బాధిత కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్న వైఎస్సార్‌సీపీ నేతలు బొత్స సత్యనారాయణ, కన్నబాబు, గుడివాడ అమర్‌నాథ్ తదితరులు
ప్రైవేటీకరణ కుట్రలతోనే ఉక్కు కర్మాగారంలో ప్రమాదాలు
కార్మికుల ప్రాణాలతో చంద్రబాబు ప్రభుత్వం చెలగాటం
సమర్థులైన అధికారులను బదిలీ చేయడం వల్లే భారీ ప్రమాదం
ఇప్పటికైనా స్టీల్‌ప్లాంట్ ఉద్యోగుల తొలగింపు, వీఆర్‌ఎస్ ఆపాలి
ఎల్జీ పాలిమర్స్ తరహాలోనే మృతుల కుటుంబాలకు రూ.కోటి పరిహారమివ్వాలి
శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ, వైఎస్సార్‌సీపీ రీజినల్ కో– ఆర్డినేటర్ కురసాల కన్నబాబు
సాక్షి, విశాఖపట్నం: స్టీల్‌ప్లాంట్‌లో ప్రమాదం వెనుక కుట్ర కోణం దాగుందని, సంస్థ ప్రైవేటీకరణ కుట్రలతోనే ఉక్కు కర్మాగారంలో ప్రమాదాలు జరుగుతున్నాయని శాసనమండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, వైఎస్సార్‌సీపీ రీజినల్ కో– ఆర్డినేటర్ కురసాల కన్నబాబు అన్నారు. కార్మికుల ప్రాణాలతో చంద్రబాబు కూటమి ప్రభుత్వం చెలగాటం ఆడుతోందని మండిపడ్డారు. స్టీల్‌ప్లాంట్ నుంచి సమర్థులైన అధికారులను బదిలీ చేయడం వల్లనే భారీ ప్రమాదం జరిగిందని, ఇకనైనా సంస్థలో ఉద్యోగుల తొలగింపును ఆపాలని కోరారు.
విశాఖ కేజీహెచ్‌లో మృతుల కుటుంబ సభ్యులను మంగళవారం వైఎస్సార్‌సీపీ నేతలు పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రమాదంలో దుర్మరణం చెందిన కార్మికుల కుటుంబాలకు ఎల్జీ పాలిమర్స్ తరహాలో రూ.కోటి చొప్పున పరిహారమివ్వాలని, వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగమివ్వాలని డిమాండ్ చేశారు. ఆ పరిహారం కోసం వైఎస్సార్‌సీపీ రాజీ లేని పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. స్టీల్‌ప్లాంట్ ప్రమాద బాధితులను ఓదార్చడానికి, వారికి అండగా నిలబడడానికి వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం విశాఖ వస్తున్నారని చెప్పారు.
వేర్వేరు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులను వైఎస్ జగన్ పరామర్శించి, అనంతరం ప్లాంట్ యూనియన్ నేతలతో మాట్లాడతారని మాజీ మంత్రి కురసాల కన్నబాబు చెప్పారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు, మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్, గాజువాక నియోజకవర్గ సమన్వయకర్త తిప్పల దేవన్ రెడ్డి, కార్మిక నాయకుడు మంత్రి రాజశేఖర్, పార్టీ నేత రవిరెడ్డి పాల్గొన్నారు.
ప్రమాదం దురదృష్టకరం : బొత్స సత్యనారాయణ
స్టీల్‌ప్లాంట్‌లో జరిగిన భారీ ప్రమాదం అత్యంత దురదృష్టకరం. ఈ దుర్ఘటనలో ఇప్పటికే 8 మంది కార్మికులు దుర్మరణం చెందగా, సెవెన్¯హిల్స్ ఆస్పత్రిలో 90 శాతం కాలిన గాయాలతో ఉన్న మరో ముగ్గురి పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. కిమ్స్ ఆస్పత్రిలో 40 శాతం గాయాలతో మరో ముగ్గురు చికిత్స పొందుతున్నారు. వారందరూ కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాం.
టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను వారి తాబేదార్లకు కట్టబెట్టాలనే కుట్రతోనే వ్యవహరిస్తోంది. మిషనరీ నిర్వహణను పూర్తిగా గాలికొదిలేశారు. ఇప్పటికే శాశ్వత, కాంట్రాక్ట్ ఉద్యోగులు అంతా కలిపి దాదాపు 10 వేల మందిని అన్యాయంగా తొలగించారు. ఇకనైనా బలవంతపు వీఆర్‌ఎస్‌లను ఆపాలి. విశాఖ స్టీల్‌ప్లాంట్ కేవలం ఒక ఫ్యాక్టరీ కాదు.. అది ఆంధ్రుల ఆత్మగౌరవ ప్రతీక. కార్మికుల హక్కుల కోసం వైఎస్సార్‌సీపీ తరఫున రాజీలేని పోరాటం చేస్తాం.
లోకేశ్ తీరు దారుణం: కురసాల కన్నబాబు
మృతిచెందిన స్టీల్‌ప్లాంట్ కార్మికుల కుటుంబాలను పరామర్శించడానికి వచ్చిన మంత్రి నారా లోకేశ్... సమస్యలపై ప్రశ్నించిన కార్మిక సంఘాల నేతలపై ఆగ్రహం వ్యక్తం చేయడం సరికాదు. రాజకీయం చేస్తున్నారా మీరు..? మీ కుటుంబ సభ్యులు ఎవరైనా చనిపోయారా..?అంటూ మంత్రి మాట్లాడడం దారుణం. తోటి కార్మికులు చనిపోయారనే బాధ, ఆవేదనతో కార్మికుల పక్షాన ప్రశ్నించినందుకు కార్మిక సంఘాల నాయకులతో లోకేశ్ మాట్లాడిన తీరు చాలా దారుణంగా ఉంది.
అధికారంలో ఉన్న వారికి ఓపిక, సహనం, బాధ్యత ఉండాలి కదా..? నాడు ఎల్జీ పాలిమర్స్ ఘటన జరిగినప్పుడు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఉన్న మేమంతా, సీఎస్‌తో సహా ఇక్కడే ఉండి బాధితులకు అండగా నిలబడ్డాం. నేడు అధికారంలో ఉన్నవారు కనీస ఓపిక, సహనం లేకుండా కార్మిక సంఘాల నేతలపై నోరు పారేసుకోవడం శోచనీయం. ఇంత పెద్ద ఘటన జరిగితే సీఎం చంద్రబాబు స్పందించకపోవడం, పరిహారం ప్రకటించకపోవడం మరింత బాధాకరం.
శోకసంద్రంలోనూ అబద్ధాలే..
లోకేశ్, పవన్ దిగజారుడు వ్యాఖ్యలు
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను అడ్డుకున్న వైఎస్సార్‌సీపీ
ప్లాంట్ పరిరక్షణకు అసెంబ్లీలో తీర్మానం చేసిన అప్పటి వైఎస్ జగన్ ప్రభుత్వం
కూటమి అధికారంలోకి వచ్చాక కార్మికుల తొలగింపు, ఆంక్షలు, వేతన కోతలు
సాక్షి, విశాఖపట్నం: విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో సోమవారం జరిగిన ఘోర ప్రమాదం 8 మంది కార్మికులను బలితీసుకుని.. యావత్ దేశాన్ని తీరని విషాదంలోకి నెట్టేసింది. ఇంతటి విషాదంలోనూ టీడీపీ కూటమి నేతలు రాజకీయ లబ్ధి కోసమే పాకులాడారు. పరామర్శల పేరుతో ప్లాంట్ వద్దకు వచ్చిన డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్, మంత్రి నారా లోకేశ్ ఈ విషాద సమయంలోనూ అబద్ధాలతో రాజకీయం చేశారు. వైఎస్సార్‌సీపీ హయాంలో స్టీల్‌ప్లాంట్‌ని అమ్మేయాలని చూశారని.. తాము అధికారంలోకి వచ్చాకే విశాఖ ఉక్కును కాపాడామని నోటికొచ్చిన అబద్ధాలు ఆడారు. వారి మాటల్ని విన్న ఉక్కు కార్మికులు ‘చంద్రబాబు తరహాలో కన్నార్పకుండా అబద్ధాలు చెప్పడం వీళ్లకూ అలవాటైనట్టు ఉంది’ అంటూ చర్చించుకోవడం కనిపించింది.
