‘సెకీ’ విద్యుత్‌ చౌక | Agreement with SECI for purchase of 7 thousand megawatts for farmers | Sakshi
Sakshi News home page

‘సెకీ’ విద్యుత్‌ చౌక

May 18 2024 5:54 AM | Updated on May 18 2024 5:54 AM

Agreement with SECI for purchase of 7 thousand megawatts for farmers

రైతుల కోసం 7 వేల మెగావాట్లు కొనుగోలుకు సెకీతో ఒప్పందం

అతి తక్కువ ధరకు యూనిట్‌ రూ.2.49కు కొనుగోలు

ఏటా దాదాపు రూ.3,750 కోట్లు ఆదా

చంద్రబాబు హయాంలో యూనిట్‌కు రూ.8.90 చెల్లించి పీపీఏలు

బాబు నిర్వాకం వల్ల రాష్ట్ర డిస్కంలపై 25 ఏళ్లపాటు ఏటా రూ.3500 కోట్ల భారం

సాక్షి, అమరావతి: కరెంటు కోసం అర్ధరాత్రి వేళ పొలాల్లో పడిగాపులు కాస్తూ, రైతులు ప్రాణాలు పోగొట్టుకున్న చీకటి రోజుల నుంచి విముక్తి కలిగి­స్తూ పగటిపూటే నిరంతరాయంగా 9 గంటలు ఉచి­త విద్యుత్‌ అందిస్తోంది వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం.రానున్న 30 ఏళ్లలో అన్నదాతలకు ఎలాంటి వి­ద్యుత్‌ కష్టాలు లేకుండా చేయడం కోసం సౌర విద్యుత్‌ను సమకూరుస్తోంది.

ఇందుకోసం ప్రైవేటు రంగం నుంచి కాకుండా, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన సోలార్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (సెకీ) నుంచి 7 వేల మెగావాట్లు తీసుకుని వ్యవ­­సాయానికి అందించాలని సంకల్పించింది. ఇలా సెకీ నుంచి కొనుగోలు చేసే విద్యుత్‌ అత్యంత చౌకగా వస్తోందని ఇంధన రంగ నిపుణులు చెబుతున్నారు.

‘సెకీ’తో లాభమేగానీ నష్టం లేదు
2003 ఎలక్ట్రిసిటీ యాక్ట్‌ ప్రకారం సెకీ ఒప్పందాలకు కేంద్ర, రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండళ్ల నుంచి ఆమోదం లభించింది. దీంతో ఈ ఏడాది సెప్టెంబర్‌ నుంచి సెకీ నుంచి విద్యుత్‌ కొనుగోలు మొదలవుతుంది. తొలి ఏడాది 3 వేల మెగావాట్లు, 2025లో మరో 3 వేల మెగావాట్లు, 2026లో మరో 1,000 మెగావాట్లు చొప్పున మొత్తం ఏడాదికి 7 వేల మెగావాట్లను రాష్ట్ర ప్రభుత్వం తీసుకోనుంది. విద్యుత్‌ పంపిణీ సంస్థ (డిస్కం)లతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ ఒప్పందంలో ఒక భాగస్వామిగా ఉండటం వల్ల చెల్లింపులకు ఎటువంటి ఆటంకం కలగదు. 

ప్రస్తుత సరాసరి విద్యుత్‌ కొనుగోలు వ్యయం యూనిట్‌ రూ.5.10 ఉంది. సెకీ విద్యుత్‌ అతి తక్కువకు యూనిట్‌ రూ.2.49 కు వస్తోంది. ఏపీకి ఎన్టీపీసీ సరఫరా చేస్తున్న సౌర విద్యుత్‌ ధర (ట్రేడింగ్‌ మార్జిన్‌ కలిపి) యూనిట్‌ రూ.2.79 కన్నా ఇది తక్కువ. ఈ లెక్కన సెకీ ఒప్పందంతో ఏటా దాదాపు రూ.3,750 కోట్లు రాష్ట్రానికి ఆదా అవుతుంది. సెకీ నుంచి విద్యుత్‌ తీసుకోవడం వల్ల 25 ఏళ్ల పాటు ఇంటర్‌ స్టేట్‌ ట్రాన్స్‌విుషన్‌ చార్జీల నుంచి కూడా రాష్ట్రానికి మినహాయింపు వస్తుంది.

అదే రాష్ట్రంలో ఉత్పత్తి అయిన విద్యుత్‌కు పాతికేళ్ల పాటు సెంట్రల్‌ గ్రిడ్‌ ఛార్జీలు చెల్లించాల్సి వచ్చేది. దీనికి కూడా కేంద్రం మినహాయింపునిచ్చింది. రాష్ట్రంలో అంతర్గతంగా సౌర ప్రాజెక్టులు కట్టినప్పుడు వాటికి కావలసిన విద్యుత్‌ లైన్లు, అంతర్గతంగా విద్యుత్‌ ప్రసార వ్యవస్థ బలోపేతానికి అయ్యే ఖర్చు, బయటి రాష్ట్రం నుంచి నేరుగా తీసుకున్నప్పుడు అయ్యే ఖర్చు తక్కువ అవుతుంది. 

టీడీపీ వల్లనే నష్టం
చంద్రబాబు ప్రభుత్వ హయాంలో చేసుకున్న పీపీఏల ధరలకు, వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం సెకీతో కుదుర్చుకున్న ఒప్పందంలోని ధరలకు అసలు పొంతనే లేదు. చంద్రబాబు హయాంలో సగటు ధరకన్నా ఎక్కువకు కొనుగోలు ఒప్పందాలు జరిగాయి. అప్పట్లో మార్కెట్‌లో సౌర విద్యుత్‌ యూనిట్‌ రూ.2.44 కు లభిస్తుంటే (బాక్డౌన్‌ చార్జీలతో కలిపి రూ.3.54) చంద్రబాబు ఏకంగా యూనిట్‌కు రూ.8.90 వెచ్చించారు. 

పవన విద్యుత్‌ యూనిట్‌కు రూ.4.84 వరకు అధిక ధర చెల్లించి పవర్‌ పర్చేజ్‌ అగ్రిమెంట్‌ (పీపీఏ)లు కుదుర్చుకున్నారు. 2016లో టీడీపీ ప్రభుత్వం, ఇదే సెకీ నుంచి యూనిట్‌కు రూ.4.57తో గాలివీడులో 400 మెగావాట్లు, మైలవరంలో యూనిట్‌కు రూ.2.77 చొప్పున మరో 750 మెగావాట్లను కొనుగోలు చేసింది. ఇలా చంద్రబాబు హయాంలో మొత్తం దాదాపు 7 వేల మెగా వాట్ల విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాల వల్ల డిస్కంలపై ఏడాదికి రూ.3,500 కోట్ల భారం పడింది. 

ఈ భారాన్ని 25 ఏళ్ల పాటు మోయాల్సిన దుస్థితి ఏర్పడింది. అయితే గత ఐదేళ్లుగా సోలార్‌ ధరలు ఇంచుమించు ఒకేలా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం, డిస్కంలు ‘సెకీ’తో ఒప్పందం కారణంగా బహిరంగ మార్కెట్‌లో యూనిట్‌ రూ.6 నుంచి రూ.12 కు కొనే బదులు గ్రీన్‌ పవర్‌ను యూనిట్‌ రూ.2.49 కొనవచ్చు. ఫలితంగా డిస్కంలకు ఆర్ధిక ప్రయోజనం కలుగుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement