డీఏ పత్తా లేదు.. ఐఆర్‌ ఊసే లేదు.. | All the promises made in the manifesto should be fulfilled immediately says Bopparaju Venkateswarlu | Sakshi
Sakshi News home page

డీఏ పత్తా లేదు.. ఐఆర్‌ ఊసే లేదు..

Jun 29 2026 5:02 AM | Updated on Jun 29 2026 5:02 AM

All the promises made in the manifesto should be fulfilled immediately says Bopparaju Venkateswarlu

చంద్రబాబు ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలను పట్టించుకోవడమే లేదు 

హెల్త్‌కార్డులు సైతం పని చేయక ఉద్యోగుల్లో ఆందోళన 

మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ వెంటనే నెరవేర్చాలి 

ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు  

చిలకలపూడి (మచిలీపట్నం) : చంద్రబాబు ప్రభుత్వం వచ్చి రెండేళ్లు గడిచినా, ఉద్యోగుల న్యాయ బద్ధమైన సమస్యలు పరిష్కరించలేదని ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణా జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలోని రెవెన్యూ అసోసియేషన్‌ హాల్‌లో జిల్లా ఏపీ జేఏసీ, అమరావతిలోని వివిధ శాఖాపర సంఘాల జిల్లా, డివిజన్‌ కార్యవర్గ సభ్యులతో ఆదివారం ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం పీఆర్సీ కమిషన్‌ను నేటికీ నియమించలేదని, అధికారంలోకి రాగానే మధ్యంతర భృతి (ఐఆర్‌) ప్రకటిస్తామని హామీ ఇచ్చినప్పటికీ.. నేటికి ఆ ఊసు కూడా లేదన్నారు. 

ఆరు నెలలకు ఒకసారి పెరగాల్సిన డీఏను రెండేళ్లుగా ప్రకటించలేదన్నారు. హెల్త్‌ కార్డులు సైతం పనిచేయడం లేదన్నారు. చంద్రబాబు ప్రభుత్వంపై నమ్మకంతో ఉద్యోగులు రెండేళ్లుగా ఎంతో సహనంతో ఎదురు చూస్తున్నప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి హామీ లేకపోవడం సరికాదని చెప్పారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై పూర్తి అవగాహనతోనే ప్రభుత్వ ఉద్యోగులు ఎంతో సంయమనంతో ఉన్నారని, ఉద్యోగుల ఆర్థిక సమస్యల పట్ల ప్రభుత్వం ప్రదర్శిస్తున్న నిర్లక్ష్య ధోరణిపై తీవ్ర మనోవేదనకు గురవుతున్నారన్నారు. 

అనంతరం ఏపీజేఏసీ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన ఎంవీ శ్యామ్‌నాథ్‌కు ఆయన అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీ జేఏసీ అమరావతి అసోసియేటెడ్‌ అధ్యక్షుడు ఫణి పేర్రాజు, కోశాధికారి శ్రీనివాసరావు, ఏపీ రెవెన్యూ సర్వీసెస్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు పేటేటి సత్యనారాయణ, సంఘ నాయకులు లోవరాజు తదితరులు పాల్గొన్నారు. 

ఈ హామీలను వెంటనే అమలు చేయాలి 
» కాంట్రాక్ట్‌ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలి. 
» ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు టీడీపీ మేనిఫెస్టోలో చెప్పిన విధంగా సంక్షేమ పథకాలను వర్తింపజేయాలి. 
» పెన్షనర్లకు అడిషనల్‌ క్వాంటం పెన్షన్‌ను  పునరుద్ధరించాలి.  
» రాష్ట్ర ప్రభుత్వ మహిళా ఉద్యోగులకు కూడా కేంద్ర ప్రభుత్వ మహిళా ఉద్యోగినులతో సమానంగా రెండేళ్ల చైల్డ్‌ కేర్‌ లీవ్‌ వర్తింపచేయాలి. 
» ఉద్యోగులు, పెన్షనర్లు ప్రతి నెల చందాలు చెల్లిస్తున్నప్పటికీ అత్యవసర సమయంలో హెల్త్‌ కార్డులు పని చేయడం లేదు. ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలి.  

ఇదీ మా ఉద్యమ కార్యాచరణ 
»  ఏపీ జేఏసీ అమరావతి భాగస్వామ్య సంఘాల జిల్లా, డివిజన్‌ స్థాయి నాయకులతో కలిసి ఉద్యమానికి సిద్ధమవుతున్నాం. 
»  జూలై 10వ తేదీ రాష్ట్రంలోని అన్ని డివిజన్‌ కేంద్రాల్లో జిల్లా నాయకత్వాల ఆధ్వర్యంలో ఆర్డీవోలకు, ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు అందజేత. 
»  జూలై 12న శ్రీకాకుళం, 21న అనంతపురంలో ఉద్యమ సన్నద్ధం సభల నిర్వహణ. 
»  అనంతరం అన్ని ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో ఉద్యమ సన్నద్ధ సభల ఏర్పాటు. 
» అప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే, కలిసొచ్చే ఇతర సంఘాలతో కలిసి ప్రత్యక్ష ఐక్య ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తాం.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement