పట్టలేనంత ఆనందం | - | Sakshi
Sakshi News home page

పట్టలేనంత ఆనందం

Nov 23 2026 5:18 AM | Updated on Nov 23 2026 5:18 AM

ప్రశాంతి నిలయం: పుట్టపర్తి ప్రశాంతి నిలయంలోని పూర్ణచంద్ర ఆడిటోరియంలో ఆదివారం సత్యసాయి డీమ్డ్‌ యూనివర్సిటీ స్నాతకోత్సవం ఘనంగా జరిగింది. వేలాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ముఖ్య అతిథులతో ఆ ప్రాంతమంతా సందడిగా మారింది. ముఖ్య అతిథిగా హాజరైన గవర్నర్‌ జస్టిస్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌, సత్యసాయి సెంట్రల్‌ ట్రస్ట్‌ మేనేజింగ్‌ ట్రస్టీ ఆర్‌జె.రత్నాకర్‌రాజు, యూనివర్సిటీ ఛాన్సలర్‌ చక్రవర్తి, వైస్‌ ఛాన్సలర్‌ రాఘవేంద్ర ప్రసాద్‌, ట్రస్ట్‌ సభ్యులు డాక్టర్‌ మోహన్‌, నాగానంద సత్యసాయి మహాసమాఽధి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బ్రాస్‌ బ్యాండ్‌ వాయిద్యాల నడుమ యూనివర్సిటీ సభ్యులతో కలసి యజుర్‌ మందిరం నుంచి స్నాతకోత్సవ వేదిక అయిన పూర్ణ చంద్ర ఆడిటోరియానికి చేరుకున్నారు. వేదపఠనం తర్వాత ఫౌండర్‌ ఛాన్సలర్‌ సత్యసాయి డిజిటల్‌ స్క్రీన్‌పై నుంచి ఐ ఓపెన్‌ కాన్వొకేషన్‌ అనగానే స్నాతకోత్సవాన్ని ప్రారంభించారు. వైస్‌ ఛాన్సలర్‌ రాఘవేంద్ర ప్రసాద్‌ ప్రారంభోపన్యాసం చేశారు. యూనివర్సిటీ 2025–26లో సాధించిన ప్రగతిని వివరించారు. ఛాన్సలర్‌ చక్రవర్తి ఆమోదం తరువాత గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ చేతులు మీదుగా ప్రతిభ కనబరిచిన 13 మంది విద్యార్థులకు బంగారు పతకాలు, 14 మంది పరిశోధనా విద్యార్థులకు డాక్టరేట్లు, 530 మందికి డిగ్రీలు ప్రదానం చేశారు.

ఉన్నత లక్ష్యంతో ముందుకెళ్లాలి

గవర్నర్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌ విద్యార్థులనుద్దేశించి మాట్లాడారు. కష్టపడి చదివి పట్టభద్రులుగా పట్టాలు అందుకోవడం ప్రతి విద్యార్థి జీవితంలో ఎంతో ఆనందదాయకమైన ఘట్టమన్నారు. విద్యావంతులైన యువత కృత్రిమ మేధస్సు వంటి ఆధునిక సాంకేతికతను బాధ్యతాయుతంగా వినియోగించుకుని సమాజ హితం కోసం చక్కటి ఫలితాలు రాబట్టాలని సూచించారు. సృజనాత్మకత, నూతన ఆవిష్కరణలు, ఔత్సాహిక పారిశ్రామిక దృక్పథాన్ని పెంపొందించుకోవాలన్నారు. నిజాయితీతో కూడిన ప్రయత్నంలో వైఫల్యాలు సహజమని, విజయం కూడా అంతిమం కాదని, ప్రయత్నం మాత్రమే శాశ్వతమన్నారు.

అలరించిన ‘హృదయ వందనం’

సత్యసాయి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హయ్యర్‌ లర్నింగ్‌ విద్యార్థులు ‘హృదయ వందనం’ పేరుతో ఆదివారం సాయంత్రం సాయికుల్వంత్‌ సభా మందిరంలో సత్యసాయి ఆధ్యాత్మిక వైభవాన్ని, సేవా నిరతిని కాంక్షిస్తూ సంగీత కచేరీ నిర్వహించారు. చక్కటి భక్తిగీతాలతో నిర్వహించిన కార్యక్రమం భక్తులను మైమరపించింది.

ప్రశాంతి నిలయంలో సత్యసాయి డీమ్డ్‌ యూనివర్సిటీ 45వ స్నాతకోత్సవం

ముఖ్య అతిథిగా హాజరైన గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌

ప్రతిభ కనబరిచిన 13 మందికి

బంగారు పతకాలు

14 మందికి పీహెచ్‌డీ పట్టాలు

530 మందికి డిగ్రీ పట్టాల ప్రదానం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement