కుందుర్పి: పంచాయతీ ఎన్నికల్లోనూ ‘పచ్చ’పార్టీ మూకల పైశాచికం పెచ్చుమీరింది. పంచాయతీ ఎన్నికల సందర్భంగా గ్రామాల్లో ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. సోమవారం కుందుర్పి మండలం మలయనూరు పంచాయతీలో ఓ వైపు టీడీపీ నాయకులు సర్పంచ్ అభ్యర్థి తరఫున ప్రచారం చేసుకుంటున్నారు. అదే సమయంలో ఎన్నికల నిబంధనలకు లోబడి వైఎస్సార్‌సీపీ మలయనూరు అభ్యర్థి రాయన్న ఆటో తిప్పుతూ ప్రచారం చేసుకుంటున్నాడు. దీంతో ప్రచారం నిర్వహిస్తున్న టీడీపీ నాయకులు ఒక్కసారిగా రంగస్వామిని ఆటో నుంచి కిందకు లాగి తీవ్రంగా దాడి చేశారు. దాడిలో తీవ్రంగా గాయపడిన రంగస్వామిని చికిత్స నిమిత్తం దళిత సంఘాల నాయకులు, వైఎస్సార్‌సీపీ శ్రేణులు కళ్యాణదుర్గం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. రంగస్వామిని టీడీపీ నాయకులు అతిదారుణంగా కొట్టంపై దళిత సంఘాలు నిరసన తెలియజేశారు. రంగస్వామిపై దాడి చేసిన టీడీపీ మూకలపై చర్యలు తీసుకోవాలని ఎమ్మార్పీఎస్ నాయకుడు లక్ష్మణమూర్తి కళ్యాణదుర్గం డీఎస్పీకి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.


