కొద్ది నెలల వ్యవధిలో 4 మాతృ మరణాలు
42 మంది నవజాత శిశువుల మృతి
ప్రైవేట్ ఆస్పత్రులపై కొరవడుతున్న పర్యవేక్షణ
కలగానే జీరో శాతం మాతా శిశు మరణాలు
ప్రతి మహిళ జీవితంలో అమ్మ కావడం అద్భుత ఘట్టం. బిడ్డ కోసం ఎన్నో కలలుగన్న ఆ తల్లి పొత్తిళ్లలో చేరిన పాపాయిని తనివితీరా చూసుకోకుండానే తనువు చాలిస్తే.. నవమాసాలు మోసిన ఆశల రేడుకు పురిట్లోనే నూరేళ్లు నిండిపోతే.. ఆ ఇంట జీవితాలు తల్లకిందులై పోతాయి. మంత్రసానుల నుంచి పురిటి నొప్పులు లేకుండానే ప్రసవం చేసేంతగా వైద్యం అభివృద్ధి చెందినా జీరో శాతం మాతాశిశు మరణాల లక్ష్యం కలగానే మిగులుతోంది.గత కొద్ది నెలల్లో పశ్చిమ గోదావరి జిల్లాలో నలుగురు మాతృమూర్తులు, 42 మంది నవజాత శిశువులు మృతిచెందారు.
సాక్షి, భీమవరం: ఏప్రిల్ నుంచి సెపె్టంబరు వరకు గత ఆరు నెలల కాలంలో పశ్చిమ గోదావరి జిల్లాలోని 42 ప్రభుత్వ ఆస్పత్రుల పరిధిలో 3,561 ప్రసవాలు జరిగితే వీటిలో సిజేరియన్లు 2,102 ఉన్నాయి. ప్రభుత్వ రికార్డుల్లో నమోదైన మేరకు 103 ప్రైవేట్ ఆస్పత్రుల్లో 5,452 ప్రసవాలు జరగగా వాటిలో అత్యధికంగా 4,135 సిజేరియన్ ప్రసవాలు ఉన్నాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో 59 శాతం, ప్రైవేట్ ఆస్పత్రుల్లో 79 శాతం సిజేరియన్ ప్రసవాలు జరిగాయి.
ఈ ఆర్థిక సంవత్సరం మూడు క్వార్టర్లలో నమోదైన నాలుగు మాతృ మరణాలు డెలివరీలు జరిగింది ప్రైవేట్ ఆస్పత్రుల్లోనే కావడం గమనార్హం. ప్రసూతి సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తల్లో కొన్ని ప్రైవేట్ ఆస్పత్రులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. సాధారణ ప్రెగ్నెన్సీ కేసును ఎలా ట్రీట్ చేయాలి, హై రిస్క్ ప్రెగ్నెన్సీ కేసును ఏ విధంగా ట్రీట్ చేయాలి అనే వ్యత్యాసాన్ని పూర్తిగా అవగాహన చేసుకున్న తర్వాత మాత్రమే వైద్యాన్ని అందించాలి. వారికి అనుకూలంగా లేని కేసులను మెరుగైన వసతులు ఉన్న మరో ఆస్పత్రికి రిఫర్ చేయాలి.
చాలా ప్రైవేట్ ఆస్పత్రులు ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయి. వైద్యం మొదలుపెట్టి పరిస్థితి చేజారిపోయాక మరో ఆస్పత్రికి సిఫార్సు చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో వారి నిర్లక్ష్యం మాతా శిశు మరణాల రూపంలో అయినవారికి తీరని శోకం, ఆర్థిక భారం మిగుల్చుతున్నాయి. ఇలాంటి ఆస్పత్రులపై వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఏం చర్యలు తీసుకుంటున్నారనేది ప్రశ్నార్థకం.
» ‘‘పాలకోడేరుకు చెందిన గర్భిణి మే 24న ఆకివీడులోని ప్రైవేట్ ఆస్పత్రిలో బిడ్డకు జన్మనిచ్చింది. ప్రసవం అనంతరం ఆమె అనారోగ్యానికి గురికావడంతో మంగళగిరి ఎయిమ్స్‌కు తరలించగా చికిత్స పొందుతూ 27న మృతిచెందింది. ఇన్ఫెక్షన్ వ్యాపించడం వల్ల మృతిచెందినట్టుగా విచారణలో గుర్తించారు.’’
