సీఎంగా చంద్రబాబుది అధికార దుర్వినియోగమే

AG Told High Court That Chandrababu Had Abused Power - Sakshi

రాజధాని తేలకముందే అమరావతి చుట్టూ భూములు కొనేశారు

బినామీల పేర్ల మీద నారా లోకేశ్‌ భూములు కొన్నారు

హైకోర్టుకు నివేదించిన అడ్వొకేట్‌ జనరల్‌ శ్రీరామ్‌

తదుపరి విచారణ నేటికి వాయిదా

సాక్షి, అమరావతి: చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని రాష్ట్ర అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ) శ్రీరామ్‌ హైకోర్టుకు నివేదించారు. స్వీయ, స్వపక్ష ప్రయోజనాలకే ఆయన పెద్దపీట వేశారని వివరించారు. చంద్రబాబు, ఆయన మంత్రివర్గ సహచరులు, టీడీపీ ఎమ్మెల్యేలు రాజధానిగా అమరావతి ఖరారు కాకముందే ఆ చుట్టుపక్కల పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేశారన్నారు. చంద్రబాబు సతీమణికి చెందిన హెరిటేజ్‌ పేరు మీద కూడా భూముల కొనుగోళ్లు జరిగాయన్నారు. అప్పటి మంత్రి నారా లోకేశ్‌ తన బినామీల పేరు మీద భూములు కొన్నారని తెలిపారు. దీనిపై విచారణను న్యాయమూర్తి జస్టిస్‌ డీవీఎస్‌ఎస్‌ సోమయాజులు మంగళవారానికి వాయిదా వేశారు. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. (చదవండి: తనఖా రుణం.. తన ప్రచారానికి)

అంతకుముందు ఏజీ శ్రీరామ్‌ టీడీపీ ప్రభుత్వ హయాంలో అక్రమాలను కోర్టు దృష్టికి తెచ్చారు. 
లింగమనేని రమేశ్‌ అమరావతి ప్రాంతంలో 160 ఎకరాలు కొన్నారని, ఆయన ఇంట్లోనే సీఎంగా  చంద్రబాబు ఉన్నారని నివేదించారు. 
మంత్రివర్గ ఉపసంఘం ఆధారాలతో సహా వారి అక్రమాలను తేల్చడంతో దర్యాప్తు నిమిత్తం సిట్‌ను ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు.
మంత్రివర్గ ఉపసంఘం, సిట్‌లను ఏర్పాటు చేస్తూ జారీ చేసిన జీవోలను సవాల్‌ చేస్తూ పిటిషన్లు దాఖలు చేసే అర్హత టీడీపీ నేతలు వర్ల రామయ్య, ఆలపాటి రాజేంద్రప్రసాద్‌లకు లేదన్నారు. 
వర్ల పార్టీ ప్రయోజనాల కోసమే పిటిషన్‌ దాఖలు చేశానని స్వయంగా తన అఫిడవిట్‌లో పేర్కొన్నారని తెలిపారు. 
భూకుంభకోణంపై కేంద్రానికి అన్ని ఆధారాలు పంపి సీబీఐ దర్యాప్తు కోరామన్నారు. 
ఈ వ్యాజ్యాల్లో కేంద్రాన్ని, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ)ని ప్రతివాదులుగా చేర్చాలని అనుబంధ పిటిషన్‌ దాఖలు చేశామన్నారు.
అయితే అనుబంధ పిటిషన్‌ న్యాయమూర్తి ముందు లేకపోవడంతో తదుపరి విచారణను వాయిదా వేశారు. 

(చదవండి: స్కామ్‌లపై కేసులు వద్దంటే ఏంటర్థం?)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top