
ఎయిర్‌పోర్టు, క్రికెట్ స్టేడియం కోసం మరికొంత భూమి అవసరం
అమరావతి రైతులతో సమావేశంలో సీఎం చంద్రబాబు
వీటి అవసరాలకు అనుగుణంగా భూమిని తీసుకోవాల్సి ఉంటుంది
వీటి నిర్మాణంతో భూముల విలువ పెరుగుతుంది
రాజధాని పనుల పున:ప్రారంభ కార్యక్రమానికి రైతులకు ఆహ్వానం
రైతుల రిటర్న్‌బుల్ ప్లాట్లకు బ్యాంకుల ద్వారా రుణాలు
గ్రామకంఠం పరిధిలో పట్టాలేని వారికి పట్టాలు మంజూరు
త్యాగాలు చేసిన రైతుల ప్రయోజనాలకు విరుద్ధంగా ఏ కార్యక్రమమూ ఉండదు
సాక్షి, అమరావతి: రాజధానిలో మరిన్ని భూములు సమీకరించాల్సి ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. అమరావతిలో అంతర్జాతీయ విమానాశ్రయం, క్రికెట్ స్టేడియం నిర్మాణాలకు మరికొంత భూమి అవసరం అని.. దీనికి అనుగుణంగా తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. ‘‘హైదరాబాద్లోని శంషాబాద్ ఎయిర్ పోర్టు నిర్మాణానికి భూ సేకరణ జరిగినప్పుడు 5 వేల ఎకరాలు ఎందుకని కొందరు ప్రశ్నించారు. కానీ, నాడు ముందుచూపుతో సేకరించినందునే ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు నిర్మాణంతో పాటు పెద్ద హోటళ్లు, మాల్స్ వచ్చి ఎకనమిక్ యాక్టివిటీ పెరిగింది. చుట్టుపక్కల భూములకు విలువ పెరిగి రైతులకు మేలు చేకూరింది’’ అని అన్నారు. అమరావతి రైతులతో సీఎం చంద్రబాబు సోమవారం తన నివాసంలో సమావేశమయ్యారు.
రాజధాని అవసరాలకు అదనంగా భూ సేకరణ సహా పలు అంశాలను చర్చించారు. స్వచ్ఛందంగా భూములు ఇచ్చిన రైతుల అభీష్టానికి వ్యతిరేకంగా, వారికి నష్టం జరిగేలా ఏ కార్యక్రమం, నిర్ణయం ఉండదని సీఎం తెలిపారు. అదనపు భూసేకరణ కారణంగా ఈ ప్రాంతంలో ధరలు పడిపోతాయనే అపోహలకు గురికావద్దన్నారు. తనకు, రైతులకు మధ్య దూరం ఉండదని చెప్పారు. ‘కృష్ణా నదిపై మరో మూడు నాలుగు వారధులు కూడా వస్తాయి. ఇన్నర్, ఔటర్ రింగ్ రోడ్లు వస్తాయి. ఇతర ప్రాంతాలకు కనెక్టివిటీ పెరుగుతుంది. రాజధాని విస్తరించి పెద్దఎత్తున సంస్థలు, పెట్టుబడులు వస్తాయి.
మీ ప్రయోజనాలకు విరుద్ధంగా ఏమీ జరగదు’’ అని సీఎం పేర్కొన్నారు. రాజధాని ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన రైతుల స్మారక చిహ్నం ఏర్పాటు చేయాలని రైతులు కోరగా... శాతవాహన కాలం నుంచి అమరావతి ఉద్యమం వరకు జరిగిన పరిణామాలన్నీ క్రోడీకరిస్తూ మ్యూజియం ఏర్పాటు చేస్తామని సీఎం చెప్పారు. రాజధాని పరిధిలోని గ్రామ కంఠాల్లో ప్రస్తుతం నివాసం ఉంటూ పట్టాలేని వారికి పట్టాలివ్వాలని అభ్యరి్థంచగా, దీన్ని కూడా త్వరలోనే చేపడతామని సీఎం హామీ ఇచ్చారు.
⇒ అమరావతి పనుల పున:ప్రారంభ కార్యక్రమానికి రావాలంటూ రాజధాని రైతులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆహ్వనించారు. మే 2వ తేదీ రాష్ట్ర చరిత్రలో కీలక మలుపు అని.. రాజధాని నిర్మాణం రాష్ట్ర అభివృద్ధిలో ముఖ్య అడుగు అవుతుందని సీఎం చెప్పారు. రైతుల త్యాగం కారణంగానే నేడు ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణం చేసుకుంటున్నామని, రైతుల మంచి మనసును ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకుంటారని పేర్కొన్నారు. భూములిచ్చిన రైతులకు ప్రభుత్వం తిరిగి కేటాయించే ప్లాట్లకు బ్యాంకుల ద్వారా రుణం పొందేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. రాజధానిలో జరిగే ప్రతి కార్యక్రమం, పనుల్లో భాగస్వామ్యం కావాలని రాజధాని గ్రామాల రైతులను చంద్రబాబు ఆహ్వనించారు. సమావేశంలో మంత్రులు నారాయణ, అనగాని సత్యప్రసాద్, వంగలపూడి అనిత, ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
బయటపడిన బాబు భూ దాహం
రాజధాని అవసరాలకు మరో 44,676 ఎకరాలు సమీకరించనున్నట్లు ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం లీక్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు చంద్రబాబు భూ దాహం రాజధాని రైతులతో నిర్వహించిన సమావేశంలోనే బయటపడింది. ప్రభుత్వ భూమితో కలిపి ఇప్పటికే రాజధాని అవసరాలకు సీఆర్‌డీఏ చేతిలో 53,749 ఎకరాలున్న విషయం తెలిసిందే. ఇందులో రైతుల నుంచి సమీకరించిన భూమి 34,566 ఎకరాలు ఉంది. ఇంత భూమి ఉన్నప్పటికీ అంతర్జాతీయ విమానాశ్రయం, స్టేడియాల పేరుతో మరో 44 వేల ఎకరాలకు పైగా భూములను రైతుల నుంచి తీసుకోవాలని ముందుగా నిర్ణయించుకున్న తరువాతనే చంద్రబాబు ప్రభుత్వం మీడియాకు లీకు ఇచ్చింది.
ఈ విషయం సోమవారం రైతులతో సీఎం నిర్వహించిన సమావేశంలోనే బట్టబయలైంది. తుళ్లూరు, అమరావతి, తాడికొండ, మంగళగిరి మండలాల పరిధి లో మరిన్ని గ్రామాలలో భూములు సమీకరించాలని చంద్రబాబు సర్కారు నిర్ణయం తీసేసుకుని.. ఇప్పుడు భూముల విలువ పెరగాలంటే అంతర్జాతీయ విమానాశ్రయం, క్రికెట్ స్టేడియం నిర్మాణం పేరు చెబుతోంది. అవి చేపట్టడానికి అవసరమైన భూములను రైతుల నుంచి తీసుకుంటామని రైతుల సమావేశంలో సీఎం చెప్పడం గమనార్హం.