ఈ ప్రశ్నలకు జవాబేది? | All Eyes on TDP in Fake Liquor Case: Andhra pradesh | Sakshi
Sakshi News home page

ఈ ప్రశ్నలకు జవాబేది?

Oct 15 2025 5:46 AM | Updated on Oct 15 2025 5:46 AM

All Eyes on TDP in Fake Liquor Case: Andhra pradesh

నకిలీ మద్యం కేసులో అందరి చూపులు టీడీపీ వైపే 

అన్ని వేళ్లూ టీడీపీ పెద్దల వైపే.. 

ప్రభుత్వం, పోలీసులు కలిసిపోయి డ్రామాలు

సాక్షి, అమరావతి: దేశ వ్యాప్తంగా కలకలం రేపిన నకిలీ మద్యం రాకెట్‌ వెనుక ప్రభుత్వ పెద్దలు ఉన్నారనే విషయం బట్టబయలు కావడంతో  ఈ కేసు దర్యాప్తును పక్కదారి పట్టించే యత్నాలు ముమ్మరమయ్యాయి. ప్రభుత్వ పెద్దలు, పోలీసులు.. ఇద్దరూ కలిసి­పోయి సాగిస్తున్న నాటకాలు, కుతంత్రాలే అసలు కుట్రను బట్టబయలు చేస్తున్నాయి. ఈ వ్యవహారానికి సంబంధించి అందరి చూపులు.. అన్ని వేళ్లూ టీడీపీ వైపే చూపుతున్న నేపథ్యంలో పలు కీలక ప్రశ్నలకు సమాధానం కరువైంది. నకిలీ మద్యం మాఫియాపై ప్రభుత్వంగానీ, పోలీసులుగానీ సూటిగా సమాధానం చెప్పే ధైర్యం చేయలేకపోతున్నారు. ఈ కేసు దర్యాప్తులో ప్రధానంగా కింది ప్రశ్నలకు పోలీసులు, ప్రభుత్వం సమాధానం చెప్పాల్సి ఉంటుంది.  

ఏ1 జనార్దన్‌రావును అరెస్టు చేసి విచారించిన తరువాతే న్యాయ స్థానంలో హాజరు పరిచారు. పోలీసులు తమ విచారణలో వెల్లడైన విషయాలతో రిమాండ్‌ నివేదికను న్యాయస్థానానికి సమర్పించారు. ఆ రిమాండ్‌ నివేదికలో ఎక్కడా వైఎస్సార్‌సీపీ నేత జోగి రమేష్‌ పేరును ప్రస్తావించనే లేదు. జనార్దన్‌రావుకు న్యాయస్థానం రిమాండ్‌ విధించడంతో నెల్లూరు జైలుకు తరలించారు. మరి 24 గంటల తరువాత జోగి రమేష్‌ పేరు చెబుతూ జనార్దన్‌రావు వీడియో బయటకు రావడం వెనుక దాగిన గుట్టు ఏమిటి? నిజంగా జోగి రమేష్‌ పేరును ఆయన చెప్పి ఉంటే ఆ విషయాన్ని న్యాయ స్థానానికి సమర్పించిన రిమాండ్‌ నివేదికలోనే వెల్లడించే వారు కదా! మరి ఆ వీడియో కుట్ర వెనుక ఉన్న ప్రభుత్వ పెద్దలు ఎవరు? 

ప్రభుత్వ ఆదేశాలతోనే ఎక్సైజ్‌ అధికారులు ఇబ్రహీంపట్నంలో నకిలీ మద్యం గోడౌన్‌లో సోదాలు చేసి జప్తు చేశారని సీఎం చంద్రబాబు చెప్పారు. తమ ప్రభుత్వమే చేయించిందని ఆయన గొప్పగా చెప్పుకున్నారు. కానీ జనార్దన్‌రావుతో చెప్పించిన వీడియోలో అందుకు పూర్తి విరుద్ధంగా ఎందుకు ఉంది? టీడీపీ కూటమి ప్రభుత్వానికి చెడ్డపేరు తేవాలనే జోగి రమేష్‌ ఆదేశాలతో నకిలీ మద్యాన్ని తెప్పించి.. అనంతరం ఎక్సైజ్‌ అధికారులకు సమాచారం ఇచ్చి దాడులు చేయించారని జనార్దన్‌రావుతో ఎందుకు చెప్పించారు? నకిలీ మద్యం దందాలో టీడీపీ పెద్దల పాత్రను కప్పిపుచ్చేందుకే ఈ కట్టు కథలతో అడ్డంగా దొరికారన్నది నిజం కాదా? 

విదేశాలకు వెళ్లిపోతే తనకు రూ.3 కోట్లు ఇస్తామని వైఎస్సార్‌సీపీ నేత జోగి రమేష్‌ ఆఫర్‌ ఇచ్చారంటూ ఏ1 జనార్దన్‌రావుతో ప్రభుత్వ పెద్దలు వీడియో ద్వారా చెప్పించారు. మరి అంతలోనే ఆయన ఎందుకు ఆంధ్రప్రదేశ్‌కు వచ్చారు? తన తమ్ముడిని పట్టించుకోవడం లేదని మరో కట్టు కథ ఎందుకు చెబుతున్నారు? అంటే జోగి రమేష్‌ రూ.3 కోట్లు ఇస్తానన్నట్లు వీడియోలో ఆయన చెప్పింది పూర్తిగా అవాస్తవమే కదా.. ఈ లెక్కన ప్రభుత్వ పెద్దల పన్నాగంలో భాగంగానే ఆయన రాష్ట్రానికి వచ్చి అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారన్నది వాస్తవం కాదా?  

