తయారీ కేంద్రంపై పోలీసుల దాడి
క్రూడాయిల్, తయారీ సామగ్రి స్వాదీనం
9 మందిపై కేసు.. ఒకరి అరెస్టు
ప్రత్తిపాడు: కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం ధర్మవరంలో కల్తీ వంట నూనె తయారీ కేంద్రంపై పోలీసులు దాడి చేశారు. ఈ కేసులో ఒకరిని అరెస్టు చేసి, రూ.1.5 లక్షల విలువైన కల్తీ వంట నూనె, క్రూడాయిల్, తయారీ సామగ్రిని స్వా«దీనం చేసుకున్నారు. పెద్దాపురం డీఎస్పీ డి.శ్రీహరిరాజు మంగళవారం తెలిపిన వివరాల మేరకు.. ధర్మవరం చుట్టుపక్కల ప్రాంతాల్లో కల్తీ వంట నూనె తయారు చేస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం రావడంతో జాతీయ రహదారిని ఆనుకుని కాకినాడ వాసి ప్రతాప్‌సింగ్‌కు చెందిన రేకుల షెడ్డులో కల్తీ వంట నూనె తయారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
జంతువుల కొవ్వు, చవగ్గా దొరికే క్రూడాయిల్ కలిపి, మరగబెట్టి కల్తీ వంట నూనె తయారు చేస్తున్న పిఠాపురం మండలం ఎఫ్‌కే పాలేనికి చెందిన బండారు ఫణి ప్రసాద్‌ను అదుపులోకి తీసుకున్నారు. పిఠాపురం, చెందుర్తికి చెందిన స్నేహితులు ఏడిద విజయ్‌కుమార్, ఆరుగుల సురేష్ కుమార్‌ల వద్ద తక్కువ ధరకు ఇతను జంతువుల కొవ్వు కొనుగోలు చేస్తున్నాడు. కాకినాడ లైట్ హౌస్ ప్రాంతానికి చెందిన చిట్టిబాబు నుంచి క్రూడాయిల్ తెచ్చి ఎఫ్‌కే పాలెంలో కల్తీ వంట నూనెలు తయారు చేస్తున్నాడు.
శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం శ్రీ వెంకటేశ్వరా ట్రేడర్స్ యజమాని సంతోషి శ్రీనివాస్‌దాస్, రాజమహేంద్రవరానికి చెందిన ఎండీ ఇర్ఫాన్‌తో వ్యాపార ఒప్పందం కుదుర్చుకుని, వారికి కల్తీ నూనె సరఫరా చేసేవాడు. కల్తీ నూనె డబ్బాలపై ప్రియ, కుక్‌పాల్, ఫ్రీడమ్, రుచి గోల్డ్, విరాట్, ఫస్ట్‌క్లాస్, పామ్ శక్తి తదితర బ్రాండ్ల లేబుల్స్ అతికించేవాడు. ఎఫ్‌కే పాలెంలో పరిస్థితులు అనుకూలించకపోవడంతో నాలుగు నెలల క్రితం తన వ్యాపారాన్ని ధర్మవరానికి మార్చాడు.
గొల్లప్రోలు మండలం తాటిపర్తికి చెందిన నామా నాగూర్, నామా నానిబాబుకు ఎక్కువ కూలి ఇస్తూ, కల్తీ వంట నూనె వ్యాపారం కొనసాగిస్తున్నాడు. ఈ కేసులో 15 లీటర్ల పరిమాణం గల 56 డబ్బాల (840 కేజీలు) కల్తీ నూనె, నాలుగు డబ్బాల క్రూడాయిల్ (60 కేజీలు), ఒక స్టౌ, రెండు గ్యాస్ సిలిండర్లు, అల్యూమినియం గంగాళంలో తయారవుతున్న 225 కేజీల కల్తీ నూనె, 26 ఖాళీ డబ్బాలు, రెండు వైట్ కలర్ ప్యాకెట్లు, రెండు డబ్బా మూతల ప్యాకెట్లు, కొబ్బరి తాళ్లను పోలీసులు స్వాదీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.1.50 లక్షలుగా నిర్ధారించారు.
ఈ కేసులో తొమ్మిది మంది నిందితులు కాగా ప్రధాన నిందితుడు బండారు ఫణి ప్రసాద్‌ను అరెస్టు చేసి, ప్రత్తిపాడు కోర్టులో హాజరు పరచి, రిమాండ్‌కు తరలించారు. ప్రజారోగ్యానికి హానికరమైన కల్తీ వంట నూనెలు తయారు చేసినా, విక్రయించినా కఠిన చర్యలు తప్పదని డీఎస్పీ శ్రీహరిరాజు హెచ్చరించారు.


