తగ్గినా.. తీవ్రంగానే

All The Political Parties Comments With State Election Commission - Sakshi

‘స్థానికం’ వాయిదా నాటి కంటే ఇప్పుడే కరోనా తీవ్రత అధికం

రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు తేల్చి చెప్పిన రాజకీయ పార్టీలు

సాక్షి, అమరావతి: ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా తీవ్రత కాస్త తగ్గినప్పటికీ మార్చి 15న స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసినప్పటి కంటే వైరస్‌ తీవ్రత ఇప్పుడే అధికంగా ఉందని పలు రాజకీయ పార్టీలు స్పష్టం చేశాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజల ప్రాణాలను పరిరక్షిస్తూ ఎన్నికలు ఎలా నిర్వహిస్తారనే అంశాన్ని తొలుత వెల్లడించి తరువాత పార్టీల అభిప్రాయాన్ని కోరాలని సూచించాయి. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ బుధవారం నిర్వహించిన సమావేశంలో తమ మనోగతాన్ని తెలియచేశాయి. ఈ అంశాలన్నీ పరిగణనలోకి తీసుకున్న తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై నిర్ణయం తీసుకోవాలని పేర్కొన్నాయి. 19 రాజకీయ పార్టీలను అభిప్రాయ సేకరణకు ఆహ్వానించగా 11 పార్టీలు ప్రత్యక్షంగా, 2 పార్టీలు మెయిల్‌ ద్వారా రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు తమ అభిప్రాయాలు తెలియచేశాయి. వైఎస్సార్‌సీపీ సహా ఎన్సీపీ, టీఆర్‌ఎస్, ఎంఐఎం, ఆర్‌ఎల్‌డీ, రివల్యూషనరీ సోషలిస్టు పార్టీలు దీనికి  హాజరు కాలేదు.

ఎలా నిర్వహిస్తారో ముందు చెప్పండి: బీజేపీ 
ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజల ప్రాణాలు, ఆరోగ్యాన్ని కాపాడుతూ ఎన్నికలు ఎలా నిర్వహిస్తారనే అంశాన్ని తొలుత వెల్లడించి తరువాత పార్టీల అభిప్రాయాన్ని కోరడం సముచితమని ఎస్‌ఈసీకి స్పష్టం చేశాం.  

ఇప్పుడే కరోనా తీవ్రత ఎక్కువ: సీపీఎం
మార్చిలో ఎన్నికలు వాయిదా వేసినప్పటి కంటే రాష్ట్రంలో ఇప్పుడే కరోనా తీవ్రత అధికంగా ఉందన్న విషయాన్ని ఎన్నికల కమిషనర్‌ దృష్టికి తెచ్చాం. ఎన్నికల కమిషన్‌ రాష్ట్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకొని తగిన నిర్ణయం తీసుకోవాలని సూచించాం.

సంప్రదించి నిర్ణయించాలి: సీపీఐ
మార్చిలో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికల ప్రక్రియ జరగలేదని, కొత్త నోటిఫికేషన్‌ ద్వారా ఎన్నికలు నిర్వహించాలని సూచించాం. ప్రభుత్వంతో, వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సంప్రదించిన తర్వాతే ఎన్నికలు జరపాలి. 

ఎప్పుడైనా మేం సిద్ధమే: టీడీపీ
కరోనా పూర్తిగా తగ్గిపోయిన ఈ పరిస్థితుల్లో ఎప్పుడు ఎన్నికలు నిర్వహించినా మా పార్టీ సిద్ధంగా ఉందని చెప్పాం. గతంలో వెలువరించిన నోటిఫికేషన్‌ను రద్దు చేసి కొత్త నోటిఫికేషన్‌ విడుదల చేసి ఎన్నికలు నిర్వహించాలి.
 
అప్పటి వరకు ఎన్నికలు వద్దు: కాంగ్రెస్‌
కరోనా కట్టడిలోకి వచ్చి సామాన్య ప్రజలు జీవితాలకు భద్రత కలిగే వరకు ఏ ఎన్నికలూ నిర్వహించవద్దని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను కోరాం. 

ఆ ఘటనలపై విచారణ జరపాలి: జనసేన
ఎన్నికలు పారదర్శకంగా స్వేచ్ఛాయుత వాతావరణంలో జరిగేలా రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ చర్యలు తీసుకోవాలి. మార్చిలో ఎన్నికల ప్రక్రియలో చోటు చేసుకున్న హింసాత్మక సంఘటనలు, అధికార దుర్వినియోగంపై విచారణ చేపట్టాలని కోరాం.

ఇతర పార్టీలు ఏమన్నాయంటే..
కరోనాకు టీకా వచ్చే వరకు లేదా కనీసం 2021 మార్చి నాటికి పరిస్థితులు చక్కబడే వరకు స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసి తర్వాత రీ నోటిఫికేషన్‌ విడుదల చేయాలని ఫార్వర్డ్‌ బ్లాక్, బీఎస్పీ కోరగా.. కొత్త నోటిఫికేషన్‌ విడుదల చేసి మళ్లీ నామినేషన్ల ప్రక్రియ చేపట్టి ఎన్నికలు నిర్వహించాలని జనతాదళ్‌ యూ, ఇండియన్‌ ముస్లిం లీగ్, అన్నాడీఎంకే, జనతాదళ్‌ సెక్యులర్, సమాజ్‌వాదీ పార్టీలు కోరాయి.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top