు. ఈ స్కూళ్లలోని డిజిటల్‌ తరగతి గదులలో 30,213 ఇంటరాక్టివ్‌ ఫ్లాట్‌ ప్యానళ్లు అమరుస్తారు. ఇందుకోసం రూ.302.13 కోట్ల మేర ప్రభుత్వం వెచ్చించనుంది. కాగా, 13,301 నాడు–నేడు తొలివిడత స్కూళ్లలో స్మార్ట్‌ టీవీలను ఏర్పాటు చేయనున్నారు. ఇందులో భాగంగా 65 ఇంచులతో ఉండే 10,038 స్మార్ట్‌ టీవీలను అందుబాటులోకి తెస్తారు.  

ప్రభుత్వ టీచర్లకు శిక్షణ 
డిజిటల్‌ పరికరాల ద్వారా విద్యా బోధన, ఉపకరణాల వినియోగంపై పలువురు ప్రభుత్వ టీచర్లకు ఇప్పటికే అధికారులు శిక్షణ ఇచ్చారు. ఈ క్రమంలో డిజిటల్‌ పరికరాలను సక్రమంగా వినియోగించడంలో 30 శాతం మంది పూర్తిస్థాయిలో విజయవంతమయ్యారు. 20 శాతం మందికి మరికొంత శిక్షణ అవసరమని గుర్తించారు. మిగతా వారందరికీ కూడా శిక్షణ అందించనున్నారు.  

మూడు దశల్లో అన్ని స్కూళ్లూ..
మొత్తం మూడు దశల్లో అన్ని ప్రభుత్వ స్కూళ్లలో డిజిటల్‌ తరగతి గదులను ఏర్పాటు చేయనున్నారు. తొలి దశ స్కూళ్లలో డిజిటల్‌ తరగతి గదుల ఏర్పాటును మార్చి, ఏప్రిల్‌ నాటికి పూర్తి చేసి వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి అందుబాటులోకి తేనున్నారు. డిజిటల్‌ తరగతులకు అనుగుణంగా ఆయా స్కూళ్లకు ఇంటర్నెట్‌ సదుపాయాన్ని కూడా కల్పిస్తారు. బ్రాడ్‌ బ్యాండ్‌ /లీజ్డ్‌ లైన్, టెలిఫోన్‌ లైన్‌ విత్‌ మోడెమ్, యూఎస్‌బీ మోడెమ్‌/డాంగిల్‌/పోర్టబుల్‌ హాట్‌స్పాట్, వీఎస్‌ఏటీ తదితరాల ద్వారా ఇంటర్నెట్‌ సదుపాయాన్ని సమకూర్చనున్నారు. 

డిజిటల్‌ కంటెంట్‌ సిద్ధం 
డిజిటల్‌ విద్యా బోధనకు వీలుగా విద్యాశాఖ 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు డిజిటల్‌ కంటెంట్‌ను సిద్ధం చేయిస్తోంది. ఇప్పటికే 6, 7 తరగతులకు సంబంధించి ఈ–కంటెంట్‌ను రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎస్‌సీఈఆర్‌టీ) ద్వారా రూపొందింపజేసింది. సీబీఎస్‌ఈ విధానాన్ని ప్రవేశపెడుతున్న నేపథ్యంలో విద్యాశాఖ ఆ సిలబస్‌కు అనుగుణంగా మ్యాథ్స్, సైన్స్, ఇంగ్లిష్‌ సబ్జెక్టుల్లో ఎన్‌సీఈఆర్‌టీ ఈ–కంటెంట్‌ను రూపొందిస్తోంది. ఇతర సబ్జెక్టులు ఎస్‌సీఈఆర్‌టీ పుస్తకాలకు అనుగుణంగా రూపొందనున్నాయి. ఇతర తరగతుల్లోనూ సీబీఎస్‌ఈ విధానం ప్రకారం ఈ–కంటెంట్‌ను రూపొందిస్తున్నారు. వీటిలో ఆడియో, వీడియోల తరహాలో కంటెంట్‌ ఉండనుంది.  
నాణ్యమైన పరికరాల ఏర్పాటు.. 
ఇంటరాక్టివ్‌ ఫ్లాట్‌ ప్యానళ్ల నాణ్యతలో ఏమాత్రం రాజీ లేకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.  
► తరగతి గదుల్లోని విద్యార్థులకు 170 డిగ్రీల యాంగిల్‌లో కూడా స్పష్టంగా కనిపించేలా 65 ఇంచుల స్క్రీన్‌తో ఈ ఇంటరాక్టివ్‌ ఫ్లాట్‌ ప్యానళ్లుంటాయి.  
► యాంటీ గ్లేర్‌ టెక్నాలజీ  
► కంపాటబుల్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ (ఆండ్రాయిడ్‌) 
► వైఫై, హెచ్‌డీఎంఐ, లాన్, యూఎస్‌బీ, వీజీఏ కనెక్టివిటీ 
► రికార్డెడ్‌ బోర్డు వర్క్‌ 
► డిజిటల్‌ బోర్డును బ్లాక్‌ లేదా గ్రీన్‌ బోర్డులుగా మార్చుకోవడానికి అవకాశం 
► ఆడియో, వీడియోల ప్రదర్శనకు వీలు 
► ప్యానల్‌లోనే స్పీకర్ల ఏర్పాటు 
► స్పెసిఫికేషన్లలో ఇంటెల్‌కోర్‌ ఐ–5, ఏఎండీ రీజెన్‌5 ప్రాసెసర్‌  
► 8 జీబీ రామ్‌.. 512 జీబీ ఎస్‌ఎస్‌డీ ఇంటర్నల్‌ స్టోరేజీ 
► వైర్డ్, వైర్‌లెస్‌ కమ్యూనికేషన్‌ విధానం 
► మైక్రోసాఫ్ట్‌ విండోస్‌ 10 ప్రో ఆపరేటింగ్‌ సిస్టమ్‌ 
► 5 ఏళ్ల వారంటీ  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top