అనంతపురం అర్బన్: అర్హులైన ప్రతి రైతుకూ పంటల బీమా వర్తింపజేయాలని జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ అధికారులను ఆదేశించారు. జాయింట్ కలెక్టర్ సోమవారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో జిల్లాస్థాయి మానిటరింగ్ కమిటీ (డీఎల్‌ఎంసీ) సమావేశం నిర్వహించారు. రబీ 2024–25, ఖరీఫ్ 2025 సీజన్లకు సంబంధించి పంటల బీమా పరిధిలో అర్హులు, అనర్హులైన రైతుల జాబితాను ఈ సందర్భంగా జేసీ ధ్రువీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని, వారికి ప్రయోజనం చేకూర్చే విధంగా చర్యలు ఉండాలని ఆదేశించారు. ముఖ్యంగా ప్రధానమంత్రి ఫసల్ బీమా, వాతావరణ ఆధారిత పంటల బీమా కింద అర్హులైన రైతులకు బీమా వర్తింపజేయాలన్నారు. అనంతరం బీమా పోస్టర్లను జాయింట్ కలెక్టర్ విడుదల చేశారు. సమావేశంలో జిల్లా వ్యవసాయాధికారి సాలురెడ్డి, అధికారులు, కేంద్ర సాధారణ బీమా కంపెనీల ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
పోలింగ్ నాడు వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలి
అనంతపురం సిటీ: గ్రామపంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఈ నెల 26, 29, డిసెంబర్ 2న జరిగే పోలింగ్ రోజున స్థానిక దుకాణాలు, వాణిజ్య సంస్థల ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవు మంజూరు చేయాలని సంబంధిత యాజమాన్యాలను జిల్లా కార్మిక శాఖ ఉప కమిషనర్ జి.లక్ష్మీనరసయ్య ఆదేశించారు. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ కమిషనర్ గంధం చంద్రుడు జారీ చేసిన ఉత్తర్వుల మేరకు ఎన్నికలు జరిగే ప్రాంతాల్లోని సంబంధిత దుకాణాలు, వాణిజ్య సంస్థల యాజమాన్యాలు తమ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, కార్మికులకు ఓటు హక్కును వినియోగించుకునేందుకు వీలుగా వేతనంతో కూడిన సెలవు కల్పించాలని తెలిపారు.
2.48 లక్షల ఓటర్లకు మరోసారి ఈఎఫ్‌లు అందజేస్తాం
అనంతపురం అర్బన్: జిల్లాలో ఆబ్సెంట్, షిఫ్టెడ్, డెడ్, డూప్లికేట్ (ఏఎస్‌డీడీ) జాబితాలో ఉన్న 2,48,087 మంది ఓటర్లకు ఈ నెల 30వ తేదీలోపు మరోసారి ఎన్యుమరేషన్ ఫారా(ఈఎఫ్)లను అందజేస్తామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్‌కు కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఆనంద్ తెలిపారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్)పై సీఈఓ సోమవారం విజయవాడ నుంచి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. కలెక్టరేట్ నుంచి కలెక్టర్‌తో పాటు అసిస్టెంట్ కలెక్టర్ సుయాష్‌కుమార్, డీఆర్‌ఓ మలోల పాల్గొన్నారు. జిల్లాలో ఎస్‌ఐఆర్ ప్రక్రియపై సీఈఓకు ఈ సందర్భంగా వివరించారు. ఓటరు నమోదుకు (ఫారం–6)సంబంధించి 4,296 క్లెయిమ్‌లు, ఓటు తొలగింపునకు (ఫారం–7) 35 దరఖాస్తులు, ఓటరు వివరాల మార్పునకు (ఫారం–8) సంబంధించి 1,154 క్లెయిమ్‌లు వచ్చాయని తెలిపారు. వాటిని నిర్దేశిత గడువులోగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. కార్యక్రమంలో ఎన్నికల విభాగం డీటీ కనకరాజ్, ఎస్‌ఏ శామ్యూల్ బెంజిమన్, తదితరులు పాల్గొన్నారు.


