ఇది కచ్చితంగా ఫోరం షాపింగే | Sakshi
Sakshi News home page

ఇది కచ్చితంగా ఫోరం షాపింగే

Published Thu, Dec 7 2023 2:16 AM

Advocate General Srirams comment on writ petition of capital farmers - Sakshi

సాక్షి, అమరావతి: ఉత్తరాంధ్ర అభివృద్ధి పర్యవేక్షణ, సమీక్ష నిమిత్తం విశాఖపట్నంలో ప్రభుత్వ క్యాంప్‌ కార్యాలయాల ఏర్పాటుకు అనువైన ప్రదేశాలను గుర్తిస్తూ ఐఏఎస్‌ల కమిటీ ఇచ్చిన నివేదికకు అనుగుణంగా ప్రభుత్వం జారీ చేసిన జీవో 2283ని సవాలు చేస్తూ రిట్‌ పిటిషన్‌ దాఖలు చేయడం వెనుక రాజధాని రైతుల దురుద్దేశాలను అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ) ఎస్‌.శ్రీరామ్‌ హైకోర్టు ముందుంచారు. ఈ జీవోపై రిట్‌ పిటిషన్‌ దాఖలు చేయడం ఫోరం షాపింగ్‌ (కావాల్సిన న్యాయమూర్తి వద్దకు కేసు వచ్చేలా చేయడం) కిందకే వస్తుందని కోర్టుకు నివేదించారు. నీతి లేని వ్యక్తులే ఇలాంటి తప్పుడు మార్గాలను అనుసరిస్తారని తెలిపారు. జీవో 2283ని రద్దు చేయాలని, అప్పటివరకు జీవో అమలును నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతూ అమరావతి పరిరక్షణ సమితి మేనేజింగ్‌ ట్రస్టీ గద్దె తిరుపతిరావు, రాజధాని రైతులు మాదాల శ్రీనివాసరావు, వలపర్ల మనోహరం హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు.

ఈ వ్యాజ్యం బుధవారం జస్టిస్‌ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు ముందుకు విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏజీ శ్రీరామ్‌ వాదనలు వినిపించారు. ఈ వ్యాజ్యంపై రిజిస్ట్రీ ఎలాంటి అభ్యంతరాలు లేవనెత్తకుండా నంబరు కేటాయించడంపై శ్రీరామ్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. గతంలో ప్రభుత్వ కార్యాలయాల తరలింపు జరుగుతోందంటూ ధర్మాసనం ముందు ప్రజా ప్రయోజన వ్యాజ్యా­లు (పిల్‌) దాఖలు చేసిన అమరాతి పరిరక్షణ సమితి, మరికొందరు.. ఇప్పుడు అదే అంశంపై రిట్‌ పిటిషన్‌ వేయడం ఆశ్చర్యకరమని ఏజీ అన్నారు. కార్యాలయాల తరలింపు వ్యవహారం రాజధాని అంశంతో ముడిపడి ఉందని, అలా తరలించడం హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం తీర్పునకు విరు­ద్ధ­మని పిటిషనర్లు వారి వ్యాజ్యంలో స్వయంగా పేర్కొన్నారని, వారికి ఎలాంటి దురుద్దేశాలు లేకుంటే పిల్‌ దాఖలు చేసి ఉండే వారని తెలిపారు.

పిల్‌ దాఖలు చేస్తే ఈ వ్యవహారం మొత్తం ధర్మాసనం ముందుకే వస్తుందని తెలిసి రిట్‌ దాఖలు చేశారన్నారు. రాజధానిలో పేదలకు ఇళ్ల స్థలా­ల పంపిణీ వ్యవహారంలో కూడా ఇలానే ఫోరం షాపింగ్‌కు పాల్పడ్డారని, దీంతో ధర్మాసనమే ఆ వ్యాజ్యాలను తెప్పించుకుని విచారణ జరిపిందన్నారు. రాజధాని వ్యవహారం కేవలం పిటిషనర్లకు మాత్రమే సంబంధించింది కాదని, పెద్ద సంఖ్యలో ప్రజలకు సంబంధించిందన్నారు. అందువల్ల పిల్‌ మాత్రమే దాఖలు చేయాల్సి ఉంటుందని తెలిపారు. కార్యాలయాల తరలింపు విషయంలో అభ్యంతరాలుంటే తమ వద్దకు రావాలని పిటిషనర్లకు గతంలోనే ధర్మాసనం స్వేచ్ఛనిచ్చిందని, ఈ విషయం వారికీ తెలుసునన్నారు. అయినా ధర్మాసనం ముందుకు వెళ్లకుండా సింగిల్‌ జడ్జి వద్దకు వచ్చారని వివరించారు.

చాలా తెలివిగా పిటిషన్‌ను తయారు చేశారని, అంతే తెలివిగా ధర్మాసనం ముందుకు రాకుండా చేశారన్నారు. వారి అంతిమ ఉద్దేశం ఫోరం షాపింగేనని చెప్పారు. ఫోరం షాపింగ్‌ విషయంలో సుప్రీంకోర్టు వెలువరించిన పలు తీర్పులను ఆయన కోర్టు ముందుంచారు. అసలు ఈ పిటిషన్‌ విచారణార్హతపైనే ఏజీ అభ్యంతరాలు లేవనెత్తారు. దాదాపు గంటసేపు వాదనలు వినిపించిన ఏజీ.., తదుపరి వాదనలకు సమయం లేకపోవడంతో విచారణను శుక్రవారానికి వాయిదా వేయాలని కోరారు. దీంతో న్యాయమూర్తి జస్టిస్‌ నిమ్మగడ్డ విచారణను శుక్రవారానికి వాయిదా వేశారు.

Advertisement
 
Advertisement