ములకలచెరువు నకిలీ మద్యం కేసులో అరెస్టు చేసిన వారిని 24 గంటల్లోనే పోలీసులు కస్టడీలో విచారించేందుకు న్యాయస్థానాన్ని అనుమతి కోరారు. మరి ఇబ్రహీంపట్నం నకిలీ మద్యం కేసులో ఏ1 నిందితుడు జనార్దన్‌రావును కస్టడీలోకి తీసుకుని విచారించాలని పోలీసులు ఎందుకు భావించడం లేదు?  

ఇబ్రహీంపట్నం నకిలీ మద్యం కేసులో ఏ1గా ఉన్న జనార్దన్‌రావును విదేశాల నుంచి రాష్ట్రానికి రప్పించిన ప్రభుత్వ పెద్దలు.. ములకలచెరువు నకిలీ మద్యం కేసులో పాత్రధారిగా ఉన్న టీడీపీ నేత జయచంద్రారెడ్డిని ఎందుకు రాష్ట్రా­నికి రప్పించడం లేదు? లుక్‌ అవుట్‌ నోటీసు జారీలో తాత్సారం ఎందుకు? ఆయన అరెస్టుకు ఎందుకు యత్నించడం లేదు?  

అన్నమయ్య జిల్లా ములకలచెరువు నకిలీ మద్యం యూనిట్‌ నుంచి నకిలీ మద్యాన్ని పాల వ్యానుల ద్వారా సరఫరా చేసినట్టు వెల్లడైంది. ఆ వ్యానులు టీడీపీ నేతలవే. ఎనీ్టఆర్‌ జిల్లా ఇబ్రహీంపట్నం, అనకాపల్లి జిల్లా రాంబిల్లి, పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నుంచి కూడా వివిధ ప్రాంతాలకు ప్రత్యేక వాహనాల్లో నకిలీ మద్యాన్ని సరఫరా చేశారు. ఆ వాహనాలు ఎవరివి అన్నది పోలీసులు ఎందుకు పట్టించుకోవడం లేదు? వాటిని జప్తు చేయకుండా పోలీసులను 
అడ్డుకుంటున్న పెద్దలు ఎవరు?  

నకిలీ మద్యం దందా బయటపడిన తరువాత కూడా రాష్ట్రంలో దాదాపు 75 వేల బెల్టు దుకాణాలపై ఎక్సైజ్‌ అధికారులు ఎందుకు దాడులు చేయడం లేదు? బెల్ట్‌ దుకాణాల్లో విక్రయిస్తున్న మద్యాన్ని ఎందుకు జప్తు చేయడం లేదు? దాన్ని పరీక్షల కోసం ల్యాబ్‌లకు ఎందుకు పంపడం లేదు?  

రాష్ట్రంలో అసలు నకిలీ మద్యమే లేదని.. మద్యం దుకాణాల్లో నకిలీ సరుకు అమ్మడమే లేదని ప్రకటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. మరి అంతలోనే ఎందుకు ‘ఏపీ ఎక్సైజ్‌ యాప్‌’ను ప్రవేశ పెట్టారు? నకిలీ మద్యాన్ని గుర్తించేందుకు ఆ యాప్‌పై అవగాహన కల్పించాలని ఎందుకు చెబుతున్నారు? అంటే టీడీపీ సిండికేట్‌ మద్యం దుకాణాల్లో నకిలీ మద్యం విక్రయిస్తున్నారని అధికారికంగా అంగీకరించినట్లే కదా? 

టీడీపీ నేతల కుటుంబాలకు చెందిన డిస్టిలరీలు, టీడీపీ సిండికేట్‌ నిర్వహిస్తున్న మద్యం దుకాణాలు, బార్లలో ఎందుకు తనిఖీలు చేయడం లేదు? అంటే నకిలీ మద్యం కేసు దర్యాప్తును పక్కదారి పట్టించి ప్రభుత్వ పెద్దలు తప్పించుకోవాలని యతి్నస్తున్నట్లు కాదా? 

నకిలీ మద్యం దందాతో ప్రభుత్వ పెద్దలకు సంబంధం లేకపోతే డైవర్షన్‌ డ్రామాలు ఎందుకు? ఏ1 జనార్దనరావుతో గుర్తు తెలియని ప్రదేశంలో ఓ వీడియో షూట్‌ చేయించడం ఎందుకు? కోర్టుకు సమర్పించిన రిమాండ్‌ నివేదికలో ఆ వీడియో గురించి ఎందుకు ప్రస్తావించ లేదు? ఆ వీడియో డ్రామా బెడిసి కొట్టగానే.. వైఎస్సార్‌సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి నివాసంలో సిట్‌ సోదాలతో హడావుడి ఎందుకు? ఇవన్నీ ఈ కేసు దర్యాప్తు నుంచి ప్రజల దృష్టి మళ్లించే ఎత్తుగడలు కావా?  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement