Amla: విటమిన్‌ ఉసిరి.. ఎన్నెన్నో ఉపయోగాలు

Amla vitamin which boosts the immune system - Sakshi

రోగ నిరోధక శక్తిని పెంచే సి విటమిన్‌ 

టాబ్లెట్ల కంటే ఉసిరి మేలు

సాక్షి, అమరావతి: వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించటంలో ఉసిరి అద్భుతంగా పని చేస్తుందని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. కరోనా బారిన పడినవారికి తొలి రోజు నుంచి కోలుకునేంత వరకు వాడే మందుల జాబితాలో ‘సీ’తో పాటు పలు విటమిన్ల టాబ్లెట్లు ఉంటున్నాయి. వీటిలో ప్రధానమైన సీ విటమిన్‌ కోసం టాబ్లెట్‌ వాడటం కన్నా ఉసిరి కాయను నేరుగా లేదా పొడి రూపంలో తీసుకుంటే మేలని సలహా ఇస్తున్నారు. అందువల్లే ఉసిరికి ప్రపంచ దేశాల్లో గిరాకీ పెరిగింది. రాష్ట్రంలో విరివిగా లభించే ఉసిరి కాయలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ. ఇది వైరస్‌లను నివారిస్తుంది. గుండె జబ్బులు, అధిక రక్తపోటు, రక్త కణాల హీనతను తగ్గించడంతో పాటు జీర్ణశక్తిని పెంచుతుంది. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో రోగ నిరోధక శక్తిని పెంచేందుకు ఇదొక బూస్టర్‌గా పని చేస్తుందని డాక్టర్‌ జి.భార్గవ్‌ వివరించారు.

ఉసిరితో ఉపయోగాలు
విటమిన్‌ సీ,¯ కాల్షియం, ఫాస్పరస్, ఐరన్, కెరోటిన్, బీ–కాంప్లెక్స్‌తోపాటు ఇతర విటమిన్లు, ఖనిజాలు ఉసిరిలో ఎక్కువ. చక్కెర వ్యాధిని అదుపులో ఉంచేందుకు ఉసిరి దివ్య ఔషధంగా పేర్కొంటున్నారు. ఇందులో ఉండే క్రోమియం చక్కెర వ్యాధిని అదుపులో ఉంచేందుకు తోడ్పడుతుంది. గుండె కవాటాలు మూసుకుపోకుండా క్రోమియం నివారిస్తుంది. ఆయుర్వేదంలో ఉసిరి వినియోగం చాలా ఎక్కువ. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. మార్కెట్‌లో ఉసిరి కాయలతోపాటు పొడి, మాత్రల రూపంలోనూ లభిస్తోంది. తేనెతో కలిపి ఉసిరిని తీసుకుంటే ఆస్తమా, శ్వాసకోశ సమస్యలను దూరం చేసుకోవచ్చు.

రాష్ట్రంలో 11,982 టన్నుల ఉత్పత్తి
ఉద్యాన శాఖ అంచనా ప్రకారం రాష్ట్రంలో 13,336 ఎకరాల్లో ఉసిరి పంట సాగవుతోంది. ఏటా దిగుబడి 11,982 టన్నుల వరకు ఉంది. ఒకప్పుడు శీతాకాలంలో మాత్రమే దొరికే ఉసిరి కాయలు ఇప్పుడు అన్ని కాలాలలోనూ లభిస్తున్నాయి. అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, జర్మనీ, కెనడా, దక్షిణ కొరియా, హాంకాంగ్, మలేషియా, ఫ్రాన్స్, లెబనాన్, స్విట్జర్లాండ్, స్వీడన్, జపాన్, నార్వే, డెన్మార్క్, చెక్‌ రిపబ్లిక్, ఆస్ట్రియా తదితర దేశాలకు ఇక్కడి నుంచి ఎగుమతి అవుతోంది.

దివ్య ఔషధమే
ప్రస్తుత కరోనా కాలంలో ప్రజలకు ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగింది. సహజ సిద్ధంగా దొరికే పండ్లు, కాయలు, సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తులపై ఆసక్తి పెరిగింది. అందుకే ప్రత్యామ్నాయ వైద్య పద్ధతులను పాటిస్తున్నారు. అందులో భాగంగానే జనం ఇటీవల కాలంలో ఉసిరి ఉత్పత్తులను ఎక్కువగా వాడుతున్నారు. ఉసిరి కచ్చితంగా రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అనేక వ్యాధులను నయం చేస్తుంది.    
– డాక్టర్‌ కె.అప్పారావు, ఆయుర్వేద వైద్య నిపుణులు  

చదవండి: సపోటా పండు తింటే ఇన్ని లాభాలా!

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top