మాంసాన్ని పరిశీలిస్తున్న డాక్టర్ హజరత్, ఎస్సై
విశాఖ నుంచి బెంగళూరు వెళ్తున్న బస్సులో పట్టుకున్న ‘ప్రకాశం’ పోలీసులు
గో మాంసమా, కాదా అనే విషయం నిర్ధారణకు శాంపిల్స్ హైదరాబాద్‌లోని ల్యాబ్‌కు..
సింగరాయకొండ: ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో అక్రమంగా తరలిస్తున్న 550 కిలోల పశు మాంసాన్ని ప్రకాశం జిల్లా పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాలు.. విశాఖపట్నం నుంచి బెంగళూరుకు వెళ్తున్న ఎస్‌వీడీ వేదాంశ్ ట్రావెల్స్ బస్సులో గో మాంసాన్ని అక్రమంగా తరలిస్తున్నట్లు వచ్చిన సమాచారంతో ఎస్సై బి.మహేంద్ర శుక్రవారం తెల్లవారుజామున సింగరాయకొండ సమీపంలో తనిఖీలు చేశారు. అదే సమయంలో వచ్చిన ఎస్‌వీడీ వేదాంశ్ ట్రావెల్స్ బస్సును తనిఖీ చేయగా.. 11 ధర్మాకోల్ బాక్సుల్లో ప్యాకింగ్ చేసిన మాంసం బయటపడింది.
దీంతో విజయవాడకు చెందిన బస్సు డ్రైవర్ గుజ్జుల కిరణ్‌కుమార్‌రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మండల పశువైద్యాధికారి హజరత్ మాంసాన్ని పరిశీలించి.. శాంపిల్స్ సేకరించారు. వాటిని హైదరాబాద్‌లోని ల్యాబ్‌కు పంపి.. గో మాంసమా, కాదా అన్నది నిర్ధారించుకోవాల్సి ఉందని పోలీసులు తెలిపారు. దీనిని ఎవరు పంపిస్తున్నారో.. ఎవరు బుక్ చేసుకున్నారనే సమాచారం కోసం విచారణ చేయాల్సి ఉందని చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై బి.మహేంద్ర వెల్లడించారు.


