బాబు సర్కారు తీరుతో రెండో రోజు స్తంభించిన సేవలు
తూతూమంత్రం చర్చలతో సరి
వెనక్కు తగ్గని నెట్‌వర్క్ ఆస్పత్రుల యాజమాన్యాలు
బిల్లు బకాయిలు చెల్లిస్తేనే సేవలు పునరుద్ధరిస్తామని స్పష్టీకరణ
పేద, మధ్యతరగతి ప్రజల తీవ్ర అవస్థలు.. బిల్లులు
చెల్లించకపోవడంతో మురిగిపోయిన రూ.వెయ్యి కోట్ల నిధులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ సేవలు రెండో రోజూ స్తంభించాయి. చంద్రబాబు సర్కారు రూ.3 వేల కోట్ల బకాయిలు పెట్టడంతో ప్రైవేట్ నెట్‌వర్క్ ఆస్పత్రులు సమ్మెబాట పట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం కూడా రాష్ట్ర వ్యాప్తంగా నెట్‌వర్క్ ఆస్పత్రులు సేవలు నిలిపేసి నిరసన తెలిపాయి. ఉచిత వైద్య సేవలు అందించడం లేదని రోగులను ఆస్పత్రుల నుంచి వెనక్కు పంపేశాయి. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నామని, ప్రభుత్వం బకాయిలు చెల్లిస్తే గానీ ఉచిత సేవలు పునరుద్ధరించలేమని ఆస్పత్రుల ముందు యజమానులు పోస్టర్లు ప్రదర్శించారు. ఆస్పత్రుల మూకుమ్మడి సమ్మె నేపథ్యంలో నిరుపేద, మధ్యతరగతి కుటుంబాల రోగ పీడితులు తీవ్ర అవస్థలు పడ్డారు.
మొక్కుబడి చర్చలతో సరి
నెట్‌వర్క్ ఆస్పత్రులు బుధవారం నుంచి సమ్మెకు పిలవడంతో తొలి రోజు హడావుడిగా ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్(ఆశ) ప్రతినిధులతో ప్రభుత్వం చర్చలు జరిపింది. అయితే ఈ చర్చలు కేవలం మొక్కుబడిగా నిర్వహించినవేనని రుజువైంది. సమ్మెను వెంటనే విరమింపజేసి, ప్రజలు అవస్థలు పడకుండా సేవలు పునరుద్ధరించేలా ప్రభుత్వం ఏ చర్యలు తీసుకోలేదు. ‘రూ. మూడు వేల కోట్ల బకాయిల్లో రూ.వెయ్యి కోట్లు రెండు వారాల్లో విడుదల చేస్తాం. ఈ అరకొర నిధుల విడుదలపైనా వచ్చే సోమవారం స్పష్టత ఇస్తాం.’ అంటూ ప్రభుత్వం బీద అరుపులు పలికింది. అయితే ఇప్పటికే ప్రభుత్వం చేతిలో పలు సందర్భాల్లో మోసపోయిన నెట్‌వర్క్ ఆస్పత్రుల యజమానులు నిధుల విడుదలపై స్పష్టత వచ్చాకే సమ్మె విరమిస్తామని తెగేసి చెప్పారు. యథావిధిగా రెండో రోజు సమ్మె కొనసాగించారు. ఈ క్రమంలో ఆస్పత్రుల మొర ఆలకించి పెండింగ్ నిధులు విడుదల చేసి, సేవలు పునరుద్ధరించేలా కనీసం చంద్రబాబు సర్కార్ చొరవ చూపలేదు.
మురిగిపోయిన దాదాపు రూ.వెయ్యి కోట్ల నిధులు
2025–26 ఆర్థిక సంవత్సరం మంగళవారంతో ముగిసింది. ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన చెల్లింపుల కోసం దాదాపు రూ. వెయ్యి కోట్ల బిల్లులను గతంలో ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ఆర్థిక శాఖకు పంపింది. ఆర్థిక సంవత్సరం ముగియడానికి వారం ముందు ప్రభుత్వానికి ఆశ సమ్మె నోటీసు కూడా ఇచ్చింది. ఈ క్రమంలో సీఎఫ్‌ఎంఎస్‌లో పెండింగ్‌లో ఉన్న రూ.వెయ్యి కోట్ల బిల్లులను చెల్లించి ఉంటే ఆస్పత్రులు సమ్మెలోకి వెళ్లే పరిస్థితులు ఉండేవి కావు. సమ్మె నోటీసు ఇచ్చి సేవలు ఆపేస్తామని హెచ్చరించినా ప్రభుత్వం నిధులు విడుదల చేయలేదు. ఆర్థిక సంవత్సరం ముగియడంతో 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.వెయ్యి కోట్ల నిధులు ముగిపోయినట్టేనని వెల్లడవుతోంది.