అసెంబ్లీలో తీర్మానం చేసిన వైఎస్సార్‌సీపీ
వైఎస్సార్‌సీపీ అధికారంలో ఉన్నప్పుడు స్టీల్‌ప్లాంట్ పరిరక్షణ కోసం చేసిన అలుపెరగని పోరాటం విశాఖ ఉక్కు కార్మికులందరికీ తెలిసిందే. కేంద్రం ప్రైవేటీకరణ నిర్ణయం తీసుకున్న వెంటనే.. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపారు. దీంతో కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చర్యల్ని వాయిదా వేసుకుంది.
ప్లాంట్‌ను లాభాల బాట పట్టించేందుకు, సొంత గనులు (క్యాప్టివ్ మైన్స్) కేటాయిస్తే ప్లాంట్ దానంతట అదే నిలబడుతుందని ప్రధానికి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పదేపదే లేఖలు రాశారు. తమ ఐదేళ్ల పాలనలో ప్రైవేటీకరణను ఒక్క అడుగు కూడా ముందుకు పడనివ్వకుండా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఉక్కు కవచంలా నిలబడింది. ఆ వాస్తవాలను కప్పిపుచ్చి, ఇప్పుడు ఉక్కు పరిరక్షణను తమ ఖాతాలో వేసుకునేందుకు కూటమి నేతలు దిగజారుడు ఆరోపణలు చేస్తుండటంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
చంద్రబాబు వచ్చాకే.. పతనం అంచుకు..
‘మేం వచ్చి ప్లాంట్‌ను కాపాడాం’ అని గొప్పలు చెబుతున్నా.. వాస్తవానికి చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాతే స్టీల్ ప్లాంట్ పతనం అంచుకు చేరుకుంది. బ్లాస్ట్ ఫర్నేస్‌లు, ఉత్పత్తి యూనిట్లను ఒక్కొక్కటిగా మూసివేస్తూ ప్లాంట్‌ను నిర్వీర్యం చేసే కుట్రలకు తెరతీశారు. దశాబ్దాలుగా ఉక్కు కర్మాగారాన్నే నమ్ముకుని బతుకుతున్న వేలాది మంది కాంట్రాక్టు కార్మికులను నిర్దాక్షిణ్యంగా వీధిన పడేశారు. ఉన్న కార్మికులపై తీవ్రమైన ఆంక్షలు విధించారు.
నెలల తరబడి వేతనాలు ఇవ్వకుండా.. ఇచ్చినా 50 శాతం కోతలు విధిస్తూ ఉద్యోగులు, కార్మికుల పొట్టగొట్టారు. స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకోవాలంటూ నిపుణులైన ఉద్యోగుల్ని, అధికారుల్ని వేధింపులకు గురిచేశారు. ఇలా.. కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం, కార్మికుల పట్ల ఉన్న చిన్నచూపు కారణంగానే స్టీల్‌ప్లాంట్ ఉద్యోగులు తీవ్ర ఆరి్థక, మానసిక సంఘర్షణ నడుమ విధులు నిర్వర్తించాల్సిన దుస్థితి నెలకొంది. శోకసంద్రంలో ఉన్న బాధితుల వద్దకు వెళ్లిన కూటమి నేతలు తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు వైఎస్సార్‌సీపీపై బురద జల్లడాన్ని కార్మికులు తప్పు పడుతున్నారు.
‘గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్‌ని ప్రైవేటీకరణ చేయాలని చూస్తే మేం రోడ్లపైకి వచ్చి కొట్లాడాం. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రైవేటీకరణ ఆగింది’ – డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్
‘విశాఖ ఉక్కు సంక్షోభంలో ఉన్నప్పుడు చంద్రబాబు ప్రభుత్వం కేంద్రంతో సంప్రదింపులు జరిపి కర్మాగారానికి ఊరట కల్పించేలా చర్యలు తీసుకుంది’ – మంత్రి నారా లోకేశ్