» ‘‘గొల్లవానితిప్పకు చెందిన గర్భిణి ఆగస్టు 12న భీమవరంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో పురుడుపోసుకుంది. మరుసటి రోజున సుగర్ ఎక్కువగా ఉండటంతో గుంటూరు జీజీహెచ్‌కు తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందింది. ఫిట్స్ ఆగకుండా రావడం వలన మృతిచెందినట్టుగా నిర్ధారించారు.’’
» ‘‘తాడేపల్లిగూడెంకు చెందిన గర్భిణి జూలై 2 స్థానికంగా ప్రైవేట్ ఆస్పత్రిలో బిడ్డకు జన్మనిచ్చింది. ప్రసవానంతరం తీవ్ర రక్తస్రావంతో అదేరోజు రాత్రి మృతిచెందింది.’’
» ‘‘మోగల్లుకు చెందిన గర్భిణి గత నెల 29న డెలివరీ కోసం భీమవరంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేరింది. రెండు రోజుల తర్వాత మెరుగైన వైద్యం కోసం అక్కడి వైద్యుల సూచన మేరకు స్థానికంగా మరో ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. 2న బిడ్డకు జన్మనిచ్చిన ఆ తల్లి 3వ తేదీన కన్నుమూసింది. ఈ ఘటనపై ప్రస్తుతం విచారణ జరుగుతోంది.’’
» ‘‘ఈ ఏడాది ఏప్రిల్ నుంచి సెప్టెంబరు వరకు పశ్చిమ గోదావరి జిల్లాలో 42 మంది నవజాత శిశువులు (పుట్టిన నాటి నుంచి 28 రోజుల లోపు) మృతిచెందారు. వీరిలో ఆక్సిజన్ సమస్యతో నలుగురు, నెలలు నిండకుండా పుట్టిన వారు ఐదుగురు, తక్కువ బరువుతో పుట్టిన వారు ఏడుగురు, గుండె సంబందిత సమస్యలతో ముగ్గురు, ఇతర అనారోగ్య కారణాలతో మిగిలిన వారికి పరిట్లోనే నూరేళ్లు నిండిపోయాయి. 29 రోజుల వయస్సు నుంచి ఏడాదిలోపు శిశువులు తొమ్మిది మంది మృతిచెందారు.’’
ప్రసవ వేదన
గర్భం దాల్చినప్పటి నుంచి ప్రసవం వరకు స్కానింగ్‌లు, రక్త పరీక్షల పేరిట నిరంతర వైద్య పర్యవేక్షణ ఉంటున్నా నవజాతి శిశువుల్లో ఆరోగ్య సమస్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. వేలల్లో వెచ్చించి వైద్యం చేయించుకున్నాం, పండంటి బిడ్డకు జన్మిస్తాడనుకుంటే పూర్తిగా నెలలు నిండకుండా, తక్కువ బరువుతో, ఆరోగ్య సమస్యలతో పుడుతున్నారు.
ఇందుకు కొందరిలో సాంకేతికంగా జన్యుపరమైన కారణాలుంటే మరికొందరిలో సరైన పోషణ, వైద్యం అందకపోవడం కారణంగా తెలుస్తోంది. గత ఐదు నెలల్లో జరిగిన ప్రసవాల్లో జిల్లాలో నెలలు నిండకుండానే 525 మంది, తక్కువ బరువుతో 741 మంది శిశువులు జ న్మించారు.
ఎప్పటికప్పుడు సమీక్షలు
జిల్లాలో జీరో శాతం మాతా శిశు మరణాలు లక్ష్యంగా కలెక్టర్ నాగరాణి ఎప్పటికప్పుడు సంబంధిత అధికారులతో సమీక్షిస్తున్నారు. హై రిస్క్ ప్రెగ్నెన్సీ కేసుల్లో చివరి వరకు వేచి చూడకుండా గర్భం దాల్చిన నాటి నుంచే ఎక్కువ జాగ్రత్త తీసుకోవాలని, ఒకవేళ గర్భవతి అయితే ఇబ్బంది ఉన్నప్పుడు వారికి ముందే అవగాహన కల్పించాలని సూచిస్తున్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఆస్పత్రులపై చర్యలకు ఆదేశిస్తున్నారు.